పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ నాయకులపై టిడిపి నాయకులు కత్తులు, రాడ్లతో దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో మండాది గ్రామానికి చెందిన వైయస్ఆర్‌సీపీ నాయకులు పులి కృష్ణారెడ్డి, ఆయన మేనల్లుడు గాదె శ్రీనివాసరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం, వెల్దుర్తి మండలం మండాది గ్రామానికి చెందిన గాదె శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత పనుల నిమిత్తం మాచర్లకు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా, రింగ్ రోడ్డుపై ఉన్న టిడిపి గుంపు అతన్ని అడ్డగించారు. బైక్‌పై ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రాన్ని తీసేయాలని బెదిరించగా, శ్రీనివాసరెడ్డి నిరాకరించడంతో కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో మెడపై పడాల్సిన కత్తి తృటిలో తప్పి, ఇతర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం శ్రీనివాసరెడ్డిని చూసేందుకు వచ్చిన పులి కృష్ణారెడ్డిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తోంది. మాచర్ల నడిబొడ్డున ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పోలీసులు తక్షణ చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అండతోనే ఈ దాడులు జరుగుతున్నాయని వైయస్ఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసుల అలసత్వం కారణంగా రౌడీ మూకలు రెచ్చిపోతూ సామాన్యులపై దాడులకు పాల్పడుతున్నాయని విమర్శిస్తున్నారు. ఈ ఘటనతో మాచర్ల ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనగా, బాధితులకు న్యాయం చేయాలని వైయస్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు వెంటనే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.