రాజాం నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై దాడి

దోషులను కఠినంగా శిక్షించాలని డాక్ట‌ర్‌ తలే రాజేష్ డిమాండ్

విజ‌య‌న‌గ‌రం జిల్లా: రేగిడి ఆమదాలవలస మండలం వండానపేట గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడిని రాజాం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇంచార్జి డా. తలే రాజేష్ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దాడిలో గాయపడిన మాజీ సర్పంచ్ వియ్యపు చక్రపాణి, వియ్యపు వెంకట రమణ, వియ్యపు జనార్ధన రావు, వియ్యపు వెంకటమ్మలను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆయన పరామర్శించారు. వైద్యులను కలిసి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజాం నియోజకవర్గంలో దాడులు, దోపిడీలు పెరిగిపోయాయని ఆరోపించారు. గతంలో కూడా పలు గ్రామాల్లో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ ఘటనలు పునరావృతం అయ్యేవి కాదని అన్నారు. “అధికారం ఉందనే అహంకారంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు” అని విమర్శించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించినప్పటికీ కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని, కౌంటర్ కేసులు వేయడం వంటి చర్యలు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్నాయని ఆరోపించారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పుతున్నాయని, పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు పార్టీ తరఫున పూర్తి అండగా ఉంటామని, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు టంకాల అచ్చెన్నాయుడు, రేగిడి ఆమదాలవలస మండల పార్టీ అధ్యక్షులు వావిలపల్లి జగన్ మోహన్ రావు, రాజాం టౌన్ పార్టీ అధ్యక్షులు పాలవలస శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top