తాడేపల్లి: "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రక్షణ అందించాల్సిన పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని, అది కేవలం చంద్రబాబు కక్షసాధింపు చర్యల కోసం పనిచేసే ‘జేబు సంస్థ’గా మారిందని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. సోమవారం తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధమైన పాలన గాలికి కొట్టుకుపోయిందని, లోకేష్ రచించిన ‘రెడ్ బుక్’ అరాచకమే రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. డీజీపీ నుంచి ఎస్సై స్థాయి వరకు అందరూ చట్టాన్ని కాపాడటం వదిలేసి, చంద్రబాబును ఇంప్రెస్ చేసే పనిలో పడ్డారని విమర్శించారు. వైయస్ . జగన్ వీరాభిమానులే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తూ, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం వంటి వారిపై చర్యలు తీసుకోలేని ఈ ప్రభుత్వం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే సామాన్యులను వేధించడం సిగ్గుచేటని నిలదీశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అమాయకుల ఉసురు పోసుకుంటున్న పోలీస్ అధికారులకు భవిష్యత్తులో చట్టబద్ధంగా బుద్ధి చెప్పడం ఖాయమని సుధాకర్ బాబు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... - పోలీసు వ్యవస్థ – కక్షసాధింపు చర్యలు.. బలహీన వర్గాలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు, నేడు అధికార పక్షానికి కొమ్ముకాయడం అత్యంత దురదృష్టకరం. డీజీపీ నుంచి ఎస్సై వరకు అందరూ చంద్రబాబును ఇంప్రెస్ చేసే పనిలో పడ్డారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను, వైయస్ .జగన్ వీరాభిమానులే లక్ష్యంగా చేసుకుని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. సామాన్యుల భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. - డీజీపీ డైరెక్షన్ - పోలీస్ యాక్షన్..: డీజీపీ హరీష్ గుప్తానే స్వయంగా ఏ నియోజకవర్గంలో ఎవరిపై ఎలాంటి కేసులు పెట్టాలో డైరెక్షన్ ఇస్తుండటం ఈ రాష్ట్రంలో పోలీస్ జులుంకు పరాకాష్ట. ఏప్రిల్ 12న మాచర్ల ఏఎస్‌ఐ శ్రీనివాసరావు ఏకాంతంగా ఉన్న జంటల వీడియోలు తీసి లైంగిక వేధింపులకు, వసూళ్లకు పాల్పడ్డారు. 12.04.2026 నాడు మాచర్ల టౌన్ ఏఎస్‌ఐ శ్రీనివాసరావు కీచకుడిగా మారి.. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటల వీడియోలు తీసి బెదిరించి, ఆపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా వ్యభిచార గహాల నిర్వాహకులను బెదిరించి వసూళ్లకు దిగాడు. 13.04.2026 నాడు పల్నాడు జిల్లాలో హత్య కేసు తీసుకుంటే... ఒంగోలు జిల్లా కోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న బాపట్ల జిల్లా చీమకుర్తికి చెందిన శ్రీరామ హరిప్రసాద్ ను ఏప్రిల్ 10న యడవల్లి గ్రామ సమీపంలో హత్య చేశారు. ఈ కేసులో కూడా నిందితులైన కానిస్టేబుల్ ఉసర్తి వెంకటకోటయ్య, కొండారెడ్డి శ్రీనివాసరావును అరెస్టుచేశారు. 13.04.2026 నాడు బాపట్ల జిల్లా చినపులివర్రులో వైయస్సార్ సీపీకి చెందిన ఓ దళిత నాయకుడు .. ఇంట్లో నిద్రిస్తుండగా పోలీసులు దొంగల్లా మఫ్టీలో గోడదూకి వెళ్లి కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. బాధిత కుటుంబంలో మహిళా కుటుంబ సభ్యులపై దాడి చేశారు. 13.04.2026 నాడు బాపట్ల జిల్లాలో రెచ్చిపోయిన చెరుకుపల్లి ఎస్‌ఐ అనిల్ కుమార్. వైయస్సార్ సీపీ కార్యకర్త కృష్ణార్జున రెడ్డిపై పాశవికంగా దాడి చేశాడు. ఇవాల్టి వరకు దానిమీద పోలీస్ శాఖ నుంచి స్పందన లేదు. - ఆడబిడ్డలపై అఘాయిత్యాలు – ఎమ్మెల్యేల రక్షణ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. మహిళను మోసం చేసినా ఆయనపై చర్యలు లేవు సరికదా, బాధితురాలిని నడిరోడ్డుపై కొట్టిన జనసేన కార్యకర్తను కూడా అరెస్ట్ చేయలేదు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ దొరికిపోయిన టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడుని పక్కన పెట్టుకుని చంద్రబాబు స్వామివారి దర్శనానికి వెళ్లడం సిగ్గుచేటు. ఎమ్మెల్యేలు కూన రవికుమార్, నజీర్ అహ్మద్, కోనేటి ఆదిమూలంతో పాటు ఈ ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల ఫిర్యాదులు వచ్చినా వారిపై కనీసం పార్టీ పరంగా కూడా క్రమశిక్షణ చర్యలు లేవు. - సోషల్ మీడియాపై దమననీతి.. కోర్టులు వారించినా వినకుండా వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను, సానుభూతిపరులను అక్రమంగా అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. చంద్రబాబు తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం మీడియా, రెవెన్యూ, పోలీసు వ్యవస్థలను తన జేబు సంస్థలుగా మార్చుకున్నారు. - అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. "చంద్రబాబు రాజు కాదు, లోకేష్ యువరాజు అంతకంటే కాదు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచుకోండి. సామాన్యుల మీద, అమాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి హింసించిన వారికి భవిష్యత్తులో అట్టుకి అట్టున్నర పెట్టి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా బుద్ధి చెప్పడం ఖాయం" అని టీ జే ఆర్ సుధాకర్ బాబు హెచ్చరించారు.