ఈ ప్రభుత్వ వచ్చాక రైతుకు భరోసా లేకుండా చేశారు

చంద్రబాబు సృష్టించిన మరో విపత్తు ఇది

వైయస్‌ జగన్‌ ఫైర్‌

మొంథా తుపాను నేపథ్యంలో పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌.

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో పక్కాగా ఉచిత పంటల బీమా

85 లక్షల రైతులకు, 70 లక్షల ఎకరాల్లో ఉచిత ఇన్సూరెన్స్‌

రైతుల తరపున ప్రభుత్వమే బీమా ప్రీమియమ్‌ చెల్లింపు

ఆ 5 ఏళ్లలో 54.55 లక్షల రైతులకు రూ.7802 కోట్ల పరిహారం 

ఇప్పుడు కేవలం 19 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా

రుణాలు తీసుకున్న 19 లక్షల రైతులకే బ్యాంకులు బీమా

మరి మిగిలిన రైతులందరి పరిస్థితి ఏమిటి? 

రెండేళ్లుగా ఏ సీజన్‌లోనూ ప్రీమియమ్‌ కట్టని ప్రభుత్వం

దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి

అందుకే ఇది కచ్చితంగా ‘మ్యాన్‌ మేడ్‌ కలామిటీ’

వైయస్‌ జగన్‌  స్పష్టీకరణ 

తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు అండగా నిలవాలి

పంట నష్టం అంచనాల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగొద్దు

ప్రభుత్వం తప్పిదానికి ప్రయత్నిస్తే కచ్చితంగా అడ్డుకోవాలి

రైతులు, ప్రజలకు తగిన న్యాయం జరిగేలా చొరవ చూపాలి

పార్టీ నేతలకు శ్రీ వైయస్‌ జగన్‌ పిలుపు 

టీడీపీ కూటమి ప్రభుత్వంలో దారుణంగా వ్యవసాయం 

రైతులకు ప్రభుత్వం నుంచి ఏ ఒక్క పథకమూ రావడం లేదు

ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు. అన్నదాత సుఖీభవలోనూ మోసం

ఈ–క్రాప్‌కు మంగళం. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం

పంటలకు గిట్టుబాటు ధర లేదు. తీవ్ర కష్టనష్టాల్లో రైతాంగం

అయినా పట్టించుకోని టీడీపీ కూటమి ప్రభుత్వం

గుర్తు చేసిన శ్రీ వైయస్‌ జగన్‌ 

ఈ 16 నెలల్లో ఎప్పుడూ రైతులకు ఏదో ఒక కష్టం 

ఏ ఒక్క సందర్భంలోనూ రైతులను ఆదుకోని ప్రభుత్వం

ప్రభుత్వం సమర్థంగా పని చేస్తే, ప్రాణహాని ఉండదు

మోంథా తుపాన్‌ సమయంలో ప్రభుత్వ ప్రచారం పీక్‌

కానీ క్షేత్రస్థాయిలో సహాయ కార్యక్రమాలు పూర్తిగా వీక్‌

తేల్చి చెప్పిన శ్రీ వైయస్‌ జగన్‌

కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం

ఆ దిశలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

ఉద్యమంలా సాగుతున్న సంతకాల సేకరణ కార్యక్రమం

అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీల నిర్వహణ

నవంబరు 11న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ర్యాలీలు

ఆ కార్యక్రమంలో కూడా చురుగ్గా పాల్గొనాలి

పార్టీ నేతలకు శ్రీ వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం 

తాడేపల్లి:   మొంథా తుపాను వల్ల సంభవించిన నష్టం, తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్లీ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన, క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆరా తీశారు. తుపాన్‌ సమయంలో పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలబడడాన్ని ప్రశంసించిన ఆయన, ఇప్పుడు పంట నష్టం అంచనాల్లో ఎక్కడా ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని నిర్దేశించారు. పంట నష్టం అంచనాల్లో ప్రభుత్వం ఏ తప్పిదానికి ప్రయత్నించినా, గట్టిగా ప్రశ్నించాలని, ఆ తప్పిదాన్ని సవరించుకునేలా చొరవ చూపాలని ఆయన ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై పార్టీ నాయకులకు శ్రీ వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు.
పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్‌లో శ్రీ వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..:

● మీ అందరికీ అభినందనలు:

    మొంథా తుపాన్‌ వచ్చినప్పటి నుంచి, ప్రజలతో మమేకం అవుతూ మీమీ ప్రాంతాల్లో అసెంబ్లీ కోఆర్డినేటర్లు చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. పార్టీ పిలుపు మేరకు మీరంతా చాలా చక్కగా, చురుగ్గా పని చేస్తున్నారు. అందుకు మీ అందరికీ నా అభినందనలు. తెలియజేస్తున్నాను. రైతులు, ప్రజలకు తోడుగా ఈ తుపాన్‌లో నిలబడ్డారు. అందుకు మీ అందరికీ అభినందనలు. 

● రైతులకు తోడుగా నిలబడాలి:

    మనందరం ఈ మధ్యకాలంలో చూసిన మోంథా తుపాన్‌. దాని బీభత్సం ఎక్కువే ఉంది. తుపాన్‌ తీవ్రత తగ్గినా, రైతులపై చాలా ప్రభావం చూపింది. పంటలకు చాలా నష్టం జరిగింది. పంట పొట్టకొచ్చిన సమయంలో భారీ వర్షాలకు అవి నేలకొరిగాయి. దీంతో దిగుబడి దారుణంగా పడిపోయే పరిస్థితి ఏర్పడింది.
    
శ్రీకాకుళం నుంచి నెల్లూరు, అక్కణ్నుంచి రాయలసీమలో కర్నూలు, కడప, అన్నమయ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో కూడా మొంథా తుపాన్‌ ప్రభావం చూపింది. 25 జిల్లాలు, 396 మండలాలు, 3320 గ్రామాల పరిధిలో తుపాన్‌ ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు తోడుగా నిలబడాల్సి ఉంది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలపై మొంథా తుపాన్‌ ప్రభావం చూపింది. దాంట్లో 11 లక్షల ఎకరాల్లో వరి పంట ఉంది. 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2 లక్షల ఎకరాల మొక్కజొన్న, మరో 1.9 లక్షల ఎకరాల ఉద్యాన పంటల మీద మొంథా తుపాన్‌ ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో పంట నష్టం అంచనాల్లో రైతులకు తోడుగా నిలబడాల్సి ఉంది. అలా రైతులకు అండగా ఉండి పార్టీ నాయకులంతా పని చేయాలి.

● ఇది ‘మ్యాన్‌ మేడ్‌ కలామిటీ’:

    చంద్రబాబు హయాంలో నష్టపోయిన రైతుల పరిస్థితి చూడాల్సి ఉంది. గతంలో ఎప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఈ–క్రాప్‌ వ్యవస్థ పక్కాగా ఉండేది. ఆర్బీకేలు సమర్థంగా పని చేసేవి. వాటిలో అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్స్‌ ఉండి సేవలందించేవారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు కలిసి పని చేయడం వల్ల ప్రతి రైతుకూ ఒక భరోసా ఉండేది.
    నాడు దాదాపు 85 లక్షల రైతులకు దాదాపు 70 లక్షల ఎకరాల్లో ఉచిత పంటల బీమా అమలు చేశాం. కానీ, ఈరోజు కేవలం 19 లక్షల ఎకరాలకు మాత్రమే, 19 లక్షల రైతులకు మాత్రమే పంటల బీమా ఉంది. ఎవరైతే బ్యాంకులో రుణం తీసుకున్నారో వారికే పంటల బీమా సదుపాయం ఉంది. బ్యాంకర్లు రుణాలు ఇచ్చినప్పుడు, ఇన్సూరెన్స్‌ కట్టించారు కాబట్టి, కేవలం 19 లక్షల రైతులకు మాత్రమే బీమా సదుపాయం ఉంది. మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలి? 85 లక్షల రైతులు, 70 లక్షల ఎకరాలకు ఉచిత బీమా ఎక్కడ? ఇప్పుడు కేవలం 19 లక్షల రైతులకు, 19 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా ఎక్కడ? దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
    గత ఏడాది ఖరీఫ్, రబీతో పాటు, ఈ ఏడాది కూడా ఏ సీజన్‌లోనూ ఏ పంటకూ ప్రభుత్వం బీమా ప్రీమియమ్‌ కట్టలేదు. కాబట్టి ఇది కచ్చితంగా మ్యాన్‌ మేడ్‌ కలామిటీ (మానవ తప్పిదం వల్ల సంభవించిన నష్టం). కాబట్టి మనం పార్టీపరంగా వారికి అండగా నిలబడాలి. 

● ఇప్పుడు ఇన్‌పుట్‌ సబ్సిడీ జీరో:

    ఇంకా ఈ ప్రభుత్వంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా లేదు. గత ఏడాది జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ 16 నెలల్లో ఎప్పుడూ రైతులకు ఏదో ఒక సమస్య. అయినా వారిని ఏ విధంగానూ ఈ ప్రభుత్వం ఆదుకోలేదు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. చివరకు పంటల ఈ–క్రాప్‌ కూడా చేయకుండా రైతులను నిర్లక్ష్యం చేశారు. అయినా వారి లెక్క ప్రకారం దాదాపు 5.5 లక్షల మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ రూపేణ దాదాపు రూ.600 కోట్లు సబ్సిడీ ఇవ్వాలి. అది కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు.
    మిర్చి క్వింటాల్‌ రూ.11,781 కి కొంటామన్నారు. కానీ, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. పొగాకు కొనుగోలు చేస్తామన్నారు. కానీ, ఎక్కడా ఆ పని చేయలేదు. మామిడి కిలో రూ.12 కి కొంటామన్నారు. ఒక రైతుకు మేలు చేయలేదు. ఉల్లి క్వింటాల్‌కు రూ.1200కి కొంటామన్నారు. కానీ, అక్కడా చేతులెత్తేశారు. ఆ తర్వాత హెక్టార్‌కు రూ.50 వేల చొప్పున పరిహాకం ఇస్తామని చెప్పి, అది కూడా ఇవ్వకుండా మోసం చేశారు.

