పెద్దారెడ్డి విషయంలో హైకోర్టు ఆదేశాలు పాటించాలి

అనంతపురం ఎస్పీ జగదీష్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేతల బృందం విన‌తి

అనంత‌పురం:  తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో హైకోర్టు ఆదేశాలు పాటించాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు జిల్లా ఎస్పీ జ‌గ‌దీష్‌ను కోరారు. తాడిపత్రి లో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞ‌ప్తి చేశారు. సోమ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై. విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ జిల్లా ఎస్పీని క‌లిసి తాడిపత్రి పరిస్థితులను వివ‌రించారు.  మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని తాడిపత్రి లోకి అనుమతించాల‌ని, తగిన భద్రత కల్పించాలని ఇప్పటికే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింద‌ని తెలిపారు. రెండు మాసాలైనా హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడం దారుణమ‌ని, ఎస్పీ జగదీష్ బాధ్యత గా వ్యవహరించాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..`తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై రాజకీయ కక్ష సాధింపు చర్యలు దుర్మార్గం. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణం. రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. తాడిపత్రి నియోజకవర్గంలో ఆ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది . కేతిరెడ్డి పెద్దారెడ్డి ని తాడిపత్రి నియోజకవర్గంలోకి వెంటనే అనుమతించాలి. తాడిపత్రి లో నియంత పాలన జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై ఆంక్షలు ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలి` అని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top