స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

నామినేషన్ల నుంచి ఓట్ల లెక్కింపు వరకు సీసీటీవీ, వీడియోగ్రఫీ తప్పనిసరి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వైయ‌స్ఆర్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు అక్టోబర్‌ 27న కీలక ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల దాఖలుకు ఆటంకాలు కల్పించడం, అభ్యర్థి అనుమతి లేకుండా నామినేషన్‌ తిరస్కరించడం వంటి అంశాలపై సమర్పించిన ఆధారాలను పరిశీలించి పరిష్కరించాలని స్పష్టం చేసింది. అక్రమంగా నామినేషన్‌ తిరస్కరణకు గురైన అభ్యర్థులు న్యాయపోరాటం చేసేందుకు అవకాశం కల్పించింది.

అన్ని స్థానిక ఎన్నికలకు సీసీటీవీ నిఘా

మున్సిపల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు, రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాలు, పోలింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీటీవీ లేదా వీడియోగ్రఫీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఎన్నికల పిటిషన్ల దాఖలుకు నిర్ణయించిన గడువు ముగిసే వరకు ఫుటేజీని భద్రపరచాలని, పిటిషన్‌ దాఖలైతే కేసు తుది పరిష్కారం అయ్యేవరకు దాన్ని కాపాడాలని స్పష్టం చేసింది.

నిష్పక్షపాత ఎన్నికలకు భద్రత కల్పించాలి

ఎన్నికల ట్రిబ్యునల్‌ కోరినప్పుడు సంబంధిత ఫుటేజీని అందించాలని, ఎన్నికల పిటిషన్‌లో భాగస్వాములైన వారికి దరఖాస్తుపై అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అభ్యర్థులు నిరాటంకంగా నామినేషన్లు వేసేందుకు తగిన పోలీసు బందోబస్తు కల్పించాలని డీజీపీకి స్పష్టం చేసింది.

Back to Top