తాడేపల్లి: విద్యాశాఖను నారా లోకేశ్ సమర్థవంతంగా నిర్వహించలేక చేతులెత్తేయడమే కాకుండా, ఆ శాఖలో గత ప్రభుత్వంలో తెచ్చిన సంస్కరణలకు తూట్లు పొడిచేశాడని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటో తేదీన తన శాఖ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ఈ మంత్రి.. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు వైయస్ భారతిపై నోటికొచ్చినట్టు అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆయన ఆక్షేపించారు. విశాఖ అభివృద్ది ఎవరి హయాంలో జరిగిందో లోకేశ్‌కి తెలియకపోతే అధికారులను అడిగి తెలుసుకోవాలని, అంతేకానీ నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడితే బుద్ధి హీనుడిగా మిగులుతారని హితవు పలికారు.వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఇది చీటింగ్ పాలన: – రాష్ట్రంలో ఆరు నెలల కూటమి పరిపాలన గమనిస్తే దగా, మోసం, కుట్రలే.. ఇది చీటింగ్ పరిపాలన. – ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయడం మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. సంపద సృష్టి అని చెప్పుకుంటూ రూ.1.19 లక్షల కోట్ల అప్పు చేసి కూడా ఈ హామీ నెరవేర్చాం అని చెప్పుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. – రైతుల్ని, విద్యార్థుల్ని, మహిళల్ని, ఉద్యోగుల్ని, కార్మికుల్ని.. ఇలా అన్ని వర్గాలను మోసం చేశారు. ఆరు నెలల్లో కనీసం ఒక్క హామీ నెరవేర్చలేని ప్రభుత్వం ఉంటే ఏమీ.. ఊడితే ఏమీ. – 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. అమలు చేయలేదు. లక్ష మంది లబ్ధిదారులను తొలగించి వెయ్యి రూపాయలు పెంచితే పథకం సంపూర్ణంగా అమలు చేసినట్టు అవుతుందా..? – మహిళలకు ఉచిత బస్సు ఇప్పటి వరకు లేదు. తల్లికి వందనం పథకం ఈ ఏడాది అమలు చేయడం లేదని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. – జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెంటర్ ఇస్తామన్నారు.. ఇచ్చారా..? ఉద్యోగులకు డీఏలు, టీఏలు ఇచ్చారా..? లోకేశ్ నాయకత్వంలో విద్యావ్యవస్థ నాశనం: – సకల శాఖల మంత్రిగా పెత్తనం వెలగబెడుతున్న నారా లోకేశ్.. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న విద్యాశాఖలో చేసిన ఒక్క సంస్కరణ లేదు. ఒక్క మంచి పనిలేదు. – ఒకటో తారీఖున జీతాలిస్తామన్నారు. ఇప్పటికీ విద్యాశాఖ ఉద్యోగులకు జీతాలు పడలేదు. ఏటా డిసెంబర్ 21న 8వ తరగతి నుంచి పైతరగతులు చదివే విద్యార్థులకు మా ప్రభుత్వంలో ట్యాబ్‌లు ఇచ్చేవాళ్లం. మీరెందుకు రద్దు చేశారు. నిన్న నా నియోజకవర్గంలో ఒక ప్రాథమిక పాఠశాలను సందర్శిస్తే ట్యాబ్‌లు దొంగలు తీసుకెళ్లారని చెబుతున్నారు. – ఒక్క స్కూల్‌లోనైనా డిజిటల్ తరగతులున్నాయా..? సబ్జెక్ట్ టీచర్ విధానాన్ని ఎందుకు రద్దు చేశారు..? బై లింగ్వల్ టెక్సŠట్ బుక్స్ విధానం తీసేశారు. – ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులంటే చులకన భావం. ఇంగ్లిష్ మీడియం రద్దు చేసి జాతి మీడియాను అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం