రోజురోజుకూ ముదురుతున్న పొగాకు రైతుల సంక్షోభం 

రెండు సీజన్లలోనే రూ.3,278 కోట్ల నష్టం

ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి యం.వి.ఎస్. నాగిరెడ్డి డిమాండ్‌

గుడివాడ: రాష్ట్రంలో పొగాకు రైతులు రోజురోజుకూ తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్‌ చైర్మన్ యం.వి.ఎస్. నాగిరెడ్డి డిమాండ్ చేశారు. పొగాకు ధరలు నిరంతరం పడిపోతుండగా, ఉత్పత్తి వ్యయం పెరుగుతుండటంతో రైతులు వేల కోట్ల రూపాయల నష్టాలను చవిచూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

2023-24 మార్కెటింగ్ సీజన్‌లో 215.35 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి కిలోకు సగటు ధర రూ.288.65 లభించగా, 2024-25 సీజన్‌లో 240.64 మిలియన్ కిలోల ఉత్పత్తికి సగటు ధర రూ.248.86కు పడిపోయిందన్నారు. కిలోకు రూ.39.79 ధర తగ్గడంతో పాటు ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల రైతులు మొత్తం రూ.1,198 కోట్ల మేర నష్టపోయారని వివరించారు. అదేవిధంగా 2025-26 రబీ సీజన్‌లో పరిస్థితి మరింత దిగజారిందన్నారు. రాష్ట్రంలో సుమారు 260 మిలియన్ కిలోల ఉత్పత్తి అంచనా ఉండగా, జూన్ 15 నాటికి సగటు అమ్మకం ధర కిలోకు రూ.227.78కు పడిపోయిందని చెప్పారు. 2023-24 సీజన్‌తో పోలిస్తే కిలోకు సుమారు రూ.60 ధర తగ్గిందని, పెరిగిన ఉత్పత్తి వ్యయం కలుపుకుంటే కిలోకు రూ.80 వరకు రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ లెక్కన ప్రస్తుత సీజన్‌లోనే రైతులకు సుమారు రూ.2,080 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.

గత రెండు సీజన్లలో కలిపి రాష్ట్ర పొగాకు రైతులకు రూ.3,278 కోట్ల మేర నష్టం సంభవించిందని నాగిరెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఒంగోలు దక్షిణాది నల్ల నేలలు, తేలిక నేలల పరిధిలోని వేలం కేంద్రాల్లో సగటు ధరలు రూ.200 కంటే దిగువకు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. కొన్ని కేంద్రాల్లో కనిష్ఠ ధర కిలోకు రూ.160 మాత్రమే పలుకుతోందని పేర్కొన్నారు. వేలం కేంద్రాల్లో తిరస్కరించబడుతున్న బేళ్ల శాతం కూడా ఆందోళనకరంగా పెరుగుతోందన్నారు. తిరస్కరించిన బేళ్లను వెనక్కి తీసుకెళ్లేందుకు ఒక్కో బేలుకు రూ.2 వేల వరకు అదనపు ఖర్చు అవుతోందని తెలిపారు. మరోవైపు ఈ సీజన్‌లో 65 వేలం రోజులు గడిచినా, ఉత్పత్తిలో చాలా తక్కువ పరిమాణమే విక్రయమైందని, రైతులు మార్కెట్ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోళ్లు చేపట్టి రైతులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. ప్రస్తుతం రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం అలాంటి చర్యలపై దృష్టి పెట్టకపోవడం బాధాకరమన్నారు. మంచి దిగుబడులు, నాణ్యమైన ఉత్పత్తి వచ్చినా గిట్టుబాటు ధరలు లేకపోతే రైతులకు లాభం ఉండదని నాగిరెడ్డి పేర్కొన్నారు. అధిక శాతం కౌలు రైతులు, సన్నకారు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించే విధానాలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లడమే కాకుండా, దాని ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కూడా పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Back to Top