విశాఖపట్నం: వంద రోజుల పాలనలో కొత్త ఒరవడికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే అధిక శాతం హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. పేదల పక్షపాతిగా నాడు దివంగత వైఎస్సార్ పేరు తెచ్చుకున్నారని, నేడు అదే పేరును వైఎస్ జగన్ నెలబెట్టుకున్నారని పేర్కొన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా వంద రోజులపాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ప్రశంసించారు. నూరు రోజుల పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేశారని కొనియాడారు.
మంత్రి అవంతి శ్రీనివాస్ శుక్రవారం విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ప్రజలకి నమ్మకం పెరిగేలా వైఎస్ జగన్ మంచిపాలన అందిస్తున్నారు. మా ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకం. అభివృద్దికి మేం ఆటంకం కాదు. ఇసుక పేరుతో గత ప్రభుత్వం దోపిడీకి పాల్పడింది. పాలనలో కొత్త ఒరవడికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. వంద రోజుల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ లేని విధంగా పరిపాలన చేస్తున్న ఘనత జగన్‌ది. టీడీపీ బినామీలు, అవినీతిపరులకి నిద్రపట్టకే మా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిపై నారా లోకేష్ ఆరోపణలను ఖండిస్తున్నాం. లోకేష్‌కు మంగళగిరి ప్రజలు బుద్ధి చెప్పినా తీరు మారలేదు. ఆయనకు వైఎస్ జగన్‌ను విమర్శించే హక్కు లేదు. పాడేరులో మెడికల్ కళాశాలకు సీఎం అనుమతి ఇచ్చారు. విశాఖ అభివృద్ది నాడు వైఎస్సార్ తర్వాత మళ్లీ సీఎం జగన్ తోనే సాధ్యం’ అని పేర్కొన్నారు.