రామతీర్థం ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేయ‌డం సిగ్గుచేటు 

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్‌

 విజయవాడ: రామతీర్థం ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవ‌డం సిగ్గుచేటు అని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిప‌డ్డారు. రాముని విగ్రహం నిమజ్జనం పేరుతో తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తికే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5 లక్షలు ఇవ్వడం దురదృష్టకరమని అన్నారు. హిందూ దర్శనం, సంప్రదాయాలపై కూటమి నేతలకు సరైన అవగాహన లేదని విమర్శించారు.

రెండేళ్ల తరువాత రామతీర్థం అంశాన్ని మళ్లీ తెరమీదకు తీసుకువచ్చి ప్రజల్లో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగేందుకు విగ్రహాన్ని నిమజ్జనం పేరుతో కోటిపల్లి గోదావరి పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్లడం సరైంది కాదని అన్నారు. కూటమి పాలనలో దేవాలయాలకు వెళ్లే భక్తులు కూడా సురక్షితంగా లేరని, తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ వంటి ఘటనలు ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రామతీర్థం ఘటన ఎంతో దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నాటి ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గారు వెంటనే స్పందించి సుమారు రూ.4.5 కోట్లతో రాతి కట్టడం నిర్మించారని గుర్తుచేశారు. తిరుపతి నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టాపన చేసినట్లు తెలిపారు. ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలను గౌరవిస్తూ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని మల్లాది విష్ణు సూచించారు.
 

Back to Top