నిన్న సాయికృష్ణ.. నేడు క్రాంతికుమార్‌

విజయవాడ పోలీసుల వేధింపులతో వరుస విషాదాలు

చంద్రబాబు, లోకేష్‌ను మెప్పించేందుకే వేటాడుతున్నారా?

కొమ్మూరి కనకారావు ఫైర్‌

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు.

విజయవాడలో పోలీస్‌ స్టేషన్లు చిత్రహింసల కేంద్రాలుగా మారాయి.

తాజాగా క్రాంతికుమార్‌ మరణం వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.

కృష్ణలంక పోలీసుల వేధింపులు భరించ లేక మాదిగ యువకుడు క్రాంతికుమార్‌ ఆత్మహత్య 

ఆత్మహత్యకు ముందు క్రాంతికుమార్‌ స్వయంగా వీడియో వాంగ్మూలం 

క్రాంతికుమార్‌ తండ్రి సీపీకి ఫిర్యాదు చేసినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. 

క్రాంతికుమార్‌ మరణానికి కారణమైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన కొమ్మూరి కనకారావు

తాడేపల్లి: విజయవాడలో పోలీసులు యమకింకరుల్లా మారారని, వారి వేధింపులు, హింస వల్ల యువకులు బలవుతున్నారని, తాజాగా క్రాంతికుమార్‌ అనే యువకుడి ఆత్మహత్య ఘటన, ఇక్కడి దారుణ పరిస్థితికి అద్దం పడుతోందని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు గుర్తు చేశారు. విజయవాడ, కృష్ణలంక పోలీసుల వేధింపుల వల్ల దళిత యువకుడు క్రాంతికుమార్‌ ఆత్మహత్య చేసుకోవడం విషాదకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే, ఇలా వేధింపులు, హింసతో యువతను బలి తీసుకోవడం అత్యంత హేయమని అభివర్ణించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గాడి తప్పిందని, వారు భారత రాజ్యాంగం వదిలి, రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని భుజాన వేసుకున్నారని ఆక్షేపించారు.
    క్రాంతికుమార్‌ మరణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కొమ్మూరి కనకారావు డిమాండ్‌ చేశారు.
ప్రెస్‌మీట్‌లో కొమ్మూరి కనకారావు ఏమన్నారంటే..

సీఐ వేధింపులకు యువకుడు బలి:
    విజయవాడలో పోలీస్‌ స్టేషన్లు చిత్రహింసల కేంద్రాలుగా మారాయి. గాదె సాయికృష్ణ ఘటన తర్వాత అదే కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో క్రాంతికుమార్‌ మరణం వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కృష్ణలంక పోలీసుల వేధింపులు భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ క్రాంతికుమార్‌ స్వయంగా వీడియో వాంగ్మూలం ఇచ్చాడు. తనను సీఐతో పాటు, పోలీసులు వేటాడి, వెంటాడి వేధిస్తున్నారని ఆరోపిస్తూ విషపు గుళికలు సేవించినట్లు వీడియోలో పేర్కొన్నాడు. ఈ ఘటనపై ఆయన తండ్రి సీపీకి ఫిర్యాదు చేసినా బాధ్యులపై చర్యలు తీసుకోకుండా నామమాత్రపు కేసుతో చేతులు దులుపుకోవడం దారుణం.

పోలీసులకు ఆ హక్కు ఎవరిచ్చారు?:
    క్రాంతికుమార్‌పై కేసులు ఉంటే వాటిపై కోర్టు తీర్పు చెప్పాలి. కానీ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి ఒక వ్యక్తిని వేధించి, వెంటాడే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారు? తన మరణానికి కారణాలను క్రాంతికుమార్‌ స్వయంగా వీడియోలో వెల్లడించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆయన తండ్రి కమిషనర్‌కు ఫిర్యాదు చేసి చిత్రహింసలు, కులవివక్ష గురించి వివరించినా ఏ పోలీసులపై చర్యలు తీసుకోలేదు. మూడు నెలలుగా కొనసాగిన వేధింపులు, మళ్లీ పోలీస్‌ స్టేషన్‌కు పిలుస్తారనే భయంతోనే క్రాంతికుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ నాగరాజుతో పాటు, విజయవాడ పోలీసుల వేధింపులే ఈ మరణానికి కారణం.
    అందుకే క్రాంతికుమార్‌ మరణానికి కారణమైన సీఐ నాగరాజుతో పాటు, పోలీసులందరిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కొమ్మూరి కనకారావు డిమాండ్‌ చేశారు.

Back to Top