భూముల కోసమే చంద్రబాబు రాద్ధాంతం

టీడీపీ వైఖరిని ఉత్తరాంధ్ర ప్రజలమంతా ఖండిస్తున్నాం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి

విజయనగరం: ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ప్రతిపాదనతో ఆనందం వ్యక్తం చేస్తుంటే.. ఉత్తరాంధ్ర ప్రజల అదృష్టాన్ని చంద్రబాబు కాలుతో తన్నే ప్రయత్నం చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ధ్వజమెత్తారు. విశాఖను ఎగ్జిక్యూటీవ్‌గా చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ ప్రతిపాదనకు మద్దతుగా విజయనగరం కోటజంక్షన్‌ నుంచి గంటస్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే వీరభద్రస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో రైతుల నుంచి చౌకగా కొనుగోలు చేసిన భూములకు ఎక్కడ రేటు పడిపోతుందోనని చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు విశాఖను రాజధానిగా పెడతారని ఎదురుచూశామని, ఉత్తరాంధ్ర ప్రజల ఆశలకు అనుగుణంగా సీఎం వైయస్‌ జగన్‌ విశాఖను పరిపాలన రాజధానిగా ప్రతిపాదించారన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆనందాన్ని కాలుతో తన్నే పరిస్థితిని తెలుగుదేశం పార్టీ నాయకులు తెస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులకు భూముల కోసం టీడీపీ క్యాడర్‌ను, అమాయక రైతులను రెచ్చగొట్టి తప్పుడు ప్రచారం చేయడాన్ని ఉత్తరాంధ్ర ప్రజలుగా ఖండిస్తున్నామన్నారు. 
 

Back to Top