సైదాపురంలో వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం

  పార్టీ శ్రేణులకు నేదురుమ‌ల్లి దిశానిర్దేశం  

వెంక‌ట‌గిరి: సైదాపురంలో నిర్వహించిన వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమష్టిగా సిద్ధం కావాలని, నాయకులు, కార్యకర్తలు ఏకతాటిపైకి వచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వెంకటగిరి నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యలపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లును కలిసి వినతిపత్రాలు సమర్పించారు. కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని, ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని నేదురుమల్లి పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వెంకటగిరి మున్సిపాలిటీ వార్డుల పునర్విభజనలో లోపాలను సరిచేయడంతో పాటు 2026 ఎన్నికల పోలింగ్ కేంద్రాల తుది జాబితాను సమగ్రంగా పునఃపరిశీలించాలని కలెక్టర్‌ను కోరారు. వార్డు సరిహద్దులు, ఇంటి నంబర్లు, ఓటర్ల జాబితా భాగాలు, ఓటర్ల కేటాయింపు, పోలింగ్ ప్రాంతాలు, కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన సవరణలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నేతన్న సేవలో పథకం రెండో విడత లబ్ధిదారుల జాబితాను వెంటనే విడుదల చేసి, అర్హులైన నేత కార్మికులకు నిధులు జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో వైయ‌స్ఆర్‌సీపీ పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్‌రెడ్డి, ఆర్‌టీఐ విభాగం రాష్ట్ర కార్యదర్శి పి. సదానందరెడ్డి, బూత్ కమిటీల విభాగం వైస్‌ ప్రెసిడెంట్ రేవంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. వినతులపై కలెక్టర్ వెంకటేశ్వర్లు స్పందిస్తూ సంబంధిత అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Back to Top