సింగరాయకొండలో వైయ‌స్ఆర్‌సీపీ బీఎల్‌ఏల శిక్షణ సదస్సు 

 ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన 

ప్ర‌కాశం జిల్లా: కొండపి నియోజకవర్గ పరిధిలోని సింగరాయకొండ వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయంలో సోమవారం బూత్ లెవల్ ఏజెంట్ల (BLA)కు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR)పై శిక్షణ, అవగాహన సదస్సు నిర్వహించారు. అదే సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌ పిలుపు మేరకు  ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాన్ని చేపట్టి కూటమి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి ఆదిమూలపు సురేష్, కొండపి నియోజకవర్గ పరిశీలకుడు షాంశీర్ అలీ బేగ్, సంతనూతలపాడు నియోజకవర్గ పరిశీలకుడు బోట్ల రామారావు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ (SIR) జిల్లా ట్రైనర్ రాజీవ్ తదితరులు హాజరయ్యారు. సదస్సులో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ, బూత్ స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ నిర్మాణ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై బీఎల్‌ఏలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి బూత్ స్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగించాలని సూచించారు.

అనంతరం కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. యువత, మహిళలు, రైతులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ సమావేశానికి ముందు నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండపి నియోజకవర్గంలోని ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, బూత్ కన్వీనర్లు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, వార్డు సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, మహిళా విభాగ ప్రతినిధులు, సోషల్ మీడియా కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top