ఆక్వా ఫీడ్‌ ధరల పెంపు దారుణం

ప్రభుత్వ పెద్దలు ఫీడ్‌ కంపెనీలు కుమ్ముక్కు  

కూటమి ప్రభుత్వం, ఫీడ్ కంపెనీలపై మాజీ మంత్రుల మండిపాటు

తాడేపల్లి: ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై వైయ‌స్ఆర్‌సీపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఈ మేర‌కు మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, కాకాణి గోవర్ధన్ రెడ్డి, సీదిరి అప్పలరాజు పత్రికా ప్రకటన విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వంపై, ఫీడ్ కంపెనీలపై తీవ్రంగా మండిప‌డ్డారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపు దారుణమని పేర్కొన్న వారు, ప్రభుత్వ పెద్దలు ,  ఫీడ్ కంపెనీలు కుమ్మక్కై ఆక్వా రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి నెలా ఫీడ్ కంపెనీల నుంచి ప్రభుత్వ పెద్దలకు ముడుపులు అందుతున్నాయని, అందుకే ధరల పెంపును అడ్డుకోలేదని విమర్శించారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీడ్ ధరలు ఏకపక్షంగా పెరిగాయని, దిగుమతి సుంకాలు తగ్గించినా దాని లాభం రైతులకు అందలేదని పేర్కొన్నారు. ముడిసరుకుల ధరలు తగ్గినా ఫీడ్ ధరలు తగ్గించకపోవడం మాఫియా వ్యవస్థకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఫీడ్ కంపెనీల మాఫియాకు ప్రభుత్వ పెద్దల అండ ఉందని, ప్రతి నెలా టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముడుపులు వెళ్తున్నాయని ఆరోపించారు. ఆక్వా రైతుల కష్టాన్ని పాలకులు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్న వారు, ఆక్వా సిండికేట్ ముడుపుల్లో ఆయన వాటా ఎంత ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆక్వా ఫీడ్ ధరల వెనుక భారీ స్కాం దాగి ఉందని ఆరోపించారు.

తక్షణమే ఫీడ్ ధరలు తగ్గించాలని, లేకపోతే ఆక్వా రైతుల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికే కరెంట్, డీజిల్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులపై ఫీడ్ ధరల పెంపు మరో పిడుగుపాటుగా మారిందని మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, కాకాణి గోవర్ధన్ రెడ్డి, సీదిరి అప్పలరాజు  ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లో సంయుక్తంగా పేర్కొన్నారు.

Back to Top