తాడేపల్లి: ఫైనాన్స్ కంపెనీలతో టైఅప్ పెట్టుకుని కార్పొరేట్ విద్యాసంస్థలు వడ్డీ వ్యాపారం చేస్తున్నాయని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర ఆరోపించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది చదువులు పూర్తి కాకుండానే నిబంధనలకు విరుద్ధంగా రాబోయే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి టర్మ్ ఫీజులు వసూలు చేస్తున్నా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. నిర్ణీత సమయంలో ఫీజులు చెల్లించకపోతే వడ్డీ చెల్లించాల్సి వస్తుందని మెసేజ్‌లు పంపి మరీ విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరిస్తున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని అన్నారు. చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులకు ఆరు, తొమ్మిది నెలల కాలపరిమితితో లోన్లు ఇప్పిస్తూ ఈఎంఐల రూపంలోవసూలు చేస్తున్నాయని వివరించారు. విద్యను వ్యాపారం చేస్తున్నారని ఒకపక్క మొత్తుకుంటుంటే, ఇప్పుడు కొత్తగా విద్యా సంస్థల ముసుగులో ఫైనాన్స్ వ్యాపారం మొదలుపెడితే ప్రభుత్వానికి పట్టదా అని నిలదీశారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో ఫీజుల నియంత్రణకు పర్యవేక్షణ కమిటీ వేసి ఇలాంటివి జరగకుండా అడ్డుపడిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ నేడు విద్యను వ్యాపారం చేసి ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న లోకేష్‌కి విద్యాశాఖపై ఏమాత్రం నియంత్రణ, అవగాహన లేదని, ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణకు తక్షణమే పర్యవేక్షణ కమిటీ వేసి ఫీజుల పేరుతో జరుగుతున్న వేధింపులను అరికట్టాలని ఎ. రవిచంద్ర ప్రభుత్వాన్ని కోరారు.