98 శాతానికి పైగా ఎంపీపీ స్థానాల్లో వైయస్‌ఆర్‌సీపీ గెలుపు 

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

ఎంపీపీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి

జెడ్పీటీసీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీకి 69.55 శాతం ఓట్లు వచ్చాయి

పరిషత్‌ ఫలితాలతో మాపై మరింత బాధ్యత పెరిగింది

సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం

98 శాతంకు పైగా స్థానాల్లో వైయస్‌ఆర్‌సీపీ విజయం సాధించింది

పదవుల్లో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఉంటుంది

పార్టీతో పాటు నేతలంతా క్రమశిక్షణతో ఉన్నారు.

ఎల్లోమీడియా, ప్రతిపక్ష నేతల ఆరోపణలను ప్రజలు తిప్పికొట్టారు

కుప్పంలోనే టీడీపీ బోర్లా పడిపోయింది

చంద్రబాబు ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలి

ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రతి పైసా వినియోగిస్తున్నారు

తాడేపల్లి: ఇవాళ జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో 98 శాతానికి పైగా స్థానాల్లో వైయస్‌ఆర్‌సీపీ గెలుపొందిందని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.  సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలనకు ఈ ఫలితాలే నిదర్శమన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలనను ప్రజలు విశ్వసించబట్టే ఈ ఫలితాలు వచ్చాయని చెప్పారు.  మాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. పదవుల్లో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఉంటుందన్నారు. పార్టీతో పాటు నేతలంతా క్రమశిక్షణతో ఉన్నారని స్పష్టం చేశారు. కుప్పం ఓటర్లు కూడా చంద్రబాబును విశ్వసించలేదని, ఇప్పటికైనా ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లోనూ మేం సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు. ప్రజలకు మేలు చేస్తుంటే చంద్రబాబు, ఎల్లోమీడియా జీర్ణించుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతి పైసా వినియోగిస్తున్నామని చెప్పారు.ఎల్లోమీడియా, ప్రతిపక్ష నేతల ఆరోపణలను ప్రజలు తిప్పి కొట్టారని చెప్పారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

మొన్నటి ఫలితాలు చూసిన తరువాత సీఎం వైయస్‌ జగన్‌ తన ఆనందాన్ని ప్రజలతో పంచుకున్నారు. తన బాధ్యతను ప్రజలతో వ్యక్తీకరించారు. ఇప్పుడు ఎన్నికైన వారిలో 98 శాతం వైయస్‌ఆర్‌సీపీకే దక్కాయి. జెడ్పీటీసీలు అన్నీ కూడా  98 శాతం గెలిచారు. అన్ని జిల్లా పరిషత్‌లు మాకే దక్కాయి. ఇందులో ఎవరు నాయకులు కావాలి..ఎవరి నాయకత్వం రావాలన్నది సహజంగా జరుగుతుంది. వైయస్‌ఆర్‌సీపీ బడుగు వర్గాలకు పెద్దపీట వేయాలనే నిర్ణయంతో ముందుకు వెళ్తోంది. ఇంత పెద్ద ఎత్తున గెలిచి..మా పార్టీలో నాయకత్వంలో పోటీపడే అవకాశం ఉంటుంది.

వెనుకబడిన వర్గాలకు కొంత పెద్ద పీట వేయాలని భావించాం..కాబట్టి కోటాను పెంచాం. చాలా తక్కువగా చెదురుమదురుగా ..టీడీపీ ఆశించినంతగా ఎలాంటి విభేదాలు తలెత్తలేదు. ఇది మా పార్టీ క్రమశిక్షణకు నిదర్శనం. వైయస్‌ జగన్‌ నాయకత్వంపై అందరూ పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు. అందరూ ఏకతాటిపై ఉన్నారు. పూర్తి క్రమశిక్షణతో నడుచుకుంటూ..నాయకుడి మాట శిరోధార్యంతో కింది శ్రేణులు భావిస్తున్నాయి. ఈ రోజు సజావుగా, ప్రశాంతంగా ఎంపీపీ ఎన్నికలు జరుగుతున్నాయి. పదవుల కేటాయింపులో పత్రికలు, విపక్షాలు విశ్లేషణ చేయకపోవచ్చు. కారణం ఏకపక్షంగా ఫలితాలు వచ్చాయి. మేం విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓవరాల్‌గా చూస్తే..మొన్నటి ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 1,26,27,790 అయితే జెడ్పీటీసీల్లో వైయస్‌ఆర్‌సీపీకి 87,83,194 ఓట్లు వచ్చాయి. అంటే 69.55 శాతం ఓట్లు మా పార్టీకి వచ్చాయి. టీడీపీకి 22.27 శాతం ఓట్లు, జనసేనకు 3.83 శాతం, బీజేపీకి 2.23 శాతం ఓట్లు వచ్చాయి. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఇందులో ఉంది. జెడ్పీటీసీల్లో 70 శాతం పోలైన ఓట్లు ఈ సారి జరిగింది. వైయస్‌ జగన్‌ పట్ల ప్రజల విశ్వాసం, అభిమానం వ్యక్తమైందని సవినయంగా, వినమ్రంగా చెప్పుకుంటున్నాం.

