తాడేపల్లి: మన వ్యక్తిత్వం. విలువలు, విశ్వసనీయతే మనకు శ్రీరామ రక్ష. మన వ్యక్తిత్వమే మనల్ని ముందుకు నడిస్తుందని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.రేపల్లె నియోజకవర్గంలో అనుకోని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. కష్టాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు. చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది, ఇది సృష్టి సహజం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో రేపల్లె నియోజకవర్గ స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 5ఏళ్లు గర్వంగా తలెత్తుకునేలా: 2019 నుంచి 2024 వరకు మనం గర్వంగా తలెత్తుకునేలా పరిపాలన చేశాం. నేను వైయస్ఆర్‌సీపీ కార్యకర్తను అని ప్రతి కార్యకర్త, ప్రతి ఇంటికి వెళ్లి గర్వంగా చెప్పుకునేలా మన పాలన సాగింది. అన్ని పనులు మనం ప్రజలకు చేశాం. మ్యానిఫెస్టో అనేది చెత్తబుట్టలో వేయదగింది కాదని, అది అత్యంత పవిత్రమైనదని ప్రపంచానికి తొలిసారిగా మన పార్టీ మాత్రమే చెప్పింది. ప్రజలకు ఇచ్చిన మాటలను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పబోమని వాటిని నెరవేరుస్తూ అడుగులు వేశాం. మొట్టమొదటి బడ్జెట్‌లోనే సంక్షేమ క్యాలెండర్ ప్రకటించాం. ప్రతి నెలా క్రమం తప్పకుండా బటన్ నొక్కి పారదర్శకంగా పథకాలన్నీ అమలు చేశాం. మన ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరింది. మనకు వేటు వేశాడా, లేదా, అన్నది మాత్రమే కాదు. కులం, మతం కూడా చూడకుండా పథకాలు డోర్ డెలివరీ చేసి అండగా నిలబడ్డ ప్రభుత్వం మనది. అలాంటి ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడూ లేదు. పథకాలు అమలు చేయకుండా ఉండేందుకు చాలా కారణాలు చూపొచ్చు. కానీ, మనం ఆ పని చేయలేదు. మన హయాంలో కోవిడ్ వంటి సంక్షోభం ఎదుర్కొన్నాం. అయినా ఏ పథకాన్ని ఆపలేదు. పైగా, అంతకు ముందు చంద్రబాబు చేసిన అప్పుల భారం కూడా మన మీద పడింది. ఆ అప్పుల భారాన్ని కూడా మనం మోశాం. చాలా బకాయిలు పెట్టి పోయారు. దాదాపు రూ.20 వేల కోట్ల కరెంటు బిల్లులు వదిలిపెట్టి వెళ్లారు. మనం అధికారంలో ఉన్నప్పుడు రెండేళ్ల పాటు కోవిడ్‌తో యుద్ధం చేశాం. ఈ సమయంలో అనూహ్యంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గి, మరోవైపు ఖర్చు విపరీతంగా పెరిగింది. అయినా ఏరోజూ సాకులు చూపకుండా పథకాలు అమలు చేశాం. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటీ అమలు చేయాల్సిన ధర్మం మన మీద ఉందని భావించి అన్నీ చేశాం. పూర్తి పారదర్శకంగా పథకాలు అమలు చేసి, బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో నగదు జమ చేశాం. తొలిసారిగా డెలివరీ మెకానిజంలో లంచాలు లేకుండా, కేవలం వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలోనే ఇవ్వొచ్చు అని రుజువు చేసి చూపాం. కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు: మరోవైపు విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం. స్కూళ్లలో ఎప్పుడూ చూడని మార్పులు చేశాం. ఆరో తరగతి నుంచి డిజిటల్ బోధన, ఇంగ్లిషు మీడియం, నాడు–నేడుతో స్కూళ్ల మార్పులు, సీబీఎస్‌ఈ సిలబస్, టోఫెల్ క్లాసులు, ఎనిమిదో తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు పెడుతూ ఎప్పుడూ చూడని మార్పులు తీసుకు వచ్చింది కూడా మన ప్రభుత్వమే. వైద్య రంగంలోనూ ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. మనం అధికారంలోకి రాక ముందు కేవలం వేయి చికిత్సలకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీని 3350 ప్రొసీజర్లకు పెంచాం. ఏకంగా పేదలకు రూ.25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీని పరిధిని పెంచాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆరోగ్య ఆసరా కూడా తీసుకు వచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తూ నాడు–నేడు తీసుకొచ్చాం. