టీటీడీ పాల‌క మండ‌లి చ‌రిత్ర‌లో అస‌మ‌ర్థ చైర్మ‌న్ బీఆర్ నాయుడు

రెండేళ్లుగా తిరుమ‌ల‌ను వివాదాల‌కు కేంద్ర బిందువుగా మార్చేశాడు

టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ఫైర్ 

తిరుప‌తిలోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన టీటీడీ మాజీ చైర్మ‌న్, వైఎస్సార్‌సీపీ రీజిన‌ల్ 
కోఆర్డినేట‌ర్‌ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి

భక్తుల విశ్వాసం, తిరుమల పవిత్రతను దెబ్బతీసిన కూటమి పాలన

దర్శన టికెట్ల బ్లాక్‌ మార్కెట్‌, శ్రీవాణి టికెట్ల‌లో ద‌ళారుల ప్ర‌మ‌యేం..

గోశాలలో గోవుల మరణాలు, కొండపై మద్యం, మాంసం విక్ర‌యాల‌పై సమాధానం చెప్పాలి

శ్రీవారి భ‌క్తుడిగా కాకుండా చంద్ర‌బాబు సేవ‌కుడిగానే బీ ఆర్ నాయుడు ప‌నిచేశాడు

చంద్ర‌బాబు రాజకీయ కుట్ర‌ల‌కు వేదిక‌గా తిరుమ‌ల‌ను వాడుకున్నాడు

టికెట్ల కోసం వ‌చ్చి భ‌క్తులు చ‌నిపోవ‌డం తిరుమ‌ల చ‌రిత్ర‌లో మాయ‌ని మ‌చ్చ 

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన నాటి నుంచి తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను మంట‌క‌లిపేశారు

భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ఆగ్ర‌హం   

తిరుప‌తి: 93 ఏళ్ల టీటీడీ చరిత్రలో శ్రీవారి వ్యవస్థను, తిరుమ‌ల క్షేత్ర మహిమను సర్వం భ్రష్టు పట్టించిన ఘ‌న‌త చైర్మ‌న్‌ ఒక్క బీ ఆర్ నాయుడుకే దక్కుతుందని టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తిరుప‌తిలోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తిరుమ‌ల క్షేత్రాన్ని రాజ‌కీయాల‌కు వేదిక‌గా మార్చేసి గత రెండేళ్లుగా బీ ఆర్ నాయుడు, స్వామి వారి సేవకుడిగా కాకుండా, చంద్రబాబుకు భక్తుడిగా మారి పని చేశారని ఫైర్ అయ్యారు. ఇంకా గ‌త వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై, మా నాయకుడు వైఎస్ జగన్ గారిపై నిత్యం పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడమే ఆయన ప‌నిగా పెట్టుకున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం టోకెన్ల జారీ సందర్భంగా అధికారుల వైఫల్యం వల్ల జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు దుర్మరణం చెందగా, 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎంతో గొప్ప ఆశయంతో తాము అమలు చేసిన 10 రోజుల వైకుంఠ ఏకాదశి దర్శనాలను రద్దు చేయించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిప‌డ్డారు.స్వామి వారి వైభవాన్ని ఒక్క రోజు కూడా కీర్తించక‌పోగా, ప్ర‌పంచంలోని ప‌ర‌మ ప‌విత్ర‌మైన తిరుమ‌ల క్షేత్రాన్ని నిత్యం వివాదాల‌కు కేంద్ర బిందువుగా మార్చేశాడ‌ని ఆరోపించారు. తిరుమ‌ల కొండ‌పై విచ్చ‌ల‌విడిగా మ‌ద్యం, మాంసం దొరికిన ఎన్నో ఘ‌ట‌న‌లు ఈ రెండేళ్ల‌లోనే జ‌రిగాయ‌న్నారు. బ్లాక్ లో వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్ల అమ్మ‌కాలు, ఆన్‌లైన్‌లో శ్రీవాణి టికెట్ల పేరుతో ద‌ళారుల‌కు అవ‌కాశం క‌ల్పించ‌డం లాంటి వాటికి ఆయ‌న ఇంత‌వ‌ర‌కు స‌మాధానం చెప్ప‌లేద‌న్నారు. టీటీడీ గోశాలలో పదుల సంఖ్యలో గోవులు మరణిస్తే, దానిపై కూడా బాధ్యతారాహిత్యంతో మాట్లాడి భ‌క్తులు మ‌నోభావాల‌ను గాయ‌ప‌రిచాడ‌ని భూమ‌న గుర్తు చేశారు. కొండపై చెప్పులు వేసుకుని మహాద్వారంలోకి ప్రవేశించడం, కొండ‌పై అక్రమ వ్యాపారాలు, రౌడీ మూకల ఆగడాలు బీఆర్‌ నాయుడి పాలనలోనే జరిగాయని.. ఆయ‌న ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో శ్రీవారి భ‌క్తులు ఊపిరి పీల్చుకుంటున్నార‌ని భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి తెలిపారు.   

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...: 
ప్ర‌క్షాళ‌న చేస్తామ‌ని వ‌చ్చిన నాశ‌నం చేశారు: 
టీటీడీని ప్రక్షాళన చేస్తానని, అవకతవకలను కడిగేస్తానని చెప్పి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బీఆర్‌ నాయుడు రెండేళ్లలో తిరుమలను వివాదాలకు కేంద్రంగా మార్చారు. 93 ఏళ్ల టీటీడీ పాలకమండళ్ల చరిత్రలో ఇంతటి వివాదాస్పద పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. స్వామివారి సేవకుడిగా ఉండాల్సిన బీఆర్‌ నాయుడు.. చంద్రబాబుకు రాజకీయ భక్తుడిగా మారి, నిత్యం వైఎస్‌ జగన్ గారిపై, వైఎస్సార్‌సీపీ నాయకులపై ఆరోపణలు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన హయాంలోనే వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 40 మంది గాయపడ్డారు. టీటీడీ గోశాలలో పదుల సంఖ్యలో గోవులు మరణించినా వాస్తవాలను వెల్లడించలేదు.  మేము ఆధారాలతో ప్రశ్నించిన తర్వాతే గోశాల నిర్వహణలోని లోపాలు బయటపడ్డాయి. మేము భక్తిశ్రద్ధలతో ప్రారంభించిన శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తామని చెప్పిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, బీఆర్‌ నాయుడు ఇప్పుడు ఐదు వేల ఆలయాలు నిర్మిస్తామని గొప్పలు చెప్పి రెండేళ్లలో కనీసం 500 ఆలయాలు కూడా నిర్మించలేకపోయారు. మా ప్రభుత్వ హయాంలో లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్ర‌బాబు చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్.. జంతువుల కొవ్వు కలవలేదని తేల్చింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలు చంద్రబాబు హయాంలోనే టీటీడీ సరఫరా వ్యవస్థలోకి వచ్చాయి. గతంలో రూ.350కు కొనుగోలు చేసిన నెయ్యిని ఇప్పుడు రూ.750కు కొనుగోలు చేయడంపై టీటీడీ సమాధానం చెప్పాలి.