ఎంపీటీసీల్లో 1,20,10,661 ఓట్లు పోలైతే..వైయస్‌ఆర్‌సీపీకి 77, 84,427 ఓట్లు వచ్చాయి. అంటే 64.08 శాతం వైయస్‌ఆర్‌సీపీకి ఓట్లు వచ్చాయి. టీడీపీకి 30, 35,501 ఓట్లు అంటే 25.27 శాతం, జనసేనకు 5,22,009 ఓట్లు అంటే 4.34 శాతం, బీజేపీకి 1,78,004 ఓట్లు, అంటే 1.08 శాతం ఓట్లు వచ్చాయి. ఎంపీటీసీ ఫలితాల్లో కూడా వైయస్‌ఆర్‌సీపీకి తిరుగులేని విజయం. దేశ చరిత్రలో ఇదొక రికార్డుగా చెప్పవచ్చు. గత రెండున్నరేళ్లుగా ఏపీలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారం, నిరాశ, నిషృహతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీడియా వారికి నచ్చినట్లు రాస్తున్నారు. ప్రజాస్వామ్యంపై వారు దాడి చేస్తున్నారు. కోర్టులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ అంటూ విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న అవాకులు, చవాకులు పేలుతున్నారు. ఒక్క శాతం ఓటింగ్‌ లేని బీజేపీ నేతలు రాష్ట్రంలో మురికి గుంటలో చేపలు పట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అంశాల గురించి వారు మాట్లాడటం లేదు. మతాన్ని అడ్డం పెట్టుకొని దుష్ట రాజకీయాలు చేస్తున్న పార్టీలకు ఓట్లు సరైన గుణపాఠం చెప్పారు. 

ఫలితాలు వచ్చిన తరువాత కూడా వారికి సిగ్గు రాలేదు. రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు రద్దు చేసి రండీ అంటూ ప్రేలాపణలు పేల్చుతున్నారు. టీడీపీ తప్పుడు విమర్శలను ప్రజలు పట్టించుకోలేదు. చంద్రబాబు కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు. కుప్పం నియోజకవర్గంలో 63 వైయస్‌ఆర్‌సీపీ గెలిస్తే..టీడీపీకి 3 ఎంపీటీసీ స్థానాలు వచ్చాయి. అక్కడ చంద్రబాబు బొక్కబోర్లపడ్డారు. చంద్రబాబు కంటే బెటర్‌గా కొందరు టీడీపీ నేతలు మంచి ఫలితాలు సాధించారు. నిజంగా మీరు ఎన్నికలు బహిష్కరించి ఉంటే..అందరి కంటే తక్కువ ఫలితాలు చంద్రబాబుకే వచ్చాకి కదా? ఎందుకు కుప్పం ప్రజలు ఎక్కువ ఎంపీటీసీలు ఇవ్వలేదు. పరిషత్‌ ఎన్నికల్లో టీడీపీ ప్రచారం చేసింది. డబ్బులు పంచింది. జనసేనతో లోపాయికారి ఒప్పందాలు పెట్టుకున్నారు.  40 ఏళ్ల పార్టీ , సైకిల్‌ గుర్తు అందరికీ తెలుసు ..అందుకే 22 శాతం ఓట్లు వచ్చాయి.

మా పార్టీ పెట్టిన రెండేళ్లకే ఫ్యాన్‌ హవా కొనసాగింది. ఇంత తొందరగా ప్రభంజనం సృష్టించింది. టీడీపీ నేతలు ఎందుకు ఫలితాలపై విశ్లేషణ చేసుకోవడం లేదు. జూమ్‌ కాన్ఫరెన్స్‌లో విష ప్రచారం చేస్తున్నారు. డ్రగ్స్‌కు వైయస్‌ జగన్‌కు ఏం సంబంధం ఉంటుందని సామాన్య జనానికి అర్థమైంది. కానీ టీడీపీ చిన్న పాటీ ఆత్మ విమర్శ చేసుకోకపోవడం వారి బాధ్యాతారాహిత్యానికి పరాకాష్టగా చెప్పవచ్చు.  