మొదలుపెట్టారు. మీరేమో ఇంగ్లిష్ మీడియం చదువుకోవచ్చు. – తెలుగు మీడియం చదివే భారం, కాపాడే బాధ్యత పేద ఎస్సీ, ఎస్టీ, బీసీలదా..? మీరు మాత్రం రామోజీరావు స్కూల్లో, నారాయణ కాలేజీల్లో ఇంగ్లిష్ మీడియం పెట్టి ముక్కు పిండి వసూలు చేసుకోవచ్చా...? – చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనలేదు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టినంత మాత్రాన అమలు జరిగినట్టేనా?. – మా హయాంలో ప్రతి మండలానికి రెండు ఇంటర్ కళాశాలలు, అందులో ఒకటి పూర్తిగా మహిళా కళాశాల ఉండాలని నిర్ణయం తీసుకుంటే.. దాన్ని రద్దు చేసిన దుర్మార్గ ప్రభుత్వం మీది.. – వ్యాపారం చేయకుండా, ఉద్యోగాలు చేయకుండా, కంపెనీలు పెట్టకుండా చంద్రబాబుకి రూ.931 కోట్ల ఆస్తులెలా వచ్చాయి. దేశంలోనే రిచ్చెస్ట్ సీఎంగా ఎలా నిలిచారు. – 30 మంది ముఖ్యమంత్రుల ఆస్తులు కలిపినా చంద్రబాబు కన్నా తక్కువే.. ఇదంతా ఎలా సాధ్యమైంది? రాష్ట్రంలో దళితులపై దాడి: – రాష్ట్రంలో విచ్చలవిడిగా దళితుల మీద దాడి జరుగుతోంది. వారికి విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. – దళితులపై పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అనే చంద్రబాబు మాటలే నిజమయ్యేలా కూటమి పాలన సాగుతోంది. అవినీతి ఆరోపణలతో హోంమంత్రి పీఏను తొలగించారు. ఇంతమంది పీఏలుంటే దళిత మంత్రి పీఏను మాత్రమే ఎందుకు తొలగించారు..? – నాదెండ్ల మనోహర్ శాఖలో జరిగిన అవినీతిపై ఎవరి మీద చర్యలు తీసుకున్నారు..? విశాఖపై లోకేశ్ అబద్దాలు: – మిడిమిడి జ్ఞానంతో విశాఖ అభివృద్ధిపై నారా లోకేశ్ పచ్చి అబద్దాలు చెబుతున్నాడు. విశాఖ రైల్వేజోన్ కోసం వైఎస్సార్సీపీ ఏం చేయలేదని చెప్పడం సిగ్గుచేటు. – మా ఎంపీలు పార్లమెంట్‌లో గళమెత్తి రాజీనామా చేస్తేనే విశాఖ రైల్వేజోన్ ప్రకటన వచ్చింది. భూమి కేటాయించలేదని మరో పెద్ద అబద్ధం చెబుతున్నాడు. మా ప్రభుత్వం పంపిన డీపీఆర్‌ను కేంద్రం ఆమోదించింది. మీ అధికారులను అడిగి తెలుసుకో లోకేశ్. భూమి కేటాయిస్తే అది మునిగిపోయే భూమని మీ జాతి పత్రికలు రాసిన వార్తలు చదువుకోవాలి. – బీజేపీతో పొత్తులో ఉండి కూడా టీడీపీ వాల్తేర్ డివిజన్‌ను వదిలేసింది. లాభాల్లో ఉండే వాల్తేర్ డివిజన్‌ను వదిలేస్తే రాష్ట్రానికి నష్టమని, కొత్తగా ఏర్పాటయ్యే న్యూసౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లో ఉండాలని కేంద్రం మీద పోరాటం చేసి సాధించింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఆ మేరకు వైఎస్సార్సీపీ ఒత్తడితోనే కేంద్రం రూ. 170 కోట్ల నిధులు కూడా కేటాయించింది. – విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్ ఆమోదం చేయించింది కూడా వైఎస్సార్సీపీయే.. – స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటు పరం చేస్తామన్న బీజేపీతో నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలివ్వకుండా వారిని తొలగిస్తుంటే వారిని పట్టించుకోలేదు. – పక్కనే ఉన్న కర్నాటక రాష్ట్రంలో విశ్వేశ్వరయ్యే