13న వైయ‌స్ఆర్ పురస్కారాల ప్రదానోత్సవం

ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్‌ 

 విజయవాడ : విజయవాడలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ నెల 13న దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జీవిత సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్‌) జి.వి.డి.కృష్ణమోహన్‌ కృష్ణా జిల్లా అధికారులతో కలిసి సభ ఏర్పాట్లను  పరిశీలించారు. వేదిక, ప్రత్యేక ర్యాంపు, పురస్కార గ్రహీతలకు ప్రత్యేక సీటింగ్‌ ఏర్పాటు.. తదితర విషయాలపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా కృష్ణమోహన్‌ మాట్లాడుతూ వైయ‌స్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు రూ.10 లక్షల నగదు, జ్ఞాపిక.. వైయ‌స్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు రూ.5 లక్షల నగదు, జ్ఞాపికను అందిస్తారన్నారు. ఆరు కేటగిరీల్లో పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఏర్పాట్ల పరిశీలనలో టూరిజం సీఈఓ విజయకృష్ణన్, కలెక్టర్‌ జె.నివాస్, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ వి.ప్రసన్న వెంకటేష్, జేసీ కె.మోహన్‌కుమార్, డీఆర్‌ఓ ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

Back to Top