విద్యార్థులకు `సూపర్` మోసం 

కూట‌మి పాల‌న‌లో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ జాడే లేదు

యూనివర్సిటీ వీసీల నియామకాల్లో జాప్యం

ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతుల కల్పనల్లో దగా
 
అనంతపురం సభలో విద్యారంగ హామీల గురించి సీఎం మాట్లాడాలి

వైయ‌స్ఆర్‌ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్

తాడేప‌ల్లి:  కూట‌మి ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు సూప‌ర్ సిక్స్ హామీల పేరుతో మోసం చేసింద‌ని వైయ‌స్ఆర్‌ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ మండిప‌డ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి  విద్యా వ్యవస్థ బలహీన దిశగా అడుగులు వేసిందని దాని ఫలితంగా విద్యార్థులకు సూపర్ మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వంకే దక్కుతుందని  ధ్వ‌జ‌మెత్తారు.  ఈ నెల 10వ తేదీ అనంత‌పురం జిల్లాకు వ‌స్తున్న చంద్ర‌బాబుకు వైయ‌స్ఆర్ విద్యార్థి విభాగం నేత‌లు ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక‌ విద్యార్థులకు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఇవ్వ‌కుండా విద్యార్థుల‌కు అన్యాయం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. స‌కాలంలో ఫీజులు చెల్లించ‌క‌పోవ‌డంతో కాలేజీ యాజ‌మాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు  ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతి ఇవ్వలేదని హైకోర్టు హెచ్చరించినా  ఎలాంటి మార్పు లేద‌న్నారు. పేద, మధ్య తరగతి వర్గాల  వారు డాక్టర్లుగా కావాలన్న సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి  వైయ‌స్ జ‌గ‌న్ 17 మెడికల్ కళాశాలలు తీసుకొని వస్తే వాటిని ప్రైవేట్ కి అప్పగించి వైద్యాన్ని ఖరీదుగా మార్చేస్తున్నారని విమర్శించారు.  డబ్బు ఉన్న వారే డాక్టర్లు కావాలని సంకల్పించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి దక్కుతుందని  దుయ్యబట్టారు. విద్యార్థుల సమస్యలు బయటికి రాకుండా చీకటి జీవోను తెచ్చి విద్యార్థులు మోసం చేశారన్నారు.  యూనివర్సిటీల వీసీలను కేటాయించకపోవడం ప్రభుత్వ విద్యను నీరుగార్చడమేనన్నారు.  డిగ్రీ విద్యార్థులకు అడ్మిషన్ లు ఇవ్వకుండా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నాశనానికి కూటమి ప్రభుత్వం పూనుకున్నదని తెలిపారు. విద్యార్థి సమస్యల మీద చంద్రబాబు నాయుడు  అనంతపురం సభలో మాట్లాడాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Back to Top