స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం రూ.15 వేల కోట్లు సాయం చేసింది. కేంద్రంలో భాగస్వామిగా ఉండి టీడీపీ ఎందుకు నిర్దిష్టమైన ప్రకటన చేయించలేకపోతోంది. – ఈ కూటమి ప్రభుత్వం విశాఖకు ఈ ఏడు నెలల్లో చేసిన మేలేంటో లోకేశ్ చెప్పాలి... – సాఫ్ట్‌వేర్ కంపెనీలు రాలేదని మరో పెద్ద అబద్ధం చెబుతున్నాడు. టీసీఎస్, అదానీ డేటా సెంటర్, ఇన్ఫోసిస్, అనకాపల్లిలోని ఎకోహోమా టైర్ల కంపెనీ ఇవన్నీ మా హయాంలో వచ్చినవి కాదా..? – ఇవి కాకుండా రామ్‌కో సిమెంట్స్, గ్రాసం ఇండస్ట్రీస్, ప్యానల్ ఆప్టో డిస్‌ప్లే టెక్నాలజీస్, సన్నీ ఆప్టెక్, ఫాక్స్ లింక్ ఇండస్ట్రీస్, ఏటీసీ వంటి భారీ సంస్థలు కార్యక్రలాపాలు సాగిస్తుంటే లోకేశ్‌కి కనిపించకపోవడం విడ్డూరం. – సోషియో ఎకనమిక్ సర్వే ప్రకారం విశాఖ చుట్టుపక్కల 16 వేల కంపెనీలు ఏర్పాటై 1.50 లక్షల మందికి ఉద్యోగాలోచ్చాయని పేర్కొంది. ఇది మా ప్రభుత్వ ఘనత కాదా..? ఇంత మేలు చేసినా విశాఖ వెనుకబడి పోయిందని అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. – ఎన్‌ఏడీ జంక్షన్‌లో రోటరీ మోడల్ లో ఫ్లై ఓవర్ నిర్మించింది వైఎస్సార్సీపీ కాదా..? – ఇవన్నీ మేం చేయలేదని చెప్పే దమ్ము టీడీపీ నాయకులకు ఉందా..? మేం ఆమోదింపజేసిన డీపీఆర్‌లతో ప్రాజెక్టులను పూర్తి చేసి విశాఖ అభివృద్ధి మీద చిత్తశుద్ధిని చూపించాలి. లోకేశ్ అవాకులు చెవాకులు మానుకోవాలి – గీతం యూనివర్సిటీకి ఆక్రమించిన ప్రభుత్వ భూముల వివరాలను, అవినీతిని బయటపెట్టాం..ఆ భూములు మళ్లీ తోడళ్లుడికి కట్టబెట్టేందుకు లోకేశ్ పన్నాగం పన్నుతున్నాడు. – ఒక మంత్రిగా ఉన్నానన్న విచక్షణ మరిచిపోయి అద్భుతంగా నిర్మించిన పర్యాటకశాఖ భవన్ మీద లోకేశ్ విషం కక్కుతున్నాడు. – మహిళను గౌరవించాలన్న సంస్కారం లేకుండా విడిది హౌస్ అంటూ వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ గారి మీద అవాకులు చెవాకులు పేలుతున్నాడు. లోకేశ్ కూడా అదే పనిచేస్తున్నాడా..? అందుకే ఆయన తరచూ హైదరాబాద్ వెళ్లి వస్తున్నాడా..? – కూటమి పాలన వైఫల్యంపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను తట్టుకోలేని నైరాశ్యంలో లోకేశ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. – తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ కట్టడానికి చదరపు అడుగుకి రూ.10 వేలు వెచ్చించిన అవినీతి ప్రభుత్వం, అవినీతి సీఎం చంద్రబాబనే విషయం లోకేశ్ మర్చిపోయాడా..? – చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో దేశంలోనే ఎక్కువ ధర లీటర్ పెట్రోల్ రూ.112 ఉంది. కేంద్రంలో భాగస్వాములై ఉండి పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు. – ప్రధాని విదేశీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన కియా ని మేమే తెచ్చామని చెప్పుకోవడం ఫ్యాషనైంది. – స్థాయిని మరిచి లోకేశ్ ఇష్టానుసారం వైఎస్ భారతి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలకు ప్రజలే బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తెలిపారు.