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లే ఉండరు అన్న పరిస్థితి నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చూశాం. జీఎంపీ ప్రమాణాలున్న మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇచ్చాం. కొత్తగా 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టాం. మన గ్రామంలోనే వైద్యం కోసం వైయస్ఆర్ విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశాం. అక్కడే 105 రకాల మందులు, 14 రకాల టెస్టులు చేసే విధంగా ఆరోగ్య సురక్ష అందుబాటులోకి తెచ్చాం. వ్యవసాయ రంగంలోనూ గణనీయమైన మార్పులు తీసుకుని వచ్చాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉచిత పంటల బీమా కేవలం వైయస్సార్సీపీ ప్రభుత్వంలోనే అమలైంది. రైతులకు పెట్టుబడి భరోసా ఇచ్చింది, పక్కాగా అమలు చేసింది మన ప్రభుత్వం మాత్రమే. మొదటిసారిగా ఇ–క్రాపింగ్, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, తొలిసారిగా రైతులకు దళారీ వ్యవస్థ లేకుండా పంటలు కొనుగోలు చేసే కార్యక్రమం కూడా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలోనే జరిగింది. అక్కచెల్లెమ్మల రక్షణ కోసం దిశ యాప్‌ను అందుబాటులోకి తెచ్చాం. అక్కచెల్లెమ్మలు ఇంటి నుంచి బయటకు ధైర్యంగా వెళ్లడానికి వీలుగా ఆ యాప్ అందుబాటులోకి తెచ్చాం. ఆపదలో ఎస్‌ఓఎస్ బటన్ నొక్కిన పది నిమిషాల్లో పోలీసులు చేరుకుని, వారిని కాపాడే పరిస్ధితి ఉండేది. ఆ మంచి ప్రతిచోటా కనిపిస్తోంది: మనం చేసిన మంచి పనులు ఎక్కడికీ పోలేదు. మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో బ్రతికే ఉంది. మన కార్యకర్తలు ఏ గ్రామంలోనైనా ఈ పనులన్నీ చేశామని గర్వంగా చెప్పుకోగలరు. అయినా కూడా చంద్రబాబులా మనం అబద్ధాలు ఆడలేకపోయాం. చంద్రబాబు అబద్ధాలతో పోటీ పడలేకపోయాం. వాళ్లు ఓట్లు అడగడానికి వెళ్లి మోసంతోనే ప్రచారం చేశారు. చంద్రబాబు అబద్ధాలతో మోసం: ఓట్లు అడగడానికి వెళ్లిన ప్రతి చోటా అబద్ధాలు చెప్పి అందరినీ మోసం చేశారు. వాలంటీర్లను తీసేయబోమని, వారికి రూ.10 వేల వేతనం ఇస్తామని చెప్పి దగా చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ది, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఇంట్లో ఎంత మంది ఉన్నా.. పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు అని, వారి తల్లి కనిపిస్తే నీకు రూ.18 వేలు అని, వాళ్ల చిన్నమ్మ కనిపిస్తే నీకూ రూ.18 వేలు అని, 50 ఏళ్లకు పైబడిన మహిళ కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, కండువాతో రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు అని ప్రతి ఒక్కరికీ సంఖ్యలు చెప్పి అబద్ధాలతో మోసం చేశారు. నేను కూడా ఒకవేళ అలాంటి అబద్ధాలు చెప్పి ఉంటే, ఈరోజు సీఎం స్ధానంలో ఉండేవాడిని. కానీ, మీలో ఎవరైనా ఇవాళ ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్లే పరిస్థితి ఉండేదా?. వ్యవస్థలన్నీ దారుణ పతనం: ఈరోజు చంద్రబాబుగారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ తెలుగుదేశం కార్యకర్తలు గ్రామంలో ఏ ఇంటికీ వెళ్లలేని పరిస్థితి. పిల్లలు రూ.15 వేల గురించి అడుగుతారు. మహిళలు రూ.18 వేల గురించి అడుగుతారు. పెద్దవాళ్లు రూ.48 వేల గురించి అడుగుతారు. రైతులు నా రూ.20 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఒకవైపు పథకాల పరిస్థితి ఇలా ఉంటే.. మరోవైపు వ్యవస్థలన్నీ పూర్తిగా దిగజారిపోయాయి. విద్య, వైద్య రంగాలను నాలుగు నెలల్లోనే నాశనం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని పేదవాడు వెళితే వైద్యం