లోక్‌సభ స్పీకర్‌పై తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి 

న్యూఢిల్లీ: పార్లమెంటులో లోక్‌సభ స్పీకర్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి స్పష్టం చేశారు. లోక్‌సభలో ఆయ‌న మాట్లాడుతూ స్పీకర్ పదవికి, పార్లమెంటరీ సంప్రదాయాలకు ఉన్న గౌరవాన్ని కాపాడటానికే తమ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కూటమికీ చెందినది కాదని, తాము ఎన్డీయే కూటమిలోనూ లేమని, ఇండియా కూటమిలోనూ లేమని ఆయన పేర్కొన్నారు. సభ గౌరవం, స్పీకర్ స్థానం పరిరక్షణ దృష్ట్యా ఈ విషయంలో తాము స్పష్టమైన వైఖరి తీసుకున్నామని చెప్పారు. స్పీకర్ పదవి రాజకీయ పదవి కాదని, అది రాజ్యాంగబద్ధమైన పదవని ఎంపీ గురుమూర్తి అన్నారు. ఆ కుర్చీకి ప్రతి సభ్యుడు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ప్రజలకు మేలు జరిగే అంశాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తమ పార్టీ సమర్థిస్తుందని, అదే సమయంలో ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికీ వెనుకాడబోమని స్పష్టం చేశారు.

స్పీకర్ తీసుకునే ప్రతి నిర్ణయం అందరికీ నచ్చకపోవచ్చు కానీ అవన్నీ పార్లమెంటరీ నిబంధనల ప్రకారమే జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. సభ సజావుగా నడవాలంటే స్పీకర్ స్థానాన్ని గౌరవించడం తప్పనిసరి అని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన సమస్యలను లోక్‌సభలో ప్రస్తావించేందుకు గౌరవ స్పీకర్  ఓం బిర్లా తగిన అవకాశాలు కల్పించారని ఎంపీ గురుమూర్తి గుర్తు చేశారు. అందువల్ల స్పీకర్‌పై ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. సభ హుందాతనాన్ని, పార్లమెంటరీ సంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
 

Back to Top