అనంతపురం: రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో బాలిక కుడిచేయి తెగిపోగా, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడింది. బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు బెంగళూరుకు తరలించారు. వేగంగా చికిత్స అందించేందుకు పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. మరోవైపు ధర్మవరం మండలం నాగలూరుకు చెందిన హేమంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.