అఖిల భారత మేయర్ల సదస్సుకు వైయ‌స్ఆర్‌సీపీ మేయ‌ర్లు

తాడేప‌ల్లి: హర్యానాలోని  కర్నాల్ లో జరిగిన  అఖిల భారత మేయర్ల సదస్సులో అనంతపురం  మేయర్ మహమ్మద్ వసీం, క‌ర్నూలు మేయ‌ర్ బీవై రామ‌య్య‌ పాల్గొన్నారు.  రెండు రోజులపాటు జరిగే  సమావేశం మంగళవారం ప్రారంభం అయింది.  కర్నాల్ మేయర్  రేణు బాల గుప్త ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ 53వ వార్షిక సమావేశము జరిగింది. భారత ప్రభుత్వం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  మనోహర్ లాల్ కట్టర్ ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతదేశంలోని  21 రాష్ట్రాల నుంచి  70 మంది వరకు మేయర్లు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అనంతపురం మేయర్ వసీం తో పాటు కర్నూలు మేయర్ రామయ్య కూడా హాజరు అయ్యారు.  ఈ సందర్భంగా పలువురు మేయర్లు ఆయా నగరాల్లో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చర్చించుకోవడానికి రాబోవు రోజుల్లో ఆయా నగరాల్లో చేపట్టబోతున్నటువంటి కార్యక్రమాల గురించి కూడా  ప్రస్తావనకు వచ్చాయని మేయర్ వసీం తెలియజేశారు. అనంతపురం నగరంలో  చేపట్టిన రోడ్లు,  అమృత పథకం ద్వారా చేపట్టినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించామన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి హయాంలో సచివాలయం వ్యవస్థ వల్ల  ప్రజలకు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించే విధానం గురించి వివరించామన్నారు. అనంతపురం నగరంలో అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణం తో పాటు, నాడు నేడు ద్వారా పాఠశాలల్లో  కల్పించిన అధునాతన సౌకర్యాలు,  నిర్మాణాలు గురించి మేయర్ల చర్చా వేదికలో  వివరించామన్నారు. భారత దేశంలోని వివిధ నగరాల్లో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయా ప్రాంతాల్లోని మేయర్లు వివరించడంతోపాటు అనంతపురం నగరంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా వివరించడానికి అవకాశం  రావడం చాలా సంతోషించదగ్గ విషయం అన్నారు. ప్రధానంగా ఆయా నగరాల్లో  అందుబాటులో ఉన్నటువంటి నిధులతో  స్వచ్ఛత, మురుగు కాలువల నిర్మాణాలు, రోడ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్రం నుంచి వచ్చే నిధులతో పెద్ద పెద్ద పనులు చేయడానికి నిధులు ఉపయోగించుకుంటున్నారు.

Back to Top