న్యూఢిల్లీ: ఏపీలో జరుగుతున్న టీడీపీ దాడులపై రాష్ట్రపతికి వైయస్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది. అనంతరం పార్టీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు వైయస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. వారం రోజులుగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. వక్రీకరించే బుద్ధి చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులకే ఉందంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వి విజయసాయిరెడ్డి, ఆంధ్రరాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ చేస్తున్న దాడులపై ఇవాళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులందరం కలిసి ఢిల్లీలో గౌరవ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రితో పాటు జాతీయ మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశామని వైయస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీనేత వి విజయసాయిరెడ్డి తెలిపారు. మానవత్వం మరిచి మనుషులు ఇలా కూడా చేస్తారా అన్న రీతిలో తెలుగుదేశం పార్టీ గూండాలు చేస్తున్న అకృత్యాలను ప్రధానితో పాటు రాజ్యాంగ సంస్ధల దృష్టికి తీసుకువచ్చామన్నారు. ఆంధ్రరాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న విషయాన్ని ప్రజలందరూ గుర్తిస్తున్నారని.. వారం రోజులగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాడులతో ఆంధ్రరాష్ట్రంలో అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఒకవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలుపై దాడులు జరుగుతుంటే దానికి పూర్తి భిన్నంగా.... తిరిగి మేమేదో వాళ్లపై దాడులు చేస్తున్నట్టు చిత్రీకరిస్తున్న ఘనత ఒక్క చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. ఈ రకంగా వక్రీకరించే బుద్ధి చంద్రబాబునాయుడుకి, ఆయన పార్టీ నాయకులకే ఉందన్న విజయసాయిరెడ్డి... చంద్రబాబు నాయుడు పాలనను ఆటవిక పరిపాలనగా అభివర్ణించారు. చంద్రబాబు పాలనలో చట్టం, స్వేచ్చ, న్యాయం లేదని... అన్యాయం రాజ్యమేలుతుందని ధ్వజమెత్తారు. ప్రమాణస్వీకారానికి ముందే ఈ రకమైన ప్రమాణాలు సృష్టిస్తున్నారంటే..రాబోయే ఐదేళ్లలో బాబు పాలన ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. దాడి జరిగిన తర్వాత గాయాలుపాలయిన వైయస్సార్సీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేస్తామంటే తీసుకోవాడనికే అధికారులు భయపడుతున్న పరిస్థితి.. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనకు అద్దం పడుతోందన్నారు. ప్రమాణాస్వీకారానికి ముందే చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అత్యంత భయానకమైన వాతావరణంలోకి నెట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఎన్నికలు జరిగి, ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడినా… ఎన్నడూ లేని విధంగా, ఎన్నికల తర్వాత హింస చెలరేగడానికి చంద్రబాబు నాయుడే నాందిపలికాడని, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగిన దాడులు, ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, వాళ్ల కుటుంబసభ్యులను, ఆస్తులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ ముఠాలు, గుండాలు ఇవాళ రాష్ట్రంలో స్వైరవిహారం చేస్తున్నాయని, వీటి ద్వారా టీడీపీ ప్రభుత్వం అంటే గూండాగిరీ అని చెప్పకనే చెప్పవచ్చన్నారు. మీరు టీడీపీ కార్యకర్తలా? గూండాలా? అని ప్రశ్నించారు. ప్రమాణ స్వీకారం తర్వాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందన్న కారణంగా… . ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు ఈ హింసను ప్రేరేపించాడని ఆయన స్పష్టం చేశారు. ప్రమాణస్వీకారానికి ముందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడిచేయండని చంద్రబాబునాయుడే ఆదేశించాడని టీడీపీ నాయకులే అంతర్గతంగా చర్చించుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో దాడులని అడ్డుకునే వ్యవస్ధలే కనిపించడం లేదని.. దీనిపై ఇప్పటికే న్యాయ, పోలీసు, రెవెన్యూ వ్యవస్ధలను అప్రోచ్ అయ్యామన్నారు. అయితే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్ధ నీరుగారిపోయి, నిస్తేజంగా మారి పనిచేయడం మానేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. హింసకు గురైన బాధితులు ఆక్రందనలు ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఆలకిస్తే.. అదే ఆక్రందన