చిత్తూరు: ప్రజలకు అండగా వైయస్ఆర్‌సీపీ పోరుబాట చేపట్టిందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైయస్ఆర్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైయస్ఆర్‌సీపీ పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పార్టీ నేతలు వైయస్ఆర్‌సీపీ పోరుబాట పోస్టర్‌ను సోమవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. చంద్రబాబు ,పవన్ కళ్యాణలు ఎన్నికలకు ముందు విద్యుత్ భారాన్ని మోపమని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. రెండు విడతలగా 15 వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారం మోపారు. సూపర్ సిక్స్‌లో ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రతి నెలా డైవర్ట్ చేస్తున్నారు. ప్రతి పేదవాడి ఇంటికి 200యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి. అబద్దపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపి, ధరలు పెంచి వారి నడ్డివిరుస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్‌సీపీ ఉంటుంది. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ విధంగా పోరాటాలు చేశారో.. అదే విధంగా మా నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం. మూడు లక్షల కోట్లు రూపాయలు ప్రజలకు నేరుగా అందించిన ఘనత వైయస్ జగన్‌దే. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళన చేపడతాం. డిసెంబర్ 27వ తేదీ విద్యుత్ కార్యాలయాల్లో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై వినతి పత్రాన్ని ఇస్తాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. గుంటూరులో పోస్టర్ ఆవిష్కరణ గుంటూరు నగరంలోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో ‘విద్యుత్ చార్జీల బాదుడుపై వైయస్ఆర్‌సీపీ పోరుబాట’ పేరుతో పోస్టర్‌ను జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, నూరి ఫాతిమాలు ఆవిష్కరించారు. అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఈనెల 27న రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నాం. ఆరు నెలల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. వైయస్ఆర్‌సీపీ పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచారని తాము అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచమని చెప్పారు. ఛార్జీలు తగ్గిస్తామన్నారు. కానీ భారీ మొత్తంగా విద్యుత్ ఛార్జీలు పెంచారు. రెండు నెలల్లో రూ. 15484 కోట్ల భారం మోపారు. కూటమి నేతలకు రాష్ట్ర ప్రజలకు శఠగోపం పెట్టారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం, ఎన్నికలకు ముందు హమీలివ్వడం.. ఆ తర్వాత వాటిని మర్చిపోవడం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు.