అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందాలు చేసుకున్నారని మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆరోపించారు. ఆ ఒప్పందాల భాగంగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిలిపివేశారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కోసం రాయలసీమ ప్రజల ప్రయోజనాలను త్యాగం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. టీడీపీ కూటమి నేతలకు సిగ్గులేదా అంటూ తీవ్రంగా విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల నీటి మట్టం వద్ద తెలంగాణ నీటిని తీసుకుంటోందని పేర్కొన్న తలారి రంగయ్య, అదే స్థాయిలో నీటిని వినియోగించుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారని వివరించారు. కానీ ప్రస్తుతం ఆ పనులను నిలిపివేయడం దురుద్దేశపూర్వకమని ధ్వజమెత్తారు. చంద్రబాబు నిర్వాకం వల్ల రాయలసీమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని, ఈ విధానాలు కొనసాగితే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రజల నీటి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.