వైయస్ఆర్ జిల్లా: రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని, కల్తీ మద్యంతో అమాయక ప్రజలను చంపేస్తారా అంటూ వైయస్ఆర్‌సీపీ బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా మండిపడ్డారు. అమాయక ప్రజలు కల్తీ మద్యం తాగి పిట్టల్లా రాలుతున్నారు.. అయినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ధ్వజమెత్తారు. వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుబ్బమ్మ ఆధ్వర్యంలో శుక్రవారం కడప నగరంలో మద్యం బాటిళ్లతో మహిళలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘ సీఎం డౌన్.. డౌన్, కల్తీ మద్యం విక్రయాలు అరికట్టాలి’ అని నినాదాలు చేశారు. ‘నకిలీ మద్యంతో పేదలు పిట్టల్లా రాలిపోతున్నారు.. ప్రభుత్వ పెద్దలే మద్యం సూత్రధారులు.. రాష్ట్రంలో ఎన్–బ్రాండ్ విక్రయాలు’ తదితర ప్లకార్డులను ర్యాలీలో ప్రదర్శించారు. ఎక్సైంజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు కార్యాలయం ఎదుట మద్యాన్ని పారబోసి బాటిళ్లను పగులకొట్టారు. ‘మద్యం తాగి ప్రజలు చనిపోతుంటే డిప్యూటీ సీఎం నోరు మెదపరేం, ఎక్సైంజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎక్కడ’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. నకిలీ మద్యం సరఫరా చేస్తూ పేద ప్రజలను నిలువు దోపిడీ చేస్తోందని ఆరోపించారు. అడ్డగోలు పర్మిట్ రూమ్‌లతో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. టీడీపీ నాయకులు వైన్ షాపుల ద్వారా కల్తీ మద్యం అమ్ముతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదన్నారు. ఈ ప్రభుత్వానికి మహిళల ఉసురు తగులుతుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి బెల్టు షాపులు రద్దు చేయాలని, కల్తీ మద్యాన్ని అరికట్టాలని, పర్మిట్ లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.