సుప్రీంకోర్టు ఆదేశాలూ లెక్కచేయని రాష్ట్ర ఎన్నికల కమిషన్

 ఎన్నికల నిర్వహణలో విఫలమైతే న్యాయపోరాటం తప్పదు

వైఎస్సార్సీపీ నేతల హెచ్చరిక

విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఎస్ఈసీని కలిసిన తర్వాత, బయట మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్ రెడ్డి

స్ధానిక ఎన్నికల్లో లోపభూయిష్టంగా ఎస్ఈసీ పనితీరు

ఎస్ఈసీ కార్యాలయం పోస్టాఫీసులా మారింది

సుప్రీంకోర్టు ఆదేశాలనూ లెక్కచేయడం లేదు

పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఎందుకు పెట్టరు?

లేళ్ల అప్పిరెడ్డి ఫైర్

ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో బయటి వ్యక్తుల పాగా

వాళ్లను వెనక్కి పంపమని అడిగినా చర్యలు శూన్యం

ఎస్ఈసీపై న్యాయపోరాటం చేయక తప్పేలా లేదు

ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని కోరుతున్నాం

లేళ్ల అప్పిరెడ్డి పిలుపు

నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించలేని స్ధితిలో ఎస్ఈసీ

నామినేషన్ల ప్రక్రియపై సుప్రీంకోర్టే చీవాట్లు పెట్టింది

అయినా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలూ పెట్టట్లేదు

ఉల్లంఘనలు జరిగితే మాత్రం పోరాటం తప్పదు

మల్లాది విష్ణు హెచ్చరిక

నిష్పాక్షికత మర్చిపోయిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ 

ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా నిద్రపోతున్న ఎస్ఈసీ

పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టలేని ఎస్ఈసీ

డమ్మీ కెమెరాలు పెట్టమంటూ టీడీపీ నుంచి ఆదేశాలు

మలసాని మనోహర్ రెడ్డి మండిపాటు 

విజయవాడ:   రాష్ట్రంలో స్దానిక సంస్థల నిర్వహణలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని, కనీసం పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల్ని కూడా లెక్కచేయడం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ మరోసారి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కలిసి పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, పోలింగ్ రోజు నిరంతర వెబ్ క్యాస్టింగ్ తో పాటు పలు అంశాలపై మరోసారి వైఎస్సార్సీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైన నాటి నుంచీ తాము చేస్తున్న ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా మౌనంగా ఉండిపోతున్న ఎస్ఈసీ.. రేపు ఎన్నికల నిర్వహణలో విఫలమైతే మాత్రం న్యాయపోరాటం తప్పదని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. 
ప్రెస్ మీట్లో లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు, మనోహర్ రెడ్డి ఏమన్నారంటే..

లోపభూయిష్టంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పనితీరు:
లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పనితీరు లోపభూయిష్టమైన విధానాలతో నిండిపోయింది. స్పందించాల్సిన అంశాలపై కనీస స్పందన కరువైన పరిస్ధితుల్లో ఎస్ఈసీ ఉంది. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టంగా భావిస్తున్నాం. దాదాపు ప్రతీ రోజూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కలిసి రాష్ట్రంలో అరాచకాలు, అక్రమాలపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం. ఓవైపు టీడీపీ గూండాలు, మరోవైపు రెవెన్యూ, పోలీసు అధికారులు, ఇంకోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వైఫల్యాలపై ఫిర్యాదులు చేస్తున్నాం. అయినా ఎలాంటి స్పందన లేదు. ఎస్ఈసీ కార్యాలయం కేవలం ఫోస్టాఫీసులా మారింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడే స్వతంత్ర సంస్థగా భావించే పరిస్ధితులు లేవు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తున్న పోలింగ్  బూత్ ల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టాలని సాక్ష్యాత్తు సుప్రీంకోర్టు చెప్పినా.. ఆ ఆదేశాలను ఇప్పటివరకూ క్షేత్రస్దాయికి పంపలేదంటే ఎస్ఈసీని ఏమనాలి? గౌరవ న్యాయస్దానాలు అంటే లెక్కలేని పరిస్ధితి కనిపిస్తోంది. ఎస్ఈసీ ఎవరి అండ చూసుకుని ఈ విధంగా ప్రవరిస్తున్నారు ? రాష్ట్రంలో 12724 పోలింగ్ కేంద్రాలుంటే ఇందులో కనీసం 7 వేల పోలింగ్ బూతుల్లో కూడా పూర్తి స్దాయిలో సీసీటీవీ కెమెరాలు కానీ, వెబ్ క్యాస్టింగ్ కానీ లేవని అధికారులే చెప్తున్నారు. చివరి నిమిషంలో కోర్టు ఆదేశాలు వస్తే ఇప్పటికిప్పుడు సీసీటీవీ కెమెరాలు ఎలా పెట్టగలమని ఎస్ఈసీ ప్రైవేటు సంభాషణలో మాట్లాడుతున్నారు. అసలు ఎస్ఈసీగా ఉండి మాట్లాడాల్సిన మాటలా ఇవి? ఆయన ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారంటే రేపు జరిగే పోలింగ్ కు సంబంధించి కఠినమైన నిర్ణయాలు ఉంటాయని భావించాం. కానీ ఆయన ఆఫ్ ది రికార్డ్ గా సీసీ కెమెరాలు పెట్టలేమని తేల్చేశారు. మరోవైపు రాష్ట్రంలో 17 చోట్ల ఛైర్మన్ అభ్యర్ధులు, 8 చోట్ల ఛైర్మన్ తో పాటు కౌన్సిలర్లు కూడా ఏకగ్రీవంగా గెలిచారంటున్నారు. అసలు ఎస్ఈసీ రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటోంది? ఇవాళ వెన్నుపోటు పార్టీకి చెందిన వారు ఏకగ్రీవంగా గెలిచారని ఎస్ఈసీ చెప్పడం ఏంటి ? రాజ్యాంగ పదవిలో ఉన్న మీరు కూడా పచ్చచొక్కా  వేసుకుంటే సరిపోతుంది. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది కేవలం సీసీ కెమెరాలు పెట్టలేమని, టీడీపీకి చెందిన వ్యక్తులు ఏకగ్రీవం అయ్యారని చెప్పడానికే అన్నట్లుగా ఉంది.

