మునిసిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలి

పోలింగ్‌ నుంచి బ్యాలెట్‌ బాక్సులు స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేరే వరకు నిరంతర నిఘా అవసరం

ప్రతి పోలింగ్‌ బూత్‌లో బలమైన ఏజెంట్లు, ప్రత్యామ్నాయ ఏజెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి

పోలింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్‌లలో సీసీ కెమెరాల ఏర్పాటును పరిశీలించాలి

ఎక్కడ అక్రమాలు జరిగినా ఆధారాలతో సహా వెంటనే ఫిర్యాదు చేయాలి

ఎన్నికల అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్‌

 రాష్ట్రంలో రేపు జరగనున్న మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లు పూర్తి అప్రమత్తంగా ఉండాలని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. పోలింగ్‌ ప్రారంభం నుంచి బ్యాలెట్‌ బాక్సులకు సీలు వేసి, స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించే వరకు ప్రతి దశలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

శనివారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌, పోలింగ్‌ ఏజెంట్ల నియామకం, సీసీ కెమెరాల ఏర్పాటు, స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రత, అక్రమాలపై ఫిర్యాదులు, న్యాయపరమైన చర్యలు తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి గత 15 రోజులుగా రాష్ట్రంలో అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. పోలీసు, ఎన్నికల అధికారులను అధికార పార్టీ తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటోందన్నారు. ఒకటి రెండు ప్రాంతాల్లో కాకుండా ఒక పద్ధతి ప్రకారం, పైస్థాయి నుంచి సమన్వయంతో ఈ వ్యవహారాలు సాగుతున్నాయన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్వతంత్రంగా వ్యవహరించకుండా ప్రభుత్వ శాఖకు అనుబంధంగా మారిపోయినట్లు కనిపిస్తోందని అన్నారు.

ఇప్పటికే ఏడు, ఎనిమిది జిల్లాల్లో అధికార పార్టీ అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, పోలింగ్‌ రోజున మిగిలిన ప్రాంతాల్లోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. నామినేషన్ల దశ నుంచే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకోవడం, నామినేషన్లు తిరస్కరించడం, బలవంతంగా ఉపసంహరింపజేయడం, తప్పుడు కేసులు నమోదు చేయడం, హత్యాయత్నం కేసులు పెట్టడం, బైండోవర్‌ చేయడం వంటి చర్యలకు టీడీపీ పాల్పడిందన్నారు. ఇప్పుడు పోలింగ్‌ ఏజెంట్లను కూడా లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని అన్నారు.

మునిసిపల్‌ ఎన్నికల్లో నూటికి నూరు శాతం ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చినట్లు చూపించుకోవాలన్న లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే అధికార పార్టీకి ఎదురుదెబ్బ తప్పదన్న భయంతోనే ఈ తరహా చర్యలకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతున్న చైర్‌పర్సన్‌ ఎన్నికల విషయంలోనూ అధికార పార్టీకి ఆందోళన ఉందన్నారు.

ఇప్పటివరకు ఎలాంటి సంఘటనలు జరగని ప్రాంతాల్లో కూడా ఏమరపాటుగా ఉండకూడదని పార్టీ నాయకులకు సూచించారు. స్థానిక పోలీసు అధికారులు, ఎన్నికల అధికారులు సానుకూలంగా వ్యవహరిస్తున్నారన్న నమ్మకంతో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించని పోలింగ్‌ కేంద్రాల్లోనూ అవాంఛనీయ సంఘటనలు సృష్టించి పోలింగ్‌ ఏజెంట్లను బయటకు పంపించే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

**పోలింగ్‌ ఏజెంట్ల నియామకంపై ప్రత్యేక దృష్టి**

ప్రతి పోలింగ్‌ బూత్‌కు ప్రధాన ఏజెంట్‌, రిలీవర్లతో పాటు అవసరమైతే ప్రత్యామ్నాయంగా మరికొందరిని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. కనీసం నలుగురు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ఒకరిపై కేసు పెట్టినా, మరే కారణంతోనైనా విధులకు హాజరుకాలేకపోయినా వెంటనే మరో ఏజెంట్‌ను నియమించే ఏర్పాట్లు ఉండాలన్నారు.

ఏజెంట్ల గుర్తింపు పత్రాలు, నియామకానికి సంబంధించిన అధికార పత్రాలు ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. పోలింగ్‌ ప్రారంభానికి ముందే ఉదయం 6 లేదా 6.30 గంటలకల్లా ఏజెంట్లు కేంద్రాల వద్దకు చేరుకోవాలన్నారు. పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లే ముందు తమ పేరు, బూత్‌ నంబర్‌, ఏజెంట్‌గా నియామకానికి సంబంధించిన వివరాలతో వీడియో రికార్డు చేసి భద్రపరచుకోవాలని చెప్పారు.

పోలింగ్‌ కేంద్రంలో ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు ఎదురైనా సంయమనం పాటించాలని, ఇతర పార్టీల ఏజెంట్లతో వాగ్వాదాలకు దిగకూడదని స్పష్టం చేశారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే నేరుగా ప్రిసైడింగ్‌ లేదా సంబంధిత పోలింగ్‌ అధికారికి తెలియజేయాలని సూచించారు.