 

● రైతుల కష్టాలకు చంద్రబాబు బాధ్యుడు:

    ఇలా అన్ని రకాలుగా నష్టాలే. ఈ–క్రాప్‌ లేదు. దాన్ని నీరు గార్చారు. ఆర్బీకేలు నిర్వీర్యం చేశారు. ఉచిత పంటల బీమా లేదు. ఇన్‌పుట్‌ సబ్పిడీ లేదు. దాంతో రైతులు చాలా నష్టపోయారు. ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. అందుకే ఇదంతా మ్యాన్‌మేడ్‌ కలామిటీ. 
    అదే గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో 54.55 లక్షల రైతులకు తోడుగా నిలబడుతూ రూ.7802 కోట్లతో ఉచిత పంటల బీమా పరిహారం ఇప్పించాం. ప్రతి ఎకరాకు ఈ–క్రాప్‌ చేసి, అప్పుడు ప్రభుత్వమే బీమా ప్రీమియమ్‌ కట్టింది. రైతులపై ఎలాంటి భారం వేయలేదు. కానీ, ఈ ప్రభుత్వంలో అన్నీ మానవ తప్పిదాలే. అవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు తుపాన్‌ రూపంలోనూ చాలా నష్టం వస్తోంది.
    అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చి, చంద్రబాబు మోసం చేశాడు. అందుకే ఈరోజు రైతులకు జరుగుతున్న నష్టం, వారి కష్టాలకు చంద్రబాబు బాధ్యుడు. ఆయన తప్పిదాల వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు.

● అది పక్కాగా జరిగేలా చూడాలి:

    అందుకే ఇప్పుడు రైతులకు మనం తోడుగా నిలబడాలి. అంటే పంట నష్టం అంచనాలో మనం రైతులకు తోడుగా నిలబడాలి. నష్టం అంచనా పక్కాగా జరిగేలా చూడాలి. ఏ ఒక్క రైతుకు నష్టం కలగకుండా, వారి తరపున నిలబడాలి. మాట్లాడాలి. అలా వారి తరపున మనం పని చేయాలి. ప్రజలు కానీ, రైతులు కానీ, పార్టీకి సంబంధించిన వారు కానీ.. ఎవరూ కూడా ఎక్కడా మిస్‌ కాకుండా, ప్రభుత్వం కావాలని తప్పు చేయాలని చూస్తే.. వాటిని గట్టిగా ప్రశ్నించాలి. అలా రైతులకు మంచి జరిగేలా చూడాల్సి ఉంది. నష్టం అంచనాలో ఎక్కడా, ఏ లోపం లేకుండా చూడాలి. ఆ దిశలో పూర్తి చొరవ చూపాలి.

Image

● ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ:

    ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం కొనసాగుతోంది. అందులో భాగంగా కోటి సంతకాల సేకరణ చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాల్లో నవంబరు 11న ర్యాలీలు నిర్వహించాలి. వాస్తవానికి ఈ కార్యక్రమం అక్టోబరు 28న అనుకున్నా, మొంథా తుపాన్‌ వల్ల వాయిదా వేయడం జరిగింది.
    ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువ అవుతుంది. మరోవైపు ఆ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయి. దాని వల్ల ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతాయి. కాబట్టి, అది కూడా మనకు చాలా ముఖ్యమైన కార్యక్రమం అని శ్రీ వైయస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేశారు.
    పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, వైవీ సుబ్బారెడ్డి, కారుమూరి వెంకటనాగేశ్వరరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు, పార్టీ జిల్లాల అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, మజ్జి శ్రీనివాసరావు (చిన్నశీను), శతృచర్ల పరీక్షిత్‌రాజు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, కెకె రాజు, గుడివాడ అమర్‌నాథ్, దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ముదునూరి ప్రసాదరాజు, దూలం నాగేశ్వరరావు, పేర్ని వెంకట్రామయ్య (నాని), దేవినేని అవినాష్, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మేరుగు నాగార్జున, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కెవి ఉషశ్రీ చరణ్, పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, ఆకెపాటి అమర్‌నాథ్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

Image
    కాగా, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్‌ సుధాకర్‌బాబు, అబ్బయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్‌రెడ్డితో పాటు, పార్టీ నాయకులు ఆలూరు సాంబశివారెడ్డి, చల్లా మధుసూదన్‌ రెడ్డి, కడప మాజీ మేయర్‌ సురేష్‌ తదితరులు కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.

Image

Back to Top