చేస్తారన్న నమ్మకం లేని పరిస్థితి వచ్చింది. వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయి. దాదాపుగా రూ.2400 కోట్లు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. పిల్లలకు మూడు నెలలకొకమారు ఇవ్వాల్సిన విద్యాదీవెన, వసతి దీవెన మూడు క్వార్టర్లు గడిచినా ఇవ్వలేదు. రైతులకు ఖరీఫ్ సీజన్ ముగిసినా పెట్టుబడి సహాయం లేదు. ఆర్బీకేలు లేవు. ధాన్యం కొనుగోలులో మళ్లీ దళారులు వచ్చారు. నాడు–నేడు లేదు. ఇంగ్లిషు మీడియం లేదు. ఏ పథకమూ డోర్ డెలివరీ లేకుండా చేశారు. తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లకు వెళ్తేనే వాళ్ల సమక్షంలో పథకాలు ఇచ్చే పరిస్ధితి. అక్కడకు వెళ్లకపోతే పథకాలు నిలిచిపోతాయి. ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు కట్ చేశారు. రెడ్‌బుక్ పాలన: రాష్ట్రంలో ఇప్పుడు రెడ్‌బుక్ పాలన కొనసాగుతోంది. ప్రజలను భయపెడుతున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రలోభాలకు గురి చేస్తున్నారు. హద్దుల్లేని అవినీతి జరుగుతోంది. అన్ని వ్యవస్ధలు కూలిపోయాయి. అంతులేని అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం పది పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. మద్యం అమ్మకాలు పెంచే కార్యక్రమం నడుస్తోంది. డిస్టలరీస్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. లిక్కర్ సిండికేట్స్ అప్పుడే మొదలయ్యాయి. గ్రామ, గ్రామాన బెల్టు షాపులు ప్రమోట్ చేసే కార్యక్రమం నడుస్తోంది. ఇక ఇసుక గురించి మాట్లాడలేని పరిస్థితి. మన హయాంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇవాళ ఉచితం లేదు కానీ, రెట్టింపుకన్నా, ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. చంద్రబాబుకు పరాజయం తప్పదు: చంద్రబాబు అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పారు. ప్రజలను అబద్ధాలతో మోసం చేశారు. ఆ మోసాలకు గురైన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అన్నీ చేసిన మనకే ఇలా అయితే, ప్రజలను ఇంతలా మోసం చేసి, అన్నీ అబద్దాలే చెప్పిన చంద్రబాబును ప్రజలు ఏం చేస్తారు?. ఆయన ప్రజలను ఎన్ని రోజులు భయపెడతారు?. ఎన్ని రోజులు కేసులు పెడతారు?. ప్రజలకు అన్నీ తెలుసు. అందుకే ఆయనకు పరాజయం తప్పదు. చంద్రబాబుకు సింగిల్ డిజిట్ కూడా ఇవ్వరు. ఇది నిజం. మోపిదేవి వీడడం బాధాకరం: మోపిదేవి వెంకటరమణ పార్టీ వీడి వెళ్లిపోవడం బాధాకరం. ఆయన విషయంలో ఎప్పుడూ తప్పు చేయలేదు. ఏరోజైనా మంచే చేశాం. తాను ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎమ్మెల్సీని చేశాం. అంతటితో మర్చిపోకుండా మంత్రి పదవి ఇచ్చి కేబినెట్‌లో పెట్టుకున్నాను. మండలిని రద్దు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆయన పదవి పోకుండా అడిగిన వెంటనే రాజ్యసభకు పంపాం. ఒక మత్స్యకారుడికి తొలిసారిగా రాజ్యసభ ఇచ్చిన ఘనత మన పార్టీది. మనం ఆయనను ఎక్కడా తక్కువ చేయలేదు. గణేష్ మీ మనిషి: ఇప్పుడు గణేష్‌కు మీ మద్దతు చాలా అవసరం. మనిషి మంచి వాడు. కార్యకర్తకు ఏం జరిగినా నా దృష్టికి తీసుకొస్తాడు. గణేష్‌లో ఆ మంచి గుణం ఉంది. ఆయన మీలో ఒకడు. మీ నుంచి వచ్చిన వాడు. కష్టాలు శాశ్వతం కాదు: ఎవరికైనా వ్యక్తిత్వం ముఖ్యం. కష్టాలు కొత్తేమీ కాదు. రాజకీయాల్లో కష్టాలు శాశ్వతం కాదు. నన్నే ఉదాహరణగా తీసుకొండి. మా నాన్న ముఖ్యమంత్రి. అయినా కష్టాలు వచ్చాయి. పెద్దవాళ్లంతా ఏకమయ్యారు. తప్పుడు కేసులు పెట్టారు. ఏకంగా 16 నెలలు జైల్లో పెట్టారు. వేధించారు. అయినా ప్రజలు ముఖ్యమంత్రిగా ఆశీర్వదించలేదా? మంచి చేసే మనసు ఉన్నప్పుడు, ఆ మంచి వైపు దేవుడు తప్పకుండా ఉంటాడు. ఈ విషయాన్ని కచ్చితంగా అందరూ గుర్తు పెట్టుకోవాలని వైయస్ జగన్ అన్నారు.