నోటా కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేయండి

ప్రతిపక్షాలకు వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచన

తాడేపల్లి: అంతర్వేదిలో ఆలయ రథం ఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూస్తున్నాయని, ప్రభుత్వం దుష్ప్రచారం చేసి లబ్ధిపొందాలని కుట్రలు పన్నుతున్నారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయ రథం దగ్ధం ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అన్ని మతాలను గౌరవిస్తూ మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రభుత్వానికి కులాలు, మతాలను అంటగట్టే కుట్ర పన్నుతున్నారు’ అని మండిపడ్డారు. ప్రతిపక్షాలు.. ప్రజా సమస్యలపై పోరాటం చేయండి. ప్రజలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నం చేయండి. నోటా కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేయండి అని సూచించారు. కులాలు, మతాలను వాడుకోవాలని చూస్తే మంచిది కాదన్నారు.  

Back to Top