**సీసీ కెమెరాల ఏర్పాటుపై క్షేత్రస్థాయిలో పరిశీలన**

ప్రతి కార్పొరేటర్‌, కౌన్సిలర్‌ అభ్యర్థి తమ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలను ముందుగానే పరిశీలించాలని సజ్జల సూచించారు. ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయా, లేవా, భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇతర మార్గాల ద్వారా అనధికారికంగా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయా అనే అంశాలపై వివరాలు సేకరించాలన్నారు.

పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, రికార్డయిన ఫుటేజీ భద్రపరచడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావించారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ, కేవలం సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలకే పరిమితం చేస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. సీసీ కెమెరాలు లేని కేంద్రాల వివరాలను వెంటనే సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

**స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రత అత్యంత కీలకం**

పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ గారు స్పష్టంగా ఆదేశించినట్లు సజ్జల తెలిపారు.

జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు స్ట్రాంగ్‌ రూమ్‌లను ముందుగానే సందర్శించి సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు. ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలన్నారు. అవసరమైతే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని చెప్పారు.

బ్యాలెట్‌ బాక్సులకు సీలు వేసే సమయంలో పోలింగ్‌ ఏజెంట్లు తప్పనిసరిగా అక్కడే ఉండాలని, నిబంధనల ప్రకారం అవసరమైన సంతకాలు చేయాలని సూచించారు. బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించే ప్రక్రియను కూడా నిబంధనలకు అనుగుణంగా పర్యవేక్షించాలని తెలిపారు.

**ప్రతి అక్రమాన్ని ఆధారాలతో నమోదు చేయాలి**

ఎన్నికల సమయంలో ఏ చిన్న అక్రమం జరిగినా ఫొటోలు, వీడియోలు, ఇతర ఆధారాలను సేకరించి వెంటనే ఫిర్యాదు చేయాలని సజ్జల స్పష్టం చేశారు. కేవలం ఆరోపణలు చేయడం కంటే విశ్వసనీయ ఆధారాలతో ఎన్నికల అధికారులకు, న్యాయస్థానాలకు ఫిర్యాదులు చేయడం అత్యంత ముఖ్యమన్నారు.

ఇటీవలి ఎన్నికల వివాదాల్లో సుప్రీంకోర్టు ఆధారాలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఆయన ప్రస్తావించారు. ఎక్కడైనా పోలింగ్‌ ఏజెంట్లను అక్రమంగా బయటకు పంపినా, పోలింగ్‌ను అడ్డుకున్నా, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా వెంటనే వివరాలను నమోదు చేసి ఫిర్యాదు చేయాలన్నారు. అవసరమైన చోట రీపోలింగ్‌ కోరాలని సూచించారు.

పోలింగ్‌ సమయంలో అనుమానాస్పద ఓట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అందుబాటులో ఉన్న ఏఎస్‌డీ (Absent, Shifted, Dead) జాబితాలను పోలింగ్‌ ఏజెంట్లు పరిశీలించాలని సూచించారు. నిబంధనల ప్రకారం అభ్యంతరాలు తెలియజేయాలని చెప్పారు.

**బయటి వ్యక్తుల కదలికలపై నిఘా**

ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలకు బయటి వ్యక్తులను తరలిస్తున్నట్లు సమాచారం వస్తోందని సజ్జల తెలిపారు. ముఖ్యంగా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల వ్యక్తులు హోటళ్లు, లాడ్జీల్లో బస చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని అన్నారు.

అలాంటి సమాచారం, ఆధారాలు లభిస్తే వెంటనే పోలీసు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని, పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా వివరాలు పంపాలని సూచించారు. అవసరమైతే ఈ అంశాలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు పోలీసు అధికారుల వ్యవహారశైలిపై ఎంపీ గురుమూర్తి చేసిన ఫిర్యాదులను కూడా సజ్జల ప్రస్తావించారు. అధికారుల చర్యలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్ష జరపాలని కోరారు.

**కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక వార్‌ రూమ్‌**

ఎన్నికల పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక వార్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సజ్జల తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదులు, వీడియోలు, ఇతర ఆధారాలను సేకరించి, సంబంధిత అధికారులకు పంపడంతో పాటు అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తాయని చెప్పారు.

ప్రతి జిల్లాలో సమన్వయకర్తలు, అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లు, రిలీవర్లు పరస్పరం నిరంతర సమాచార సంబంధాలు కలిగి ఉండాలన్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తిన వెంటనే స్పందించేలా బాధ్యతలను ముందుగానే కేటాయించాలని సూచించారు.

పోలింగ్‌ ప్రారంభం నుంచి చివరి ఓటు నమోదయ్యే వరకు, బ్యాలెట్‌ బాక్సులకు సీలు వేసి స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించే వరకు పార్టీ నాయకులు, అభ్యర్థులు, ఏజెంట్లు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సజ్జల రామకృష్ణారెడ్డి పునరుద్ఘాటించారు.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టపరంగా ఎన్నికల ప్రక్రియను పరిరక్షించేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Back to Top