ఎంపీ మిధున్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టేందుకు కుట్ర

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్‌

లేని లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ చేసే ప్రయత్నం

చంద్రబాబు కక్షసాధింపుల్లో భాగంగానే ఈ దుర్మార్గం

వైయస్ జగన్ చుట్టూ ఉన్న వారిని వేధించడమే చంద్రబాబు లక్ష్యం

ఎంతగా అణచివేస్తే... అంతగా వైయస్ఆర్‌సీపీ బలపడుతుంది

స్పష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

లూలూ కంపెనీతో చంద్రబాబుకు ఉన్న బంధం ఏమిటీ.?

రూ.వేల కోట్ల విలువైన భూములను ఎందుకు కట్టబెడుతోంది.?

విజయవాడలో రూ.400 కోట్ల స్థలంను లూలూకు దారాదత్తం చేసే యత్నం

ఆర్టీసీ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తే సహించం

ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హెచ్చరిక

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిధున్‌ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి, అరెస్ట్ చేసేందుకు చంద్రబాబు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం కుట్రపన్నిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఏదో ఒక విధంగా వైయస్ జగన్ చుట్టూ ఉన్న వారిపై తప్పుడు కేసులు బనాయించి, వేధించాలనే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే లేని లిక్కర్ స్కాంను సృష్టించి, దానిలో ఎంపీ మిధున్‌ రెడ్డిని ఇరికించాలనే పన్నాగం పన్నారని ధ్వజమెత్తారు. ఎంతగా వైయస్ఆర్‌సీపీని అణిచి వేయాలని చంద్రబాబు భావిస్తే, అంతకంటే బలంగా పార్టీ బలోపేతం అవుతుందని హెచ్చరించారు. 

ఇంకా ఆయనేమన్నారంటే...

ఏడాది కాలంగా చంద్రబాబు, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని వైయస్ఆర్‌సీపీపై అమలు చేస్తున్నారు. లేని లిక్కర్ స్కాంను సృష్టించి, దానిలో భాగంగా మొదట్లో రూ.50 వేల కోట్లు, అని తరువాత రూ.30 వేల కోట్లు అంటూ, ఆ తరువాత రూ.18 వేల కోట్ల కుంభకోణం అంటూ పలుసార్లు, ఇష్టం వచ్చినట్లుగ లిక్కర్ స్కాం గురించి ఎల్లో మీడియా ద్వారా కథనాలు రాయించి, కూటమి ప్రభుత్వం ఒక కుట్రపూరిత ప్రచారం చేయించింది. రూ.50 వేల కోట్లు అంటూ ప్రారంభించి ఇప్పుడు రూ.2000 కోట్ల కుంభకోణం వరకు వచ్చారు. నిజంగా ఈ మేరకు అవినీతి జరిగిందా అని చూస్తే కనీసం ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లుగా ఆధారాలు లేవు. దీనిపై న్యాయస్థానం సిట్‌ను ఎంత సొమ్మును మీరు సీజ్ చేశారని, ఆధారాలు చూపాలని ప్రశ్నిస్తే సిట్ అధికారులు నీళ్ళు నమిలారు. ఇప్పటి వరకు ఆధారాలు లేవు, వాటిని సమర్పించేందుకు సమయం కావాలని వారు కోరారు. దీనిని బట్టి అర్థమవుతున్నదేమిటీ అంటే లిక్కర్ స్కామ్‌ను సృష్టించడం, కొందరిని బెదిరించి, భయపెట్టి తమకు వ్యతిరేకంగా ఉన్న వారిపై స్టేట్‌మెంట్లు తీసుకుని, దానిని ఆధారంగా చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఒక మాస్టర్‌ మైండ్ ప్రకారం ఈ కుట్రను ముందుకు తీసుకువెడుతున్నారు. 

చంద్రబాబు జీవితమంటా కుట్రలే

తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌పైనే చంద్రబాబు కుట్రలు చేసి, ఆయన పదవిని, పార్టీని లాక్కున్నారు. ఇలా ఆయన రాజకీయ జీవితం అంతా కుట్రలు, కుతంత్రాలతోనే నడుస్తోంది. నేడు ఏపీలో చంద్రబాబు పాలనలోని అసమర్థను ఎత్తి చూపుతున్న వైయస్ఆర్‌సీపీని చూసి తట్టుకోలేక పోతున్నారు. తనకు సహజమైన కుట్రపూరిత ఆలోచనలతోనే అధికార దుర్వినియోగంకు పాల్పడుతూ తప్పుడు కేసులు పెట్టేందుకు ఒక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. 2014-19లో చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, సన్నిహితులపై దాదాపు 13 అవినీతి కేసులు ఉన్నాయి. దానిలో మద్యం కుంభకోణం కేసు కూడా కీలకమైంది. ఈ కేసులను అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని నిర్వీర్యం చేసేందుకు ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుంటున్నారు. 2014-19 మధ్య లిక్కర్ స్కాంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. అటువంటి చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి రాగానే వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం లోని కీలకంగా పనిచేసిన వారిపై కక్షసాధింపుతో ఎదురు కేసులు పెట్టిస్తున్నారు.