టీటీడీ భ‌ద్ర‌తా వైఫ‌ల్యాల‌కి ఎన్నో నిద‌ర్శ‌నాలు:  
దర్శన వ్యవస్థను సులభతరం చేస్తానని, ఏఐ టెక్నాలజీతో రెండు నిమిషాల్లో దర్శనం చేయిస్తానని ప్రకటించిన బీఆర్‌ నాయుడు చివరకు ఆ హామీని నెరవేర్చలేకపోయారు. శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ విక్రయాల పేరుతో దళారులకు అవకాశం కల్పించి, రూ.800 టికెట్లను రూ.15 వేల వరకు బ్లాక్‌లో విక్రయించే పరిస్థితి తీసుకొచ్చారు. రూ.300 దర్శన టికెట్లను రూ.3 వేల చొప్పున, వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను రూ.5 వేల చొప్పున బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. తిరుమల కొండపై మద్యం, మాంసం విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ఒకేరోజు 182 క్వార్టర్ మద్యం బాటిళ్లు పట్టుబడటం, బెల్ట్‌షాప్‌ వ్యవహారం బయటపడటం టీటీడీ భద్రతా వైఫల్యానికి నిదర్శనం. ఈ ఘటనలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి వైఎస్సార్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌పై తప్పుడు కేసులు బనాయించారు. కొండపై చెప్పులు వేసుకుని మహాద్వారంలోకి ప్రవేశించడం, అక్రమ వ్యాపారాలు, రౌడీ మూకల ఆగడాలు బీఆర్ నాయుడు పాల‌న‌లోనే జ‌రిగాయి. ఏడో మైలురాయి వద్ద వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంజనేయస్వామి విగ్రహం మాయమైనా సరైన సమాధానం చెప్పలేదు. 25 ఏళ్ల క్రితం విగ్రహం ఏర్పాటు చేశారని చెబుతున్న అధికారులు, ప్రతి సంవత్సరం అక్కడ హనుమంతుని జన్మాష్టమి రోజున టీటీడీ అధికారికంగా పూజలు ఎందుకు నిర్వహించిందో సమాధానం చెప్పాలి. అలిపిరి పాదాల సమీపంలోని పవిత్రమైన భూమిని గోమాంసం విక్రయించే హోటల్‌కు కేటాయించడంపై చంద్రబాబు ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. టీటీడీ ఈవోలు, అదనపు ఈవోలతో బీఆర్‌ నాయుడు బహిరంగంగా వివాదాలకు దిగడం, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనూ వాగ్వాదాలకు దిగ‌డం సంస్థ ప్రతిష్టను దిగజార్చింది. భక్తుల విశ్వాసాన్ని కాపాడాల్సిన టీటీడీని రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారు. 

యాద‌వ సామాజిక వ‌ర్గానికి సముచిత స్థానం:    
తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో యాదవ సామాజిక వర్గానికి తగిన గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో మా నాయకుడు వైఎస్‌ జగన్ గారు పేద కుటుంబానికి చెందిన వాసు యాదవ్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. 1,200 ఏళ్ల క్రితమే తిరుపతి పరిసర ప్రాంతాల పరిపాలనలో, వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణంలో, క్షేత్ర సంస్కృతి పరిరక్షణలో యాదవులు కీలక పాత్ర పోషించారు. ఆ సామాజిక వర్గానికి గౌరవం ఇవ్వాలన్న గొప్ప ఆలోచనతోనే వైఎస్సార్‌సీపీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మా అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు కూటమి నాయకులు అరాచక శక్తులను రంగంలోకి దించారు. బయట ప్రాంతాల నుంచి రౌడీషీటర్లు, ఎర్రచందనం స్మగ్లర్లు, హత్యానేరాల్లో నిందితులు, ఇతర అరాచక శక్తులను తీసుకొచ్చి మా అభ్యర్థులపై దాడులకు పాల్పడ్డారు. మహిళలని కూడా చూడకుండా చీరలు లాగి అవమానించారు, పలువురిని గాయపరిచారు, 18 చోట్ల నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నామినేషన్లు వేసే అవకాశం కల్పించాల్సిన పరిస్థితి రావడం ప్రజాస్వామ్యానికి జరిగిన అవమానం. 

స్వేచ్ఛ‌గా ఓటేసే వాతావ‌ర‌ణం క‌ల్పించాలి:  
తొలిరోజు వందలాది మంది పోలీసులు ఉన్నా దాడులకు పాల్పడిన వారిని అడ్డుకోలేకపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత నలుగురు పోలీసుల సాయంతోనే మా 18 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగలిగారు. దీనిని బట్టి తొలిరోజు పోలీసులు ఎందుకు ప్రేక్షకపాత్ర వహించారో సమాధానం చెప్పాలి. పోలీసు వ్యవస్థపై మాకు గౌరవం ఉంది, కానీ పోలీసులు గూండాలకు రక్షణగా ఉండకూడదు. తిరుపతిలో ప్రతి ఓటరు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసేలా కలెక్టర్‌, ఎస్పీ, ఎన్నికల అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి. మా అభ్యర్థులు, ఏజెంట్లకు పూర్తి రక్షణ కల్పించి పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి దౌర్జన్యాలకు తావులేకుండా చూడాలి. ఇకనైనా ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించి తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top