ఎన్నికల నిర్వహణలో విఫలమైతే న్యాయపోరాటమే

 వైఎస్సార్సీపీ నాయకులు, అభ్యర్ధులపై దాడులు జరుగుతున్నాయి, పోలింగ్ ఏజెంట్లను బెదిరిస్తున్నారు, నిన్న మాచర్ల, ఒంగోలులో ఏజెంట్ ఫారాలు చించేశారు. అయినా కనీసం చర్యలు లేని పరిస్ధితి. ఇవాళ మళ్లీ అడిగాం. ఏజెంట్లుగా ఫారాలు ఇచ్చిన వాళ్లను గంట ముందు పోలింగ్ కేంద్రాల్లో కూర్చొబెట్టమని చట్టం చెబుతోంది. ఆ సర్కులర్ ఎందుకు ఇవ్వరు? అదే అడిగితే నిన్న చెప్పిన మాటే ఇవాళ చెప్పారు. బయటి వ్యక్తులు నగరాలకు, మున్సిపాలిటీలకు వచ్చి తిష్ట వేస్తున్నారు. ఓటు వేయని వారు, స్ధానికులు కాని వారిని వందల సంఖ్యలో తెస్తున్నారు. వారిని బయటకు పంపమంటే ఏమీ సమాధానం ఇవ్వలేని పరిస్ధితుల్లో ఉన్నారు. ఇవాళ కడపలో చూసినా, మాచర్లలో చూసినా వందల సంఖ్యలో అనుచరుల్ని తెచ్చి తిష్ట వేసి, రేపు పొద్దున్నే బూతుల్ని ఆక్రమించుకుని రిగ్గింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఎస్ఈసీ మా ఫిర్యాదు కాగితాలు తీసుకుంటారు, ముద్ర వేస్తారు, కిందకు పంపిస్తారు, స్పందన మాత్రం ఉండదు. అర్హత ఉండే ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించమని ఎస్ఈసీని కోరుతున్నాం. అయినా చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తప్పకుండా అమలు చేయాలని కోరాం, లేకపోతే నేరుగా ఎస్ఈసీపై వైఎస్సార్సీపీ న్యాయపోరాటం చేయబోతోంది. ఎప్పుడైనా రెండు రాజకీయ పార్టీల మధ్య ఎన్నికలు జరుగుతాయి. కానీ ఏపీలో మాత్రం ఈసారి వైఎస్సార్సీపీ ఓవైపు టీడీపీతో, మరోవైపు పచ్చ చొక్కాలు వేసుకున్న రెవెన్యూ అధికారులు, ఎస్ఈసీతో పోరాడాల్సి వస్తోంది. దేశంలో ఇంత అసమర్దమైన ఎస్ఈసీని ఎక్కడా, ఎప్పుడూ చూడలేదు. ఎస్ఈసీ మీద పోరాటం చేయక తప్పని పరిస్ధితులు వస్తున్నాయి. దీనిపై ప్రజలు, ఓటర్లు విజ్ఞతతో ఆలోచించాలి. అధికారం అండ చూసుకుని అహంకారంతో దుర్మార్గాలకు పాల్పడుతున్న టీడీపీకి బుద్దిచెప్పేలా ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని వాడుకోవాలి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించే ప్రక్రియలో వైఎస్సార్సీపీకి అండగా నిలవాలి. రేపు జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా, దొంగ ఓట్లు వేసుకున్నా, రిగ్గింగ్ జరిగినా ఎస్ఈసీ పూర్తి బాధ్యత వహించాలి. మీపై న్యాయపోరాటం చేసేందుకు వైఎస్సార్సీపీ సిద్దంగా ఉంది. మీరు పదవిలో ఉన్నా, లేకున్నా వదిలిపెట్టేది లేదు. న్యాయపోరాటానికి సిద్దంగా ఉండాలని కోరుతున్నాం. 

సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాల్సిందే
:మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే

రోజూ యథావిధిగా ఫిర్యాదులు చేస్తున్నాం. అయినా వైఎస్సార్సీపీ లేవనెత్తిన అంశాలు, క్షేత్రస్ధాయిలో వస్తున్న ఫిర్యాదులపై ఎస్ఈసీ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మేం ముందు నుంచీ కోరుతూనే ఉన్నాం. అయినా మీ పరిధిలో ఉన్న పోలీసులు, రెవెన్యూ శాఖ ఎందుకు పట్టించుకోవడం లేదు, మీరు ప్రభుత్వం మొత్తాన్ని చేతుల్లోకి తీసుకుని నిష్పాక్షికంగా ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతున్నారని అడుగుతున్నాం.  నామినేషన్ల ప్రక్రియ ఎంత దారుణంగా జరిగిందో సుప్రీంకోర్టే చెప్పింది. ఓవైపు ఎస్ఈసీ, మరోవైపు డీజీపీ వీటికి బాధ్యత వహించాలని చెప్పింది. నామినేషన్లు వేసిన తర్వాత కూడా భయపెట్టడం, విత్ డ్రా చేయించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. మీది మంచి పరిపాలన అయితే, చెప్పింది చేస్తుంటే ఎందుకింత భయ పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వేసేలా చేసి ప్రజాభిప్రాయాన్ని తీసుకోండి, తేడా వస్తే మార్చుకోండి. మరో మూడేళ్ల సమయం ఉంది కదా. అది వదిలేసి పోలీసులు, రెవెన్యూ యంత్రాంగాన్ని చేతుల్లో పెట్టుకుని మరీ ప్రజల గొంతు నొక్కుతున్నారు. విజయవాడలో బీజేపీ, టీడీపీ, జనసేన యథేచ్ఛగా నగదు పంపిణీ చేస్తున్నాయి. ప్రజల ఆలోచనల్ని నగదు ఇచ్చి మార్చాలని వీళ్లు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయారు. రేపు పోలింగ్ సందర్భంగా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా సీసీటీవీ కెమెరాలు పెట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పనిసరిగా అమలు చేయాలని ఎస్ఈసీని కోరాం. రేపు పోలింగ్ తర్వాత ఎక్కడెక్కడ ఉల్లంఘనలు జరిగియో వాటిపై మా కార్యాచరణ ఉంటుంది. 

వ్యవస్ధలో లోపాల్ని వాడుకుంటున్న ప్రభుత్వం    
: మలసాని మనోహర్ రెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు

ఈ రోజు ఎన్నికల కమిషనర్ పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెనుక బోర్డు చూస్తే స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని సంకేతాలు ఇస్తున్నారు. కానీ ప్రతి రోజూ మేం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తూనే ఉన్నాం. అయినా నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ దగ్గరి నుంచీ చూస్తే ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుని నిద్రపోతున్నట్లు అర్దమవుతోంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికిప్పుడు కెమెరాలు పెట్టలేం అని ఓవైపు ఎస్ఈసీ చెబుతుంటే, మరోవైపు టీడీపీ నేతలు డమ్మీ కెమెరాలు పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నట్లు మాకు సమాచారం వస్తోంది. వ్యవస్ధలో లోపాలన్నింటినీ వాడుకోవాలని, అధికారుల్ని, పోలీసుల్ని అడ్డుపెట్టుకుని ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోంది. రేపు ఎన్నికలు ఎంత నిష్పక్షపాతంగా నిర్వహిస్తారో చూద్దాం.ఎస్ఈసీ సమర్థతను నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశం. కాబట్టి ఎస్ఈసీ చిత్తశుద్దితో పనిచేయాలని మేం కోరుతున్నాం.

Back to Top