నెల్లూరు: పంటలకు గిట్టుబాటు ధరలు లేక, ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహరం అందక కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో రైతులు ఏకంగా రూ. 25 వేల కోట్లు నష్టపోయారని నెల్లూరు వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగోసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ చంద్రబాబులో మార్పు రాలేదని, ఇప్పటికీ వ్యవసాయం దండగ అనే విధానాలతోనే పనిచేస్తున్నాడని ఆరోపించారు. గతేడాది పత్తి, పొగాకు, మిర్చి సాగు చేసిన రైతులకు గిట్టుబాబు ధరలు అందక ఎకరాకు రూ. 5 లక్షల మేర భారీగా నష్టపోయారని, దీంతో ప్రభుత్వ సూచనతో వారంతా మొక్కజొన్న సాగుచేశారని చెప్పారు. ప్రభుత్వం చెప్పిన పంటలు సాగుచేసినప్పటికీ వారికి అండగా మద్ధతు ధరకు పంటలు కొనుగోలు చేసే ప్రయత్నం చేయడం లేదని ధ్వజమెత్తారు. ఒకపక్క రైతులు తీవ్రంగా నష్టపోయామని అల్లాడుతుంటే మంత్రులు విదేశాల్లో జల్సాలు చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి విమర్శించారు. ఇప్పటికైనా తక్షణం స్పందించి రైతులను ఆదుకోకపోతే ఈ చెవిటి, గుడ్డి ప్రభుత్వానికి రైతు ఉద్యమాలతో వైయస్ఆర్‌సీపీబుద్ధి చెబుతుందని కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. - ప్రభుత్వానికి రైతుల గోడు పట్టడం లేదు తాము పండించిన పంటలకు గిట్టుబాదు ధరలు లేక అన్నదాతల ఆక్రందనలు మిన్నంటుతుంటే కూటమి ప్రభుత్వం కనీసం పటించుకోవడం లేదు. రైతుల కష్టాన్ని దళారులు దోచుకుతింటుంటే ప్రభుత్వ పెద్దలకు చీమ కుట్టినట్టు కూడా ఉండటం లేదు. నష్టాల పాలవుతున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చంద్రబాబుకి పట్టడం లేదు. బిజినెస్ రిఫార్మర్ అవార్డు పేరుతో మీడియాలో ఊదరగొట్టడం మినహా రాష్ట్ర ప్రజల బాగోగులు పట్టించుకున్నపాపాన పోవడం లేదు. మద్ధతు ధర ప్రకటించి ఊరుకుంటున్నాడే కానీ ఆ ధరకు కొనుగోళ్లు జరుగుతున్నాయో లేదో పట్టించుకోవడం లేదు. కేంద్రం ఆదుకోవాలని లేఖలు రాసేసి చేతులు దులిపేసుకుంటున్నాడు. రెండేళ్ల కూటమి పాలనలో రైతుల ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. అమరావతి తప్ప చంద్రబాబు కళ్లకు ఏమీ కనిపించడం లేదు. రైతులు ఇబ్బంది పడుతుంటే వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు విదేశాలకు విహారయాత్రలకు వెళ్లాడు. - మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టం గతేడాది మిర్చి, పత్తి, పొగాకు పంటలు సాగు చేసిన రైతులు ఎకరాకు రూ. 5 లక్షల వరకు నష్టపోయారు. దీంతో ప్రభుత్వం మొక్కజొన్న, శనగ పంటలు సాగుచేయాలని సూచించడంతో రైతులు భారీగా మొక్కజొన్న పంటలు సాగుచేశారు. కానీ గిట్టుబాటు ధరలు లేక మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎకరాకు రూ. 50 వేల వరకు పెట్టుబడి పెట్టి సాగుచేసిన రైతులు, లాభాలు రాకపోగా ఎకరాకు రూ.15 నుంచి రూ. 20 వేల వరకు నష్టపోతున్నారు. ఇవే కాకుండా గిట్టుబాబు ధరలు లేక కూరగాయలు, పండ్ల తోటల పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. కనీసం కోత ఖర్చులే రాక పంటలను పొలాల మీదనే వదిలేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. రైతులు వ్యవసాయాన్ని వదిలేసి పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారు. వైయస్ఆర్‌సీపీహయాంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర చెల్లించి ఆదుకున్నాడు. సీఎం యాప్ ద్వారా పంట ధరలను మానిటరింగ్ చేసే గొప్ప వ్యవస్థ ఉండేది. పంటలు కోతలకు వస్తున్న సమయానికి అనుగుణంగా సమీక్షలు నిర్వహించి పరిస్థితులకు అనుగుణంగా రైతులకు ఇబ్బంది లేకుండా ఆర్బీకే సెంటర్ల ద్వారా పంటల కొనుగోళ్లకు ఏర్పాటు చేసేవాళ్లం. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరిపి మార్కెట్లో పోటీ వాతావరణ సృష్టించి మద్ధతు ధరలకు పంటలు కొనుగోలు చేయడం జరిగింది. అడుగడుగునా రైతుకు అండగా ఉండి ఆదుకున్న పరిస్థితి నాడు ఉండేది. కానీ చంద్రబాబు ఇప్పటికీ వ్యవసాయం దండగ అనే విధానంతోనే పనిచేస్తున్నాడు. ఉచిత పంటల బీమా ఎత్తేసి రైతులను నిండా ముంచేశాడు. ఈ రెండేళ్లలోనే రైతులు రూ. 25 వేల కోట్లు నష్టపోయారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చే వరకు వైయస్ఆర్‌సీపీఊరుకోదు. ఈ చెవిటి, గుడ్డి ప్రభుత్వానికి ఉద్యమాలతో కళ్లు తెరిపిస్తాం.