లోకేష్‌ను వారసుడిగా చేసేందుకు ఇన్ని ఘోరాలా..?

చంద్రబాబుకు ఎన్టీఆర్‌ కుటుంబం ఉసురుతాకింది

సొంత తమ్ముడినే వాడుకొని వదిలేసిన నీచుడు చంద్రబాబు

వైయస్‌ఆర్, సీఎం వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి: అసమర్థుడైన లోకేష్‌ను తెలుగుదేశం పార్టీ వారసుడిని చేసేందుకు చంద్రబాబు నాయుడు అనేక ఘోరాలకు పాల్పడ్డాడు. రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు నారా రాంమ్మూర్తి నాయుడిని వాడుకొని వదిలేసిన నీచ చరిత్ర చంద్రబాబుదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీని చేజిక్కించుకోవడం కోసం ఎన్టీఆర్‌ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని, దక్షిణ భారతదేశ రాజకీయాల్లో వెన్నుపోటు రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందాడని ఎద్దేవా చేశారు. ప్రజాదరణ కలిగిన నాయకులు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు సీఎం వైయస్‌ జగన్‌పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. నీచ రాజకీయాలకు పేటెంట్‌ హక్కున్న చంద్రబాబుకు వైయస్‌ఆర్, వైయస్‌ జగన్‌ల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. చేసిన పాపాలు చంద్రబాబును వెంటాడుతున్నాయని, ఎన్టీఆర్‌ కుటుంబం ఉసురు బాబుకు కచ్చితంగా తాకిందన్నారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లారంటే.. ‘శాసనమండలిని రద్దు చేయాలనే మా పార్టీ నిర్ణయాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి సుదీర్ఘమైన చర్చ తరువాత సభకు హాజరైన 133 మంది ఏకగ్రీవంగా ఆ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఆ తీర్మానాన్ని పార్లమెంట్‌కు పంపించే ఏర్పాట్లు చేశారు. మండలి రద్దు చరిత్రాత్మమైన నిర్ణయం కూడా. ఇంతకు ముందు కూడా ఇలాంటి నిర్ణయాలను 1983లో అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం.. అధ్యక్షుడు ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టడం.. ఎన్టీఆర్‌ బిల్లు ప్రవేశపెడితే.. పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోదిస్తే మండలిని రద్దు చేయడం జరిగింది. చాలా రాష్ట్రాల్లో మండలి లేకుండానే పాలన సాగుతుంది. ఈ రోజు వైయస్‌ జగన్‌ నాయకత్వంలోని వైయస్‌ఆర్‌ సీపీ కూడా 1983లో ఎన్టీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని తీసుకుంది.

చంద్రబాబు పత్రికా సమావేశం పెట్టి సుదీర్ఘంగా మాట్లాడారు. అనేక ఆరోపణలు, సవాళ్లు చంద్రబాబు చేశారు. ప్రధానంగా నేను తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును అడుగుతున్నా.. ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు శాసనసభ వేదికను ఎందుకు ఉపయోగించుకోలేదు. ఎందుకు పారిపోయారు. సభకు వచ్చినా ఈ తీర్మానం ఆమోదించబడుతుంది. అయినా ప్రజాస్వామ్య దేశంలో మీ అభిప్రాయాన్ని శాసనసభలో చెప్పడానికి ఎందుకు వెనకాడారు. ఇది చరిత్రాత్మకమైన తప్పిదం. పరిమితుల మేరకు నడుచుకోవాల్సిన మండలిని ఓవరాక్షన్‌ చేసే విధంగా ఉపయోగించారు. కెపాసిటీని మించి ఉపయోగించినప్పుడు వికటిస్తుంది. అదే జరిగింది. శాసనమండలిని రద్దు చేయడం కాదు.. శాసనసభను రద్దు చేయండి అని సవాల్‌ విసురుతున్నారు. తెలివి ఉందా చంద్రబాబూ.. ప్రజాస్వామ్యంపై మీకు గౌరవం ఉందా.. ఎంత మెజార్టీతో అధికారంలోకి వచ్చాం. ఎనిమిది మాసాల క్రితం ఎన్నికైన ప్రభుత్వంపై పిచ్చి సవాళ్లు ఎందుకు చేస్తున్నారు. రాజీనామా చేసి సభ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలా..? ప్రతిపక్షనేతగా ఉన్న మీరు ఎందుకు ఉబలాటపడుతున్నారు. మీకంత ఉబలాటం ఉంటే 23 అసెంబ్లీ, 2 పార్లమెంట్‌ స్థానాల్లో రాజీనామా చేయించండి. రాజధాని మార్పు వ్యతిరేకించి రాజీనామా చేశాము.. మళ్లీ మమ్మల్ని శాసనసభకు పంపించండి అని అడగండి. రాజకీయాలు మానుకునే రోజు వచ్చింది. కాబట్టి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు.

