ప్ర‌భుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. భౌతిక దాడులు

ఇదే 20 నెల‌ల కూటమి పాలన

అంబటి రాంబాబును వీలైన‌న్ని రోజులు జైలులో ఉంచడమే చంద్రబాబు లక్ష్యం 

ప్రతిపక్షాలను అణచివేయడానికే పీటీ వారెంట్ల వినియోగం 

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి పుత్తా శివశంకర్ మండిపాటు

తాడేపల్లి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు, భౌతిక‌ దాడుల‌కు పాల్ప‌డే విధానాన్ని అమలు చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్  విమర్శించారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయ‌న మాజీ మంత్రి అంబటి రాంబాబును వీలైనన్ని రోజులు జైలులో నిర్బంధించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశమని ఆరోపించారు. 

పుత్తా శివ‌శంక‌ర్ ఇంకా ఏమ‌మ‌న్నారంటే..:

● పాత కేసులను తెరపైకి తెచ్చి వేధింపులు

మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కుడు అంబటి రాంబాబుపై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పాత కేసులను బయటకు తీసి పీటీ వారెంట్ల పేరుతో వేధింపులకు పాల్పడుతోంది. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్ర‌బాబు  అబద్ధాలు బయటపడిన తర్వాత ప్రజల్లోకి నిజాలను తీసుకెళ్తున్న ప్రతిపక్ష నేతలను అణచివేయడానికి భౌతిక‌దాడుల‌కు తెర లేపారు.  ల‌డ్డూ వ్య‌వ‌హారంలో కూట‌మి ప్ర‌భుత్వ దుష్ప్ర‌చారంపై ఏర్పాటు చేసిన‌ ఫ్లెక్సీలు తొలగించాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రులు అంబ‌టి రాంబాబు, జోగి ర‌మేష్‌ల‌పై టీడీపీ గూండాలు హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల ఇళ్లు ధ్వంసం చేశారు.  

● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు లేవు

మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్ల‌పై దాడులకు పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులు బహిరంగంగా తిరుగుతూ మ‌ళ్లీ బెదిరింపులకు పాల్పడుతున్నా ఇప్పటివరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు. ప్రశ్నించే వారినే టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు నమోదు చేయడం ఈ ప్రభుత్వ అరాచకాలకు నిదర్శనం.

● బాధితులనే జైళ్లకు పంపించే కొత్త సంస్కృతి

నేరస్తులు కాకుండా బాధితులనే జైళ్లకు పంపించడం ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా కనిపించదు. ప్ర‌పంచంలో ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే ఇలాంటి కొత్త సంస్కృతి క‌నిపిస్తుంది. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌రువాత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఇప్పటివరకు 36 కేసులు నమోదు చేశారు, గతేడాది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జ‌రిగిన ఉద్య‌మంలో ఆయ‌న‌పై న‌మోదు చేసిన కేసును మళ్లీ తెరపైకి తీసుకొచ్చి పీటీ వారెంట్లు వేయించారు. ఆయ‌న‌కు బెయిల్ రాకుండా రిమాండ్‌లోనే ఉంచే కుట్రపూరిత చర్యల‌కు ఈ ప్ర‌భుత్వం పాల్ప‌డుతోంది.  గతంలో కూడా సోషల్ మీడియా కార్యకర్తలు, విద్యార్థులు, వైఎస్సార్‌సీపీ నాయకులపై ఊరూరా కేసులు నమోదు చేసి బెయిల్ రాకుండా జైళ్లలో నిర్బంధించారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో చట్టాన్ని ధిక్కరించవద్దని కోర్టులు హెచ్చరించినా పోలీసులు, ప్ర‌భుత్వ తీరులో మార్పు రావ‌డం లేదు.

● గూండాగిరి, అక్రమ కేసులే కూటమి పాలన

గత 20 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసింది రెండు పనులు. ఒకటి అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెట్టడం, రెండోది గూండాలను ప్రోత్సహించి ప్రతిపక్ష నేతలపై దాడులు చేయించడం. రాష్ట్రాన్ని సొంత జాగీరులా మార్చుకుని నియంతలా చంద్రబాబు పాలిస్తున్నారు. ఏపీ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా కూట‌మి ప్రభుత్వం వ్యవహరిస్తోందని పుత్తా శివ‌శంక‌ర్ ఆక్షేపించారు.

Back to Top