సిట్ కార్యాలయం వద్ద పోలీసుల అత్యుత్సాహం

ఎంపీ మిధున్‌ రెడ్డి స్వచ్ఛందంగా సిట్ విచారణకు హాజరయ్యేందుకు విజయవాడకు వచ్చారు. సిట్ కార్యాలయం వద్ద పోలీసులు ఒక యుద్ద వాతావరణంను తలపించేలా బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్ట్‌ నుంచి ఆయనతో పాటు వస్తుంటే అందరినీ మధ్యలోనే అడ్డుకోవడం, మిధున్‌ రెడ్డితో మాట్లాడేందుకు వీలు లేకుండా బారికేట్లు పెట్టడం, అన్ని చోట్లా ఆంక్షలు పెట్టడ, అందరినీ అడ్డుకోవడం ద్వారా భయోత్పాతాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వైయస్ఆర్‌సీపీని అణిచివేయాలనుకోవడం చంద్రబాబు అవివేకం. ఈ కుట్రలకు భయపడేవారు ఎవరూ వైయస్ఆర్‌సీపీలో లేరు. చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకువెలతాం. మద్యం కుంభకోణం సినిమాను తిప్పికొట్టేందుకు సిద్దంగా ఉన్నాం. నేడు రాష్ట్రంలో మధ్యం ఏరులై పారుతోంది. ప్రతి చోటా బెల్ట్‌షాప్‌లు నడుపుతున్నారు. కూటమి నేతల చేతుల్లోనే మొత్తం మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. అధిక రేట్లకు మద్యం విక్రయాలు చేస్తున్నారు.   

విజయవాడలోనూ లూలూకు ఖరీదైన స్థలం

ఒకవైపు కక్షసాధింపులు, మరోవైపు ప్రభుత్వ భూములను తన బినామీలకు కారుచౌకగా అప్పగించి, తద్వారా జేబులు నింపుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. విజయవాడ గవర్నర్‌ పేట లోని ఆర్టీసీ పాత బస్టాండ్‌తో పాటు, విద్యాధరపురంలోని ఆర్టీసి డిపో స్థలాన్ని కూడా లూలూ సంస్థకు ఇవ్వాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుత మార్కెట్‌ రేటు ప్రకారం విజయవాడ పాత బస్టాండ్‌ స్థలం విలువ దాదాపు రూ.400 కోట్ల వరకు ఉంటుంది. ఇంక విద్యాధర పురం లోని ఆర్టీసీ డిపో స్థలం విలువ కూడా చాలా ఎక్కువే. ఒక కార్పొరేట్‌ సంస్థకు అంత విలువైన ప్రభుత్వ స్థలాలు కట్టబెట్టాలన్న నిర్ణయంతో చంద్రబాబు ప్రభుత్వం మరో అతి పెద్ద అవినీతి పర్వానికి తెర లేపింది. అసలు ఒక కార్పొరేట్‌ సూపర్‌ మార్కెట్‌ సంస్థకు ప్రభుత్వం విలువైన స్థలాలు కట్టబెట్టాల్సిన అవసరం ఏముంది? దేశంలో చాలా చోట్ల వాల్‌మార్ట్‌ మార్కెట్‌లు ఏర్పాటు చేసింది. వారంతట వారు స్థలం సేకరించుకుని, తమ సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు తప్ప, ఎక్కడా ప్రభుత్వం వారికి విలువైన స్థలాలు ఇవ్వలేదు. ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే టీడీపీ ప్రభుత్వం ఆ పని చేస్తోంది. విశాఖ నగరంలో అత్యంత ఖరీదైన భూమిని నామమాత్రపు లీజుకు సంస్థకు ధారాదత్తం చేశారు. హార్బర్‌ పార్కులో ఎకరం భూమి మార్కెట్లో రూ.150 కోట్లకు పైనే పలుకుతుండగా, ఏకంగా 13.43 ఎకరాల భూమిని నామమాత్ర లీజ్‌కు ఇచ్చేశారు. దాని విలువ ఏకంగా రూ.2 వేల కోట్లు. దాంతో పాటు స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు, జీఎస్‌టీ రాయితీల రూపంలో మరో రూ.170 కోట్లు ప్రయోజనం కల్పించారు. ఒక కార్పొరేట్‌ సూపర్‌ మార్కెట్‌కు అంత విలువైన ప్రభుత్వం స్థలం, అది కూడా విశాఖ నగరంలో కట్టబెట్టాలన్న నిర్ణయంపై విమర్శలు వెల్లువత్తడంతో ఆ సంస్థ వెనక్కు తగ్గింది. విజయవాడలోని ఆర్టీసీ స్థలాలను లూలూకు ఇవ్వాలనే ఆలోచనను విరమించుకోవాలి, లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమిస్తాం.

Back to Top