పులివెందుల: వైయస్సార్ జిల్లా పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ బయటి ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యక్తులను తరలిస్తూ దొంగ ఓట్లకు, పోలింగ్ బూత్‌ల ఆక్రమణకు కుట్రలు జరుగుతున్నాయని కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు వైయస్ఆర్‌సీపీకి చెందిన 900 మందికి పైగా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఓటర్లకు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించాలని, ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసి ఫుటేజీని భద్రపరచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. పులివెందులలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల పారదర్శకత, ఓటర్ల భద్రతపై పలు కీలక అంశాలను ప్రస్తావించారు. మీడియా సమావేశంలో ఎంపీ అవినాష్‌రెడ్డి ఏమన్నారంటే.. - జమ్మలమడుగులో మా నాయకుల వాహనాల ధ్వంసం నిన్న జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారం ముగిసే సమయంలో వైయస్ఆర్‌సీపీ నాయకుల కార్లను టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు వచ్చి ధ్వంసం చేశారు. ఇలాంటి పిరికిపంద చర్యల ఉద్దేశం మా కార్యకర్తలను రెచ్చగొట్టడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, రేపటి పోలింగ్‌పై ప్రభావం చూపడమే. కడపలోనూ గత రెండు వారాలుగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి, హైకోర్టుకు ఫిర్యాదులు చేశాం. - వేలాది మంది బయటి వ్యక్తుల తరలింపు పులివెందులలో మా కార్యకర్తలపై 900 మందికి పైగా తప్పుడు కేసులు పెట్టారు. వందలాది మంది ఇళ్లకు వెళ్లి సోదాలు చేసి అరెస్టులకు ప్రయత్నించారు. మరోవైపు ఇతర నియోజకవర్గాల నుంచి వేలాది మంది టీడీపీ కార్యకర్తలను ఇక్కడికి తరలిస్తున్నారు. మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల నుంచి సుమారు 2 వేల మంది మహిళలను తీసుకొస్తున్నారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల నుంచి తెల్లవారుజామునే పోలింగ్ బూత్‌ల వద్ద ఉండేలా కార్యకర్తలను సమీకరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. - దొంగ ఓట్లకు పాల్పడొద్దు ఇతర నియోజకవర్గాల నుంచి పులివెందులకు వచ్చి స్థానికుల ఓటు హక్కును అడ్డుకోవడం, వారి స్థానంలో ఓట్లు వేయడం దొంగ ఓటు వేయడమే. టీడీపీ నాయకుల మాటలు నమ్మి ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మీ నాయకులు చెప్పే మాటల కోసం మరొకరి ఓటు హక్కును దొంగిలించవద్దు. - ప్రతి ఒక్కరూ తమ ఓటు తామే వేయాలి పులివెందులలో టీడీపీ నాయకులు ఇళ్లకు వెళ్లి మీరు ఓటు వేయడానికి రావద్దు, మీ ఓట్లు మేమే వేసుకుంటామని చెబుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వయంగా వినియోగించుకోవాలి. ఎవరైనా బెదిరించినా, భయపెట్టినా వెనక్కి తగ్గవద్దు. మీ ఓటు మీ హక్కు, మీ సొత్తు. అవసరమైతే పోరాడైనా మీ ఓటును మీరే వేయాలి. - ఓటర్ స్లిప్పుల పంపిణీలోనూ అక్రమాలు ఇప్పటికీ చాలా వార్డుల్లో ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తికాలేదు. ఒక వార్డులో 1,300 ఓట్లు ఉంటే, అందరికీ స్లిప్పులు అందడం లేదు. ఈ స్లిప్పులను బయటి నుంచి వచ్చే దొంగ ఓటర్లకు ఉపయోగించుకునే అవకాశం ఉందనే అనుమానాలు ఉన్నాయి. ప్రతి ఓటరును గుర్తించేలా పక్కా ఏర్పాట్లు చేయాలి. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా పనిచేయాలి. - పోలింగ్ ఏజెంట్లకు భద్రత కల్పించాలి ప్రతి పోలింగ్ బూత్‌లో సీసీ ఫుటేజీ రికార్డు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆ ఫుటేజీని భద్రపరచాలి. పోలింగ్ ఏజెంట్లకు పూర్తి భద్రత కల్పించాలి. మా కార్యకర్తలకు, ఏజెంట్లకు ఏ చిన్న హాని జరిగినా మాకు జరిగినట్లే భావిస్తాం. అక్రమాలు జరిగితే ఎన్నికల పిటిషన్లు వేసి ఆధారాలతో న్యాయపోరాటం చేస్తాం. - వైయస్ జగన్ పర్యటన రీషెడ్యూల్ పులివెందులలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మా అందరి విజ్ఞప్తి మేరకు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పర్యటనను రీషెడ్యూల్ చేశాం. ఈరోజు రాత్రి రావాల్సిన ఆయన రేపు (ఆదివారం)మధ్యాహ్నంలోపు పులివెందులకు చేరుకుంటారు. ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి బయటి వ్యక్తుల తరలింపును అడ్డుకోవాలి. ప్రజలు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించాలని వైయస్ అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.