చంద్రబాబు ద్వంద్వ వైఖరిని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో వీడియోల రూపంలో చూపించారు. చంద్రబాబు ఎలాంటి వాడో ప్రజలందరికీ అర్థం అయ్యింది. బాబు తీరును చూసి నవ్వుకుంటున్నారు. బాబు కూడా ఫ్రస్టేషనల్‌లో చాలా కామెంట్లు చేశారు. మీ మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్రంలో అధికారాన్ని, పార్టీని కైవసం చేసుకున్నావని అనేక సంవత్సరాల నుంచి వస్తున్న మాట. వెన్నుపోటు రాజకీయ నాయకుడిగా చంద్రబాబుకు దక్షిణ భారతదేశంలో గుర్తింపు ఉంది. దుర్మార్గమైన రాజకీయ నేతగా అందరూ అంగీకరిస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ తండ్రి వైయస్‌ఆర్‌ను కొట్టాడని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. బుద్ధి ఉందా చంద్రబాబూ.. కడుపుకు అన్నం తింటున్నావా..? కొడితే విజయమ్మ రోశయ్యకు చెప్పిందని మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడితే అడ్డగోలుగా రాసే పత్రికలు, చూపించే చానళ్లు ఉన్నాయని ప్రజా నాయకులు వైయస్‌ఆర్, వైయస్‌ జగన్‌లపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నీ కుమారుడి కోసం ఎన్ని తంటాలు పడుతున్నావో ఆత్మ విమర్శ చేసుకో.. ఈ రాష్ట్రాన్నే కాదు.. ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీని కూడా సర్వనాశనం చేసే దశకు తీసుకెళ్లాడు.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరిలను చంద్రబాబు మోసం చేశాడు. ఎన్టీఆర్‌ పార్టీ స్థాపించినప్పుడు అండగా ఉన్న అల్లుడు దుగ్గుబాటి, చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌లో ఉన్నాడు. ఇందిరాగాంధీ ఆదేశిస్తే.. మా మామపై కూడా పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికాడు. కాంగ్రెస్‌ తరుఫున పోటీ చేసి ఓడిపోయాడు. దొడ్డిదారిన టీడీపీలోకి ప్రవేశించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరిని పక్కకు నెట్టి రాజకీయాలను ఆక్రమించుకున్నావు. రాజకీయంగా చేయకూడని పనులు అనేకం చేశావు. ఎన్టీఆర్‌ తనయుడు హరికృష్ణను క్యాబినెట్‌లోకి తీసుకొని పక్కకునెట్టాడు. ఎన్టీఆర్‌ కుమారులు రాజకీయ వారసులు కాకూడదనే కుట్రపూరిత ఉద్దేశంతో ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఎన్టీఆర్‌ కుటుంబం ఉసురుకొడుతుంది. జూ.ఎన్టీఆర్‌ సినిమాల్లో నటిస్తుంటే.. వైయస్‌ఆర్‌ను ఎదుర్కోవడానికి సినిమా గ్లామర్‌ కావాలని జూ.ఎన్టీఆర్‌ను తీసుకువచ్చి ఓడిపోయిన తరువాత జూ.ఎన్టీఆర్‌ను, హరికృష్ణను పక్కకునెట్టేశావ్‌.

నీ రక్తం పంచుకు పుట్టిన నారా రాంమ్మూర్తినాయుడును ఏం చేశావు. వాడుకొని వదిలేశాడు. అసమర్థుడైన నీ కుమారుడిని రాజకీయ వారసుడిని చేసేందుకు అనేక ఘోరాలకు పాల్పడ్డాడు. ఇలాంటి చంద్రబాబు వైయస్‌ఆర్‌ కుమారుడు అయిన వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే కనీస అర్హత  కూడా లేదు. పార్టీ స్థాపించి ప్రజల మధ్యకు వెళ్లి కష్టాలు, నష్టాలు పడి చివరకు 151 సీట్లు గెలుచుకున్న సీఎం వైయస్‌ జగన్‌పై దుష్ప్రచారం చేయడం దుర్మార్గం. చంద్రబాబుకు తోడు రెండు పత్రికలు ఉన్నాయి. వైయస్‌ఆర్‌ మండలిని పునరుద్ధరించింది వాస్తవమే. మర్ని చెన్నారెడ్డి కూడా మండలిని తీసుకురావాలనుకొని విఫలమయ్యారు. వైయస్‌ఆర్‌ సఫలమయ్యారు. కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు 2004లో ఏం మాట్లాడారో.. అదెందుకు రాయలేదు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యమంత్రి.. వైయస్‌ జగన్‌ ఒక ప్రాంతీయ పార్టీకి ముఖ్యమంత్రి. కాంగ్రెస్‌ పార్టీ ఆదేశాలను వైయస్‌ఆర్‌ పాటించారు. కాలానుగుణంగా పరిస్థితులు మారాయి. మేము నిర్ణయం తీసుకున్నాం తప్పేంటి. ఎమ్మెల్సీలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడని, పార్టీ ఫిరాయింపులకు వైయస్‌ఆర్‌ సీపీ వ్యతిరేకమన్నారు.

Back to Top