రాజమహేంద్రవరం: మల్లయ్యపేట ప్రాంతంలో ఇసుక రవాణా వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వైయస్ఆర్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అండదండలతో ఇసుక దందా అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు పీతా రామకృష్ణ మాట్లాడుతూ, మల్లయ్యపేటలో ఇసుక లారీల రాకపోకల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. టార్పాలిన్ కవర్లు లేకుండా లారీలు ప్రయాణించడం వల్ల రోడ్లపై ఇసుక పడుతూ వాహనదారులకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ధూళి, దుమ్ము కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. వేగంగా వెళ్లే లారీల కారణంగా ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలు జరుగుతున్న నేపథ్యంలో, నిబంధనలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమతి లేని ర్యాంపుల నుంచి ఇసుక తరలించడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి మాట్లాడుతూ, మల్లయ్యపేట పేపర్ మిల్లు రోడ్డుపై 24 గంటలు ఇసుక లారీలు తిరుగుతూ దుమ్ము, ధూళి వ్యాప్తి చేస్తున్నాయని అన్నారు. ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారి, కార్మికులు, విద్యార్థులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇసుక వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. వైయస్ఆర్‌సీపీ నాయకులు మార్గాని సురేష్ మాట్లాడుతూ, గత కొంతకాలంగా మల్లయ్యపేట ప్రజలు ఇసుక లారీల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు పెరిగి ప్రాణనష్టం సంభవిస్తోందని, చిన్నపిల్లలు దుమ్ము వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతి లేని ఇసుక ర్యాంపుల నుంచి రవాణాను అరికట్టాలని, పేపర్ మిల్లు–మల్లయ్యపేట రోడ్డుపై ఇసుక లారీల రాకపోకలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శులు, వార్డు ఇంచార్జీలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.