తాడేపల్లి: బీచ్ షాక్స్ పేరుతో సముద్ర తీరాల్లో మద్యం విక్రయాలు చేయాలన్న ఆలోచనలో ఉన్న శ్రద్ధ రైతులను ఆదుకోవడంలో పదో వంతు కూడా కూటమి ప్రభుత్వానికి లేదని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా రెండేళ్ల పాలనలో రైతులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని, మొక్కజొన్న, శెనగ, పొగాకు, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదన్నారు. కేంద్రంతో మాట్లాడి పంటలకు మద్ధతు ధర దక్కేలా ప్రయత్నం చేయాలన్న కనీస జ్ఞానం కూడా లేకపోవడం సిగ్గుచేటన్నారు. రెండేళ్లలో ఆత్మహత్య చేసుకున్న ఏ ఒక్క రైతు కుటుంబానికి పైసా పరిహారం కూడా అందించి ఆదుకోలేదని మండిపడ్డారు. ఉచిత విద్యుత్, 90 శాతం సబ్సిడీకి డ్రిప్టు పరికరాలు అందించి రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా వైయస్సార్ గారు తీర్చిదిద్దితే అది తన చొరవేనని చంద్రబాబు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్‌రెడ్డి ఆక్షేపించారు. ప్రెస్‌మీట్‌లో గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే... కూటమి పాలనలో ఎక్కవగా నష్టపోయింది రైతులే: కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కవగా నష్టపోయింది రైతులే. వైయస్ఆర్‌సీపీ హయాంలో వ్యవసాయం పండగలా సాగితే చంద్రబాబు వచ్చాక దండగ అనే విధంగా మార్చేశాడు. రైతులకు కనీసం సబ్సిడీ ఎరువులు, సబ్సిడీ విత్తనాలు కూడా అందించలేని దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని చంద్రబాబు నడిపిస్తున్నాడు. రైతులు పండించిన ఏ పంటకూ కనీసమ మద్ధతు ధరలు దక్కక అప్పులపాలవుతున్న పరిస్థితులు. దీంతో గడిచిన రెండేళ్లలో ఆత్మహత్యలు చేసుకున్న ఏ ఒక్క బాధిత కుటుంబానికి కూడా పరిహారం అందించిన పాపాన పోలేదు. రైతు సమస్యలపై వైయస్ జగన్ గారు ప్రస్తావిస్తే, వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తే ఆయన కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగి పదే పదే వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. మొక్కజొన్న, పొగాకు, శనగ, వేరుశెనగ రైతులు నిండా మునిగిపోయారు. మామిడి రైతుల బాధలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేంద్రంతో మాట్లాడి న్యాయం చేసే కనీస ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరువైంది. నాడు పండగలా వ్యవసాయ రంగం: వైయస్ఆర్‌సీపీ హయాంలో కరోనా లాంటి సంక్షోభంతో రెండేళ్లు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయినా ఏ ఒక్క సంక్షేమ పథకాన్నీ కూడా ఆపలేదు. ఆర్బీకే సెంటర్ల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలవడం జరిగింది. ఖరీఫ్, రబీ సీజన్లలో అదును రాకముందే సబ్సిడీకి విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేవాళ్లం. సీఎం యాప్ ద్వారా రైతులకు మద్ధతు ధరలు దక్కేలా మార్కెట్ ని నిరంతరం మానిటరింగ్ చేసే గొప్ప వ్యవస్థ ఉండేది. పంటలకు ఈ క్రాపింగ్ జరిగేది. మట్టి పరీక్షలు నిర్వహించేవాళ్లం. సీజన్ ముగియకుండానే పంట నష్టపరిహారం అందించి రైతులకు అండగా నిలిచిన గొప్ప నాయకుడు వైయస్ జగన్ గారు. పెట్టుబడి సాయం కింద ఐదేళ్లలో ఒక్కో రైతుకి రూ.67,500 అందించాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభవ అని పేరు మార్చి కేంద్రంతో సంబంధం లేకుండా ఒక్కో రైతుకి ఏడాదికి రూ. 20 వేలు పంట పెట్టుబడికి అందిస్తానని హామీ ఇచ్చాడు. మొదటి ఏడాది ఒక్కరూపాయి సాయం అందించలేదు. రెండో ఏడాది కూడా దాదాపు 8 లక్షల మంది రైతులకు పైగా పథకానికి అనర్హులుగా చేశారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేస్తే నేడు కూటమి ప్రభుత్వం కౌలు రైతులను అస్సలు రైతులుగానే పరిగణించడం లేదు. విలాసాల కోసమైతే ఖర్చు చేస్తారు. కానీ..: గతంలో రుణమాఫీ చేస్తానని హమీ ఇచ్చి ఎలాగైతే మాసం చేశాడో ఇప్పుడూ అదే పనిచేస్తున్నాడు. రైతులంటే చంద్రబాబుకి ఎప్పుడూ చిన్నచూపు. వారేం చేయలేరులే, ప్రశ్నించలేరులే అనే ధైర్యం. నాడు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న చంద్రబాబు రాయలసీమను హార్టీ కల్చర్ హబ్ గా చేస్తానని గొప్పలు చెబుతున్నాడు. వైయస్సార్ గారు ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల, 90 శాతం సబ్సిడీకి డ్రిప్ట్‌లు ఇవ్వడం వల్ల, రాయలసీమలో ఉపాధి హామీ పథకం ప్రారంభించడం వల్ల, మొక్కలు ఉచితంగా పంపిణీ చేయడం వల్ల రాయలసీమ హార్టీ కల్చర్ హబ్‌గా మారింది. దానికి నేనే కారణమని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాయలసీమలో అరటి, చీనీ, టమాట, దోస, చెరకు, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మామడి రైతులు జ్యూస్ ఫ్యాక్టరీల ముందు కి.మీ క్యూ కట్టినా చంద్రబాబుకి కనిపించడం లేదా? ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ విలాసాల కోసం కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వ పెద్దలు, రైతులను మాత్రం ఆదుకోవడం లేదని శ్రీకాంత్‌రెడ్డి ఆక్షేపించారు.