త్వరలో మరిన్ని ఆసక్తికర చేరికలు 

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 

  అమరావతి : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి త్వరలో మరిన్ని ఆసక్తికర చేరికలు ఉంటాయని పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా టీడీపీకి చెందిన కీలక నేతలు ఆదివారం వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. విశాఖ డైరీ చైర్మన్‌ అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్‌, కుమార్తె రమాకుమారి, విశాఖ డైరీ బోర్డు సభ్యులు, ఇతర నాయకులు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.  ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో మరిన్ని ఆసక్తికర చేరికలు ఉండబోతున్నాయని వెల్లడించారు. అధికారం కోల్పోయాక కూడా చంద్రబాబు తీరు మార్చుకోలేదని, దీంతో టీడీపీ నేతలు విసిగిపోతున్నారని చెప్పారు.
పవన్‌ది దంద్వ వైఖరి
ఇక రాజధాని అమరావతి విషయంలో అస్పష్టత ఏమీ లేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాజధానిలో ఉన్న కష్టనష్టాలు సరిచేస్తామని స్పష్టం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ దంద్వ వైఖరితో మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో అమరావతి ప్రాంతం రాజధానికి అనుకూలం కాదని చెప్పిన వ్యక్తి, నేడు యూటర్న్‌ తీసుకుని మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారని చురకలంటించారు. చంద్రబాబు యూటర్నులు తీసుకున్నట్టే పవన్‌ కూడా రాజధాని విషయంలో యూటర్న్‌ తీసుకున్నారని ఎద్దేవా చేశారు.
 

Back to Top