దళితులపై దాడులకు నిరసనగా వైయ‌స్ఆర్‌సీపీ సంతకాల సేకరణ 

 అనంతపురంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాభిప్రాయ సేకరణ 

 అనంతపురం : రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాల ఘటనలకు నిరసనగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  చామలూరు రాజగోపాల్ ఆధ్వర్యంలో అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు  అనంత వెంకటరామిరెడ్డి , శింగణమల నియోజకవర్గ సమన్వయకర్త  సాకే శైలజనాథ్ , పార్టీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి , రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్  బీసీ రమేష్ గౌడ్, ఐటీ వింగ్ స్టేట్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ మంజునాథ్ యాద‌వ్‌, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్  నాగరత్నమ్మ , మాజీ మేయర్  వసీం తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 దళితులపై దాడులను అరికట్టాలి: మాజీ మంత్రి డా. సాకే శైలజానాథ్  
 రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచార ఘటనలు రోజురోజుకూ పెరుగుతుండటం అత్యంత ఆందోళనకరమని సాకే శైల‌జానాథ్‌ అన్నారు. దళితుల ప్రాణాలు, ఆస్తులు, గౌరవానికి రక్షణ కల్పించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. బాధితులకు వెంటనే న్యాయం చేయడంతో పాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితులపై జరుగుతున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, బాధితులకు సంఘీభావం ప్రకటించేందుకు ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షిస్తూ దళితులకు పూర్తి భద్రత కల్పించేలా ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని కోరారు. సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. 
 

Back to Top