కూటమి ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటం

ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతాం

రబీ ప్రారంభమై నెల దాటినా విత్తనాలు ఇవ్వలేరా?

గతంలో 27 వేల క్వింటాళ్లు.. ఇప్పుడు 14 వేలేనా?

ఈ–క్రాప్‌ నమోదులోనూ ఇంత నిర్లక్ష్యమా?

హెచ్‌ఎల్‌సీ, హంద్రీనీవా నీటి నిర్వహణలోనూ వైఫల్యం

ప్రాజెక్టుల నుంచి ఏటి పాలవుతున్న నీరు

ప్రత్యామ్నాయ విత్తనాలిస్తామన్న మంత్రి కేశవ్‌ హామీ ఏమైంది?

గతంలో టామోటా మాత్రమే.. ఇప్పుడు చీనీ, అరటి, మామిడి పంటలూ రోడ్ల పాటు

వలసలు, రైతుల ఆత్మహత్యల పరిస్థితి తేవద్దు

సొంత ఆదాయమే కాదు.. రైతుల గురించి పట్టించుకోండి

వైయస్ఆర్ సీపీఅనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి

అనంతపురం :కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రైతాంగ సమస్యలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యక్ష పోరుకు సిద్ధమవుతున్నట్లు వైయస్ఆర్ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం వైయస్ఆర్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీ సీజన్‌ ప్రారంభమై నెల గడిచినా రైతులకు సబ్సిడీతో పప్పుశనగ విత్తనాలు పంపిణీ చేయలేని పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విత్తనాలు, ఎరువులు కూడా సకాలంలో అందడం లేదని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చాక రెండు ఖరీఫ్, ఒక రబీ సీజన్‌ ముగిసిందని.. ఇప్పుడు మరో రబీ సీజన్‌ ప్రారంభమైందన్నారు. ప్రతి సీజన్‌లోనూ రైతులు నిరాదరణకు గురవుతున్నారని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు వర్షాభావంతో దెబ్బతిన్నాయన్నారు. జిల్లాలో ఖరీఫ్‌లో వేరుశనగ సాధారణ సాగు 4.50 లక్షల ఎకరాలు ఉంటే 2.25 లక్షల ఎకరాల్లోనే సాగు చేసిన పరిస్థితి ఉందని తెలిపారు. ఇప్పుడు పంటకు తెగుళ్లు వ్యాపిస్తున్నాయని, ఫలితంగా దిగుబడులు కూడా రాలేని పరిస్థితి ఉందన్నారు. 

జిల్లాలో రబీ సీజన్‌లో పప్పుశనగ సాగు 70 వేల హెక్టార్లలో ఉంటుందని, సీజన్‌ ప్రారంభమై నెల రోజులు అవుతున్నా ఇంకా విత్తనాలు పంపిణీ చేయలేదన్నారు. తీరిగ్గా ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ ప్రారంభించామని అధికారులు ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 40 శాతం సబ్సిడీతో పప్పుశనగ విత్తనాలు అందిస్తే.. నేడు 25 శాతానికి కుదించారని తెలిపారు. గత ఏడాది జిల్లాకు 27 వేల క్వింటాళ్ల పప్పుశనగ కేటాయిస్తే ఈ ఏడాది కేవలం 14 వేల క్వింటాళ్లు మాత్రమే కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ఒక్క ప్రజాప్రతినిధి కూడా అడిగిన పాపానపోలేదన్నారు. ఇటీవల నిర్వహించిన డీఆర్‌సీ సమావేశంలో ప్రత్యామ్నాయ విత్తనాలు పంపిణీ చేస్తామని సాక్షాత్తూ మంత్రి పయ్యావుల కేశవ్‌ చెప్పినా ఇంత వరకు అతీగతీ లేదన్నారు. గిట్టుబాటు ధరలు లేకపోతే గతంతో టమోటా పంటను మాత్రమే రైతులు పారేసిన ఘటనలు చూశామని, కానీ నేడు అరటి, చీనీ, మామిడి పంటలను కూడా రోడ్డుపై పడేస్తున్నారన్నారు. మొక్కజొన్న పంట సాగు సమయంలో ధర ఉన్నా చేతికొచ్చిన సమయంలో ఉండడం లేదన్నారు. ఇటీవలి వరకు క్వింటా మొక్కజొన్న రూ.2800 ఉంటే ఇప్పుడు రూ.1800కి పడిపోయిందన్నారు. ఓ వైపు దిగుబడి రాక.. మరోవైపు గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. గిట్టుబాటు ధర కోసం అధికార పార్టీకి చెందిన రాయదుర్గం ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాసే పరిస్థితి ఉందంటో ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? అని అన్నారు. ప్రజాప్రతినిధులు తమ ఆదాయం కోసం చేసే ఆలోచన రైతుల గురించి చేయడం లేదన్నారు. అధికారులు కూడా ప్రజాప్రతినిధుల మెప్పుపొందడం కోసం మాత్రమే పని చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదిన్నరగా రైతుల పరిస్థితి చూస్తుంటే గతంలోలా వలసలు, రైతుల బలవన్మరణాలు ఎక్కడ జరుగుతాయోనన్న ఆందోళన కలుగుతోందని ఆవేదన చెందారు. వైయస్ఆర్ సీపీ హయాంలో పంట నష్టపోతే ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ వచ్చేదని.. నేడు ఆ పరిస్థితి లేదన్నారు. 

గత ఏడాదికి సంబంధించి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇప్పటికీ చెల్లించలేదని అన్నారు. వైఎస్‌ జగన్‌ హయాంలో ఉచిత పంటల బీమా అందేదని, చంద్రబాబు వచ్చాక రైతులతో ప్రీమియం కట్టించుకుంటున్నారని తెలిపారు. జిల్లాకు హెచ్‌ఎల్‌సీ, హంద్రీనీవా నుంచి నీరు వస్తున్నా నీటి నిర్వహణలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. వాటర్‌ మేనేజ్‌మెంట్‌లో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలిపారు. దీని ఫలితంగానే చాగళ్లు, పీఏబీఆర్, ఎంపీఆర్‌ నుంచి నీరు ఏటిపాలు అవుతున్నాయన్నారు. ఇటీవల ఐబీఏ సమావేశం నిర్వహిస్తే కనీసం ఎన్ని రోజులు నీళ్లు వస్తాయి? ఏ పంటలు వేసుకోవాలో కూడా చెప్పలేదన్నారు. కేవలం గత ప్రభుత్వాన్ని విమర్శించడం కోసమే సమావేశాలు పరిమితం అవుతున్నాయని ధ్వజమెత్తారు. హంద్రీనీవా మొదటి దశ విస్తరణ, రెండో దశ లైనింగ్‌ కోసం కోట్లు ఖర్చు చేశామని చెప్పుకుంటున్నారని.. ఇప్పటి వరకు ఎంత నీరు వచ్చిందో తెలియదన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, రైతాంగ సమస్యలపై వైయ‌స్‌ఆర్‌సీపీ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలియజేశారు.

Back to Top