ఇంజినీరింగ్‌ కళాశాలపై వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి పేరు తొలగింపు 

కళాశాలపై ఉన్న డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును తొలగిస్తున్న దృశ్యం

ఏఎన్‌యూ తాత్కాలిక పాలకుల అత్యుత్సాహం 

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతల వినతితో 24 గంటల్లో తొలగించిన వైనం  

విస్మయం వ్యక్తం చేస్తున్న మేధావులు, విద్యార్థులు

ఏఎన్‌యూ (పెదకాకాని): ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తాత్కాలిక పాలకులు అనుసరిస్తున్న విధానాలు విద్యావేత్తలు, మేధావులను విస్మయానికి గురిచేస్తున్నాయి. అధికార పార్టీ నేతల ప్రాపకం కోసం నాడు వర్సిటీలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించిన పాలకులు.. నేడు ఇంజినీరింగ్‌ కళాశాలపై ఉన్న మహానేత పేరును తొలగించి వివాదాలకు తెరలేపారు. వివరాల్లోకెళ్తే.. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలగా  కొనసాగుతున్న పేరును మార్చాలని టీడీపీ విద్యార్థి విభాగమైన టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు బుధవారం వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావును కోరారు.

 వారు కోరిన 24 గంటల్లోనే గురువారం క్రేన్‌ను రప్పించి ఇంజినీరింగ్‌ కళాశాలపై ఉన్న డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును తొలగించడం వర్సిటీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కళాశాలకు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు తొలిగించడం దుర్మార్గ చర్య అని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రవిచంద్ర మండిపడ్డారు. వర్సిటీల్లో లోకేశ్‌ రెడ్‌బుక్‌ అరాచకం రాజ్యమేలుతోందని విమర్శించారు. ఏఎన్‌యూ వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి సంఘం గౌరవ అధ్యక్షుడు పంతగాని రమేష్‌, అధ్యక్షుడు ఆసిఫ్, ఉపాధ్యక్షుడు పంతగాని చంద్‌ తదితరులు ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు.

 
ముఖ్యమంత్రిగా ఉండి ప్రమాదవశాత్తు మరణించిన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలకు ఏర్పాటు చేయాలనే నిర్ణయం 2009లో అప్పటి పాలకమండలి, అకడమిక్‌ సెనేట్‌ ముక్తకంఠంతో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయని, నేటి పాలకులు డాక్టర్ వైయ‌స్ఆర్‌ పేరు తొలగించటం బాధాకరమని వర్సిటీ మాజీ వీసీ ఆచార్య పి.రాజశేఖర్‌ అన్నారు.

Back to Top