ఊరూరా వైయ‌స్ఆర్‌ జయంతి వేడుకలు..

అమరావతి : దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం మహానేత 70వ జయంతిని పురస్కరించుకుని నాయకులు, అభిమానులు పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. ఉదయం రాజన్న తనయుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైయ‌స్ఆర్‌  ఘాట్‌ వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. అలాగే రైతు బాంధవుడు,  వైయ‌స్ఆర్‌ జయంతి సందర్భంగా  రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం నిర్వహించనుంది.

మరోవైపు ప్రతి పల్లెలోను మహానేతను స్మరించుకుంటూ ప్రజలు, అభిమానులు, నాయకులు ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా తమకు జరిగిన మేలును తలచుకుంటున్నారు. తమ గుండెల్లో పదిలంగా నిలిచిపోయిన ఆ మహానేత పుట్టిన రోజు తమకు పండుగ రోజేనని చెబుతున్నారు.

వైయ‌స్ఆర్‌  జయంతి వేడుకలు...

నల్గొండ : జిల్లాలోని నకిరేకల్‌ నియోజవర్గంలో మహానేత వైయ‌స్ఆర్‌  జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహానేత విగ్రహానికి  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇరుగు సునీల్‌ పూలమాల వేసి నివాళి అర్పించారు. మహానేత ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఆయన గుర్తుచేశారు.

అనంతపురం : జిల్లాలోని గుంతకల్లు మండలం కసారపురంలో దివంగత మహానేత వైయ‌స్ఆర్‌  జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి వైయ‌స్ఆర్‌  పెన్షన్‌ కానుకను ప్రారంభించారు. 

ప్రకాశం : జిల్లాలోని కందుకూరు వైయ‌స్ఆర్‌ సీపీ కార్యాలయంలో మహానేత వైయ‌స్ఆర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మానుగుంట మహిధర్‌రెడ్డి, ఇతర నాయకులు మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని రామతీర్థం సమ్మర్ స్టోరేజ్ పక్కన ఉన్న వరాల సాయినగర్లో పేదలకు గతంలో ఇచ్చిన నివేశిత పట్టాలకు మహిధర్‌రెడ్డి స్థలాలు పంపిణీ చేశారు.

నెల్లూరు : మహానేతవైయ‌స్ఆర్‌  జయంతిని పురస్కరించుకుని గుడూరు మండలం గొల్లపల్లిలో వైయ‌స్ఆర్‌ సీపీ కేంద్ర కమిటీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌ సీపీ మండల కన్వీనర్‌ మల్లు విజయ్‌కుమార్‌రెడ్డి, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. 

కర్నూలు : దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను శరీన్‌ నగర్‌లో ఘనంగా నిర్వహించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి  మహానేత విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు.

ప్రకాశం : మహానేత  వైయ‌స్ఆర్‌ జయంతి వేడుకలను దర్శిలోని గడియార స్తంభం సెంటర్‌, రెడ్డి కాంప్లెక్స్‌లలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విజయవాడ : వైయ‌స్ఆర్‌ సీసీ రాష్ట్ర కార్యాలయంలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైయ‌స్ఆర్‌  విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం అభిమానుల సమక్షంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నాయకులు గౌతంరెడ్డి, సోమినాయుడు, సుజాత, రత్నబిందు, జానారెడ్డి, తోట శ్రీనివాస్‌, కాలే పుల్లారావు కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా  వైయ‌స్ఆర్‌  సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. వైయ‌స్ఆర్‌  ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైయ‌స్ఆర్‌  భౌతికంగా మన మధ్య లేకపోయిన ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు. ప్రజల సంక్షేమం గురించి ఆలోచించిన నాయకుడు వైయ‌స్ఆర్‌  అని గుర్తుచేశారు.

తిరుపతి : నగరంలో మహానేత వైయ‌స్ఆర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆటో నగర్‌లో పింఛన్లు పంపిణీ చేశారు.

ప్రకాశం : జిల్లాలోని కొండేపి నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌ సీపీ ఇంచార్జ్‌ డాక్టర్‌ వెంకయ్య ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడులకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు.

విశాఖ : మహానేత వైయ‌స్ఆర్‌  70వ జయంతి వేడుకలను గాజువాక పెదగంట్యాడ, కాకతీయ జంక్షన్‌లలో ఘనంగా నిర్వహించారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు ఘనంగా సన్మానం చేశారు. పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో దొడ్డి రమణ, మంత్రి రాజశేర్‌, పరదేశి, వెంపాడ అప్పారావు, తుంపాల తాతారావు, మంజుల, పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 

చిత్తూరు : దివంగత మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే బాబు మొగిలీస్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్‌ కుమార్‌రాజా, నాయకులు సురేశ్‌ రెడ్డి, పురుషోత్తం, ప్రవీణ్‌రెడ్డి, దొరస్వామి, పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సిద్దిపేట :దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా వైయ‌స్ఆర్‌ సీసీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌ గుప్తా కొమురవెల్లి మల్లికార్జునస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలోవైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహానేత పేద ప్రజలకు చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు.
 
 

Back to Top