లోకేష్‌ చేయబోయేది పనికిమాలిన పాదయాత్ర

మొదటి అడుగు వేయకుండా భయంతో టీడీపీ రాజకీయం

పాదయాత్ర అనుమతి అంశంపై టీడీపీ నీతిమాలిన రాజకీయాలు

లోకేష్‌ పాదయాత్రకు కొత్తగా ఎలాంటి షరతులు పెట్టలేదు

షరతులు అంటూ టీడీపీ, ఎల్లో మీడియా అబద్ధపు ప్రచారం

సుప్రీం కోర్టు నిబంధనలకు లోబడే వైయస్‌ జగన్‌ పాదయాత్ర పూర్తిచేశారు

జననేత వైయస్‌ జగన్‌ పాదయాత్రతో లోకేష్‌ యాత్రను పోలికేంటీ..?

మంగళగిరి అని పలకడం రాని లోకేష్‌.. ప్రజల గొంతుక ఎలా అవుతాడు..?

రాజ‌కీయంగా వైయ‌స్ జ‌గ‌న్‌ను ఎదుర్కోలేక పాద‌యాత్ర‌, బ‌స్సు యాత్ర‌లు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం

తాడేపల్లి: మంగళగిరి అని పలకడం రాని లోకేష్‌.. ప్రజల గొంతుక ఎలా అవుతాడు. ఎన్నికల్లో స్వయంగా గెలవలేనివాడు ప్రజల గొంతుక ఎలా అవుతాడో ఆలోచన చేసుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి, ఆ వెన్నుపోటుకు సహకరించిన వ్యక్తి కాళ్లకు నమస్కారం చేసి.. వెన్నుపోటుకు గురైన వ్యక్తి సమాధికి నమస్కరించి పాదయాత్ర చేయడం అంటే ఇంతకంటే నీతిమాలిన పాదయాత్ర మరొకటి ఉండదన్నారు. లోకేష్‌ చేయబోయేది పనికిమాలిన పాదయాత్ర అని, మొదటి అడుగు కూడా వేయకముందే భయపడి పాదయాత్రను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్ర అనుమతి అంశంపై టీడీపీ నీతిమాలిన రాజకీయాలు చేస్తోందన్నారు. లోకేష్‌ పాదయాత్రకు కొత్తగా ఎలాంటి షరతులు పెట్టలేదని, షరతులు అన్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారమే యాత్రలు చేయాలని సూచించారు. సుప్రీం కోర్టు 17 పేజీల్లో ఇచ్చిన నిబంధనలకు లోబడే నాడు వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేశారని, ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని యాత్ర చేశారని గుర్తుచేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సెంట్ర‌ల్ ఆఫీస్ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో క‌లిసి ఎమ్మెల్సీ తలశిల రఘురాం విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తలశిల రఘురాం ఏం మాట్లాడారంటే.. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ పాదయాత్రకు సుప్రీం కోర్టు నిబంధనలకు అనుగుణంగా పాదయాత్ర చేయాలని స్పష్టంగా 17 పేజీల వివరణాత్మక కాపీలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం కూడా లోకేష్‌ పాదయాత్రకు అలాంటి నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చింది. దీన్ని రాజకీయం చేస్తున్నారు. లోకేష్‌ పాదయాత్రను చూసి ప్రభుత్వం భయపడుతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు. దయచేసి ప్రజలంతా ఆలోచన చేయాలి. ఇదంతా టీడీపీ అనుకూల మీడియా సృష్టించే కుట్ర. 

ఒక అనామకుడు లోకేష్‌ పాదయాత్రను, జనహృదయ నేత వైయస్‌ జగన్‌ పాదయాత్రను కంపార్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో ఆర్టికల్స్‌ రాశారు. రాష్ట్రానికి ఒక దిశ, దశ నిర్దేశం చేసే వైయస్‌ జగన్‌ పాదయాత్రతో ఒక పనికిమాలిన వ్యక్తి పాదయాత్రను పోల్చుతూ ఎంత నీచంగా రాశారో ప్రజలంతా గమనించాలి. 

ఆరోజు వైయస్‌ జగన్‌ పాదయాత్ర రాత్రిపూట ఎక్కడా చేయలేదు. పట్టణాల్లో ఒకటి రెండు చోట్ల బహిరంగలు పెట్టాం తప్ప.. రాత్రిళ్లు పాదయాత్ర చేయలేదు. చీకటిపడక ముందే పాదయాత్ర ముగించాలని వైయస్‌ జగన్‌ స్పష్టంగా ఆదేశించారు. ఎందుకంటే.. చీకట్లో ఏదైనా అనుకోని సంఘటన జరిగి ఇబ్బంది జరిగితే ప్రజలు ఎక్కడ ఇబ్బందిపడతారోనని గ్రహించే చీకటి పడ్డాక పాదయాత్ర వద్దని వైయస్‌ జగన్‌ స్పష్టంగా మమ్మల్ని ఆదేశించారు. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.. వలంటీర్లను పెట్టుకున్నాం. నిబంధనలకు లోబడే పాదయాత్ర పూర్తిచేశాం. 

లోకేష్‌ మొదటి అడుగు వేయకముందే భయపడి పాదయాత్రను టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా సగంలో ముగించడం తెలుగుదేశం పార్టీ అలవాటు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాదుడే బాదుడు మొదలుపెట్టారు.. కానీ, ప్రజలు టీడీపీ నేతలను బాదే పరిస్థితి వచ్చేసరికి దాన్ని పూర్తిచేయలేదు. తరువాత ఇదేం ఖర్మ అని మొదలుపెట్టారు.. నిజంగా టీడీపీ ఖర్మ కాలుతుందని అదీ పూర్తిచేయలేదు. అమరావతి నుంచి అరసవెల్లి పాదయాత్ర అన్నారు.. కోర్టు మొట్టికాయలు వేయడంతో దాన్ని నిలిపివేశారు. 

ఈరోజున లోకేష్‌ పాదయాత్రకు ఎక్కడా లేని ప్రచారం తీసుకురావడం కోసం ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింద‌ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిని కాదని కొడుకు లోకేష్‌ పాదయాత్ర చేస్తున్నాడు. మరోపక్క పవన్‌ బస్సు యాత్ర. ఇవన్నీ రాజకీయంగా సీఎం వైయస్‌ జగన్‌ను ఎదుర్కోలేక చేస్తున్న పనులుగా మేం భావిస్తున్నాం. నిబంధనలకు లోబడి పాదయాత్ర, బస్సు యాత్రలు చేసుకోండి. మీ యాత్రలకు వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు ఎవ్వరూ భయపడరు. 

ప్రజలకు వైయస్‌ జగన్‌ ప్రభుత్వం చేసిన మేలు.. గతంలో మరే ప్రభుత్వం చేయలేదు. గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రజలు ఎదురొచ్చి గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్‌లు, ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు చూపిస్తారు. ఇంటింటికీ అందుతున్న సంక్షేమ పథకాల వివరాలు అన్నీ టీడీపీ నేతలకు తెలియజేస్తారు. సచివాలయం, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కూడా టీడీపీ కళ్లకు కనిపిస్తాయి.. వారి కళ్లు తెరుచుకుంటాయని స్పష్టంగా చెబుతున్నాం’’ అని ఎమ్మెల్సీ తలశిల రఘురాం అన్నారు.  

Back to Top