శ్రీరాముని విగ్రహంతో రాజకీయం తగదు

రామతీర్థంలో విగ్రహ అవశేషాల నిమజ్జనంపై విజయనగరం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఫైర్ 

 విజయనగరం: శ్రీరాముని విగ్రహంతో రాజకీయాలు చేయడం తగదని విజయనగరం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. రామతీర్థాల బోడి కొండపై ఉన్న శ్రీరాముని విగ్రహ అవశేషాల నిమజ్జన విషయంలో కూటమి ప్రభుత్వం రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వ‌జ‌మెత్తారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని స్థానిక నదుల్లో నిమజ్జనం చేయకుండా విగ్రహ అవశేషాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి అంతర్వేది వద్ద నిమజ్జనం చేయడం సరైన విధానం కాదని అన్నారు. ఈ చర్య వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని విమర్శించారు.

అలాగే 2022లో రామతీర్థాల్లో జరిగిన విగ్రహాల ధ్వంసం ఘటనను గుర్తుచేసిన ఆయన, అప్పట్లో దుండగుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే అదే నిందితుడికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలతో ఆటలాడటం తగదని, శ్రీరాముని వంటి పవిత్ర ప్రతీకలను రాజకీయాలకు వేదికగా ఉపయోగించకూడదని మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజల మనోభావాలను గౌరవించే విధంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.
 

Back to Top