తన కుటుంబసభ్యులు చేస్తే ఎంత మనస్సు నొప్పిస్తుందో చంద్రబాబునాయుడు అర్ధం చేసుకోవాలని సూచించారు. మన కుటుంబసభ్యులు అదేరకమైన బాధ అనుభవిస్తే.. మనం ఎలా ఫీల్ అవుతామో, ఇతరులు అదే బాధను అనుభవించినప్పుడు కూడా ఒక నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు కూడా ఆదే ఆవేదనతో వారి బాధను తీర్చాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రెండు సందర్భాలలో కూడా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు ఇద్దరి రక్త చరిత్ర… చీకటి అధ్యాయంగా చరిత్రలో నిల్చిపోతుందన్నారు. చంద్రబాబునాయుడు 1999లోనూ, 2014తో పాటు 2024లోనూ బీజేపీ సహకారంవల్లే అధికారంలోకి వచ్చాడని.. ఈ హింస ఇలాగే కొనసాగితే.. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన బీజేపీ కూడా దాడులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. చంద్రబాబునాయుడు ఆరంభించిన ఈ సంప్రదాయం మంచిదా? కాదా ? అన్నది ఆయన విజ్ఞతకే వదిలిపెడుతున్నామన్న విజయసాయిరెడ్డి… దీన్ని ఒక ప్రామాణికంగా నెలకొల్పవద్దని సూచించారు. హింసను ప్రేరేపించడం భావితరాలకు నేర్పించవద్దని కోరారు. ఇలాంటి చర్యలను సభ్యసమాజం హర్షించదన్నారు. తమ చర్యల ద్వారా … అధికారం అంటే బాధ్యత కాదు రౌడీయిజం, గూండాయిజం, ఇదే మా విధానం అని అని తెలుగుదేశం పార్టీ వాళ్లు చెప్పకనే చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నోరు ఎత్తిన బడుగు, బలహీనవర్గాలు, నిరుపేదలపై తెలుగుదేశం పార్టీ చూపిస్తున్న దందాలు, జులాయితనంపై సభ్యసమాజం తలవంచుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉందని, చివరికి విశ్వవిద్యాలయాలనూ వదలడం లేదన్నారు. వైస్ఛాన్స్లర్లు, రిజిస్ట్రార్లుపైనాదాడులు చేస్తూ.. వీసీలలో ఉన్న బీసీలను తరిమి, తరిమి కొడుతున్నారని, ఇదే తెలుగుదేశం పార్టీ పరిపాలనా విధానమని వ్యాఖ్యానించారు. తమకు పడని వారిని వెదికి, వెదికి పట్టుకుని దాడులు చేసి ఆ అమానవీయమైన సంఘటలన్నీ వీడియో రూపంలో షూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పెడుతున్న విషయాన్ని గుర్తు చేసారు. బంగారం లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ తగలబెడుతోందని, మంగళగిరిలో లోకేష్ మనుషులు వైయస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజ్కుమార్పై అమానుషంగా దాడి చేసిన విషయాన్ని గుుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంతో పాటు దేశానికే అవమానమని… ఏపీలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం కూడా తలవంచుకోవాల్సిన పరిస్థితి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న కూటమిలో టీడీపీతో పాటు బీజేపీ, జనసేన కూడా భాగస్వామ్యులేనని.. ఈ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ప్రాణాలను ఏ రకంగా కాపాడుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను ఎలా తెస్తుందో ప్రజలందరూ ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. చివరికి మీడియాను కూడా అణిచివేస్తున్నారని... టీవీ9, ఎన్టీవీ, సాక్షిటీవీని ఎంఎస్ఓ నుంచి తొలగించడం అమానుష చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్న భావన అందిరిలో కలుగుతోందని, వారం రోజులగా జరుగుతున్న హింసాత్మక ఘటనలే ఇందుకు నిదర్శమన్నారు. దాడులకు సంబంధించిన దాదాపు 27 సంఘటనలన్నింటినీ ప్రధానమంత్రితో పాటు, భారత రాష్ట్ర పతి, హోంమంత్రి, జాతీయ మానవహక్కుల కమిషన్ దృష్టికి తీసుకొచ్చామని తెలిపారు. పి. మిధున్ రెడ్డి, లోక్‌సభాపక్ష నేత రాజకీయాల్లో గెలుపోటమలు సహజమని... కానీ గత కొన్ని రోజులగా రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు చాలా దారుణమని వైయస్సార్సీపీ లోక్సభాపక్షనేత పి.మిధున్ రెడ్డి అన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని… కానీ ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తూ, గాయపర్చడం, ఇళ్లు కూల్చవేయడంతో పాటు వ్యాపారాలు కూడా దెబ్బతీయడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజకీయాల్లో ఇలాంటి సాంప్రదాయం మంచిది కాదని.. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా… ఈ విధంగా కార్యకర్తలపై దాడులు చేయడం,ఆస్తుల ధ్వంసం చేయడం వంటివి గతంలో లేవని… రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు గతంలో జరగలేదన్నారు. ఆ తరహా దాడులకు పాల్పడ్డం సరికాదన్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి మేండేట్ ఇచ్చారని.. ఈ నేపధ్యంలో టీడీపీ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో… అవన్నీ పూర్తి చేయాలని సూచించారు. 