టీడీపీ అధికారంలో ఉండగా ఆ రోజు ప్రభుత్వం ఇతర శాఖల నుంచి నిధులు మళ్లించింది. 2018–2019వ సంవత్సరంలో సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ నుంచి రూ.18,500 కోట్లు, డ్రికింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.940 కోట్లు, స్టేట్‌ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.1200 కోట్లు, రైతు సాధికార సంస్థ రూ.450 కోట్లు ఇలా పైపైనా తవ్వితే మళ్లించిన నిధులు రూ.8,390 కోట్లు ..ఇవి కాక చాలా ఉన్నాయి. పసుపు కుంకుమ కోసం సివిల్‌ సప్లై నిధులు మళ్లించారు. 

2019 ఏప్రిల్‌లో ఎన్నికలకు ముందు ఒకే రోజు ఆర్‌బీఐ నుంచి రూ.5 వేల కోట్లు పసుపు–కుంకుమ కోసం డ్రా చేశారు. చరిత్రలో ఇంత డబ్బులు ఎప్పుడు డ్రా చేయలేదు. ఎల్లోమీడియా ఇవన్నీ కూడా రాసి ఉంటే బాగుండేది. ఆ రోజు ఈనాడు పత్రిక లేదా?. రాష్ట్ర ప్రభుత్వం రుణ పరిమితులను వాడుకుంటూ..కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటూ పాలన సాగిస్తుంటారు. ప్రభుత్వానికి ఉన్న నిర్ణయాకశక్తి ప్రకారం నిధులు తెచ్చుకుంటుంది. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. టీడీపీ ఆ నిధులను కమీషన్ల రూపంలో దోచుకోవడంతో ప్రజలు ఎన్నికల్లో ఛీత్కరించారు.

వైయస్‌ జగన్‌ ప్రభుత్వానికి ఒకపైసా అప్పు పుట్టకూడదని, కేంద్రం నిధులు ఇవ్వకూడదన్నదే ఎల్లోమీడియా, ప్రతిపక్ష తాపత్రయం. గతంలో నీరు–చెట్టు అంటూ ఛుమంతర్‌ అంటూ నిధులు కాజేశారు. ఉపాధి హామీ పథకంలో ఎన్ని నిధులు మింగారో అందరికి తెలుసు. చంద్రబాబు కంటే కొన్ని పత్రికలు రెండడుగులు ముందుకు వేసి రాస్తున్నాయి. వీళ్ల కథనాలు చూస్తుంటే బూతు కథల్లో చివర చెప్పే నీతి లాగా ఉంది. ఇలాంటి వాళ్లను కూడా కొందరు అమాయకజనం నమ్ముతారు. చంద్రబాబు రూటే రాంగ్‌ రూట్, అడ్డదారులు తొక్కడం ఆయన నైజం.

వ్యవస్థలను ప్రక్షాళన చేసేందుకు వైయస్‌ జగన్‌ పూనుకున్నారు. ఆయన సంకల్పించిన సంక్షేమ పథకాలకు ప్రతి పైసా వెళ్తుంది. చంద్రబాబు ఎంత గగ్గోలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పచ్చ కామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. వైయస్‌ జగన్‌ యువకుడు..నిబ్బరంగా ఉండే నాయకుడు. మీ ఆరోపణలు, మీ పప్పులు ఉడకవని నిన్నటి ఎన్నికల్లో రుజువైంది. ఇక ముందు కూడా తెలుస్తుంది. 

ఈ మధ్య ప్రతిపక్ష నేతల్లో బూతులు ఎక్కువయ్యాయి. సైకలాజికల్‌ వ్యక్తులు మాట్లాడేలా వారి భాష ఉంది. ప్రజాస్వామ్యంలో విమర్శ, సద్విమర్శ ఉంటాయి. అది గాడి తప్పితే దివాళ తీస్తారు. ఆ పార్టీ నేతల్లో వివేకం ఉంటే ..ఫలితాలపై చర్చ జరపాలి. రోజు జ్యోతి, ఈనాడు స్టోరీలు పట్టుకుని మాట్లాడితే..మీ పార్టీ ఎందుకు, మీ రాజకీయాలు ఎందుకు?. ఇలాంటివి మానుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి విపక్షాలకు సూచించారు.

 

తాజా వీడియోలు

Back to Top