రేపు విశాఖపట్నానికి వైయస్ జగన్ 

 బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు పరామర్శ 

 ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా కలవనున్న వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు 

తాడేప‌ల్లి: బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం (14.07.2026) విశాఖపట్నం పర్యటనకు వెళ్లనున్నారు. బాధిత కుటుంబాలను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. అదే ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు.

తాడేపల్లిలో విడుదల చేసిన పర్యటన వివరాల ప్రకారం, వైయస్ జగన్ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అనంతరం జబ్బార్‌ తోటలో బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి, వారికి ధైర్యం చెబుతారు. తర్వాత ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన కారి చిన్నాను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు. కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.

బోటు ప్రమాదం జరిగిన నాటి నుంచి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని పార్టీ నాయకులను ఇప్పటికే ఆదేశించిన వైయస్ జగన్, ఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా విశాఖకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా కల్పించనున్నారు.
 

Back to Top