40శాతం ప్రజలు వైయస్సార్సీపీకి ఓటే వేశారన్న విషయం టీడీపీ గుర్తుపెట్టుకోవాలని.. కేవలం మీకు వచ్చిన 50శాతం పైచిలుకు ప్రజలకే కాకుండా మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలన్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. దాడులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రిగారితో పాటు గౌరవ రాష్ట్ర పతి, మానవహక్కుల కమిషన్ దృష్టికి కూడా తీసుకువెళ్లామన్నారు. వైవి.సుబ్బారెడ్డి, రాజ్యసభసభ్యులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు అనంతరం… వైయస్సార్సీపీ కార్యకర్తల మీద దాడులు.. రాక్షస పాలనను తలపిస్తున్నాయని వైయస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆక్షేపించారు. కౌంటింగ్ రోజు 4వ తేదీ సాయంత్రం నుంచి ఈ రోజు వరకు గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో ఇవే పరిస్ధితులు ఉన్నాయన్నారు. గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబునాయుడు గారు ఇదే విధంగా పాలన సాగించిన విషయాన్ని సుబ్బారెడ్డి గుర్తుచేసారు. అప్పుడూ మూడు పార్టీలు (ఎన్డీయే) పాలన కొనసాగించగా.. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన వారం రోజులకే, ప్రమాణస్వీకారానికి ముందే ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఆస్తులపై దారుణంగా దాడులు చేస్తున్న విషయాన్ని గుర్తు చేసారు. కొన్ని జిల్లాల్లో అయితే పోలీసుల సమక్షంలోనే కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తుంటే.. పోలీసులు చోద్యం చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల గూండాయిజం చెలాయిస్తున్నారని… ముఖ్యంగా గుంటూరు, నరసరావుపేట, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో.. వాళ్ల దాడులకు తట్టుకోలేక ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు ఆత్మహత్య చేసుకోవడమో, చనిపోవడమో జరిగిందన్నారు. ఇది కూడా పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే జరిగిందని.. ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్‌కు పోతే కేసులు బుక్ చేసే పరిస్థితి కూడా లేదన్నారు. అంటే కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసేలోపే ఈ దాడులు జరిగితే.. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం బాధ్యత వహించకుండా ఉండాలని, తెలుగుదేశం గూండాలను రెచ్చగొట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాక్షస పాలన తలపించే పరిస్థితులని తీసుకువచ్చందని ఆయన తేల్చిచెప్పారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకునిరావడానికి గత మూడు రోజులగా ప్రత్యక్షంగా కలిసి చెప్పే ప్రయత్నం చేస్తున్నామని.. అయితే ప్రమాణస్వీకారం వంటి కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల అపాయింట్మెంట్ దొరకలేదని… ఈ నేపధ్యంలోనే ఇవాళ ప్రధానిమంత్రిగారికి, గౌరవ రాష్ట్ర పతిగారికి, జాతీయ మానవహక్కుల సంఘానికి, హోంమంత్రికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు అందించామన్నారు. దీనిపై వీళ్ల దగ్గర కూడా స్పందన రాకపోతే తప్పకుండా న్యాయపోరాటంతో పాటు అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం చేపడతామని సుబ్బారెడ్డి స్పష్టం చేసారు. అదే విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ కార్యకర్తలను కాపాడుకునేందుకు పార్టీ కట్టుబడి ఉంటామన్నారు. రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలమీద దాడులు జరిగాయో వాళ్లందరినీ మా నాయకత్వం తరపున పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో మరలా కొత్తగా ఏర్పడిన ఎన్టీయే ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామ్యంగా ఉన్న నేపధ్యంలో… . ఇప్పుడు జరిగిన దాడులన్నింటికీ వాళ్లు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత కూడా ఉభయసభల్లోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని చెప్పారు. కార్యకర్తలు, నాయకులుపైనే కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నా కూడా పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్ప ఎక్కడా కేసులు బుక్ చేసిన దాఖలాలు లేవని… ఈ సందర్బంగా రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.