విభేదాలు పక్కనపెట్టి సమన్వయంతో పనిచేయాలి

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి దిశానిర్దేశం

తిరుపతి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సమష్టిగా సిద్ధమై, ప్రతి ఎన్నికలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ నేత చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి రూరల్‌ మండలం కుంట్రపాకం, తణపల్లి పంచాయతీలకు చెందిన పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. కుంట్రపాకంలో పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. అనంతరం మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఎన్నికల సన్నద్ధత సమావేశాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా హర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికలోనూ బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని సూచించారు. పోటీ చేయాలనుకునే ఆశావహులు నామినేషన్లకు అవసరమైన ధ్రువపత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పనిచేయాలని, ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి ఎన్నికలోనూ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలని స్పష్టం చేశారు.

వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల విజయాన్ని అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడే అవకాశం ఉందని హర్షిత్‌రెడ్డి పేర్కొన్నారు. అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలను పార్టీ శ్రేణులు సంఘటితంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, ఎవరికీ ఏ కష్టం వచ్చినా వెన్నుదన్నుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.

Back to Top