అమరావతి: శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన వెంటనే డీఎస్సీలో జరిగిన అక్రమాలపై చర్చించాలని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఎమ్మెల్సీలు చంద్రశేఖర్‌రెడ్డి, కల్పలతారెడ్డి, రామచంద్రారెడ్డి ఈ తీర్మానాన్ని ఇచ్చారు. అయితే మండలి ఛైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో వైయస్ఆర్‌సీపీ సభ్యులు డీఎస్సీ అంశంపై చర్చకు పట్టుబట్టారు. ఇప్పటికే రెండు రోజులుగా డీఎస్సీ అంశంపై చర్చకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో మూడో రోజు కూడా వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. డీఎస్సీ అక్రమాలపై చర్చ జరిగే వరకు తమ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేస్తూ పొడియం వద్ద నినాదాలు చేశారు. వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీల నినాదాలతో సభలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీల ఆందోళన నేపథ్యంలో మండలి ఛైర్మన్ సభకు కొద్దిసేపు విరామం ప్రకటించారు. మరోవైపు వైయస్ఆర్‌సీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్ ఛైర్మన్‌ను కోరారు. సభలో చర్యలు తీసుకోవాలంటే నిబంధనల ప్రకారం ప్రక్రియను పాటించాలని ఛైర్మన్ స్పష్టం చేశారు. ఎలా చర్యలు తీసుకోవాలో తనకు తెలుసని చెబుతూ పదేపదే ‘చైర్’ అంటూ ఆదేశాలు ఇచ్చేలా మాట్లాడటం సరికాదని మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను ఎలా నిర్వహించాలో తనకు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సమగ్ర చర్చ జరిపించి వాస్తవాలను సభ ముందుకు తీసుకురావాలని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. అభ్యర్థులకు సంబంధించిన సమస్యలు, నియామక ప్రక్రియపై ఉన్న సందేహాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతూ తమ ఆందోళనను కొనసాగించారు. ప్రభుత్వం చర్చకు ముందుకు వచ్చే వరకు శాసనమండలిలో తమ నిరసన కొనసాగుతుందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు.