డీఎస్సీ బాధిత అభ్య‌ర్థుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా 

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వంలో ఖ‌చ్చితంగా న్యాయం చేస్తామ‌ని హామీ

అప్ప‌టిదాకా వారి త‌ర‌ఫున కోర్టుల్లో పోరాడ‌తామ‌ని చెప్పిన మాజీ సీఎం   

తాడేప‌ల్లి క్యాంప్ కార్యాల‌యంలో మాజీ ముఖ్య‌మంత్రి, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షుడు శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ తో భేటీ అయిన వివిధ జిల్లాల నుంచి వ‌చ్చిన డీఎస్సీ అభ్య‌ర్థులు.

తాడేపల్లి:  డీఎస్సీ -2025 నిర్వ‌హ‌ణ‌లో చోటుచేసుకున్న అక్ర‌మాల కార‌ణంగా న‌ష్ట‌పోయిన అభ్య‌ర్థుల‌కు అండగా ఉంటామ‌ని, వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక ఖచ్చితంగా న్యాయం చేస్తామ‌ని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్ హామీ ఇచ్చారు. తాడేప‌ల్లి వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన డీఎస్సీ అభ్యర్థులతో ఆయ‌న‌ భేటీ అయ్యారు. డీఎస్సీ -2025 ఈ పరీక్ష నిర్వహణ, స్పోర్ట్స్ కేట‌రిగీ కింద ఎంపిక‌, రూల్ రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయ‌కుండా త‌మ‌కు న‌ష్టం చేశార‌ని అభ్య‌ర్థులు ఎంపికలో చోటు చేసుకున్న అక్రమాలను మాజీ సీఎంకు వివరించి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ అభ్యర్థుల ఆవేదన, గోడు సావధానంగా విన్న శ్రీ వైయస్‌ జగన్, వారికి అండ‌గా ఉంటామ‌ని, వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక ఖ‌చ్చితంగా న్యాయం చేస్తామ‌ని భరోసా ఇచ్చారు. అప్ప‌టివ‌ర‌కు కోర్టులో అభ్య‌ర్థుల త‌ర‌ఫున వైయ‌స్సార్సీపీ పోరాడుతుంద‌ని హామీ ఇచ్చారు.  
 
శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన అనంత‌రం అక్క‌డే మీడియాతో మాట్లాడిన అభ్యర్థులు ఎవరెవరు ఏమేం మాట్లాడారంటే..

నారా లోకేష్ ఇప్పుడెందుకు నోరెత్త‌డం లేదు 
- ఎ. ర‌విచంద్ర,  వైయ‌స్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అడుగడుగునా అవినీతి, అక్ర‌మాల‌తో డీఎస్సీ -2025 ద్వారా టీచ‌ర్‌ పోస్టుల‌ను భ‌ర్తీ చేసిన కూట‌మి ప్ర‌భుత్వం అడ్డంగా దొరికిపోయింది. ఇన్నాళ్లూ 16,347 టీచ‌ర్ పోస్టుల‌ను ఒకేసారి భ‌ర్తీ చేశామ‌ని గొప్ప‌గా చెప్పుకున్న మంత్రి నారా లోకేష్‌.. టీచ‌ర్ నియామకాల్లో అవినీతి జ‌రిగిన‌ట్టు ఆధారాల‌తో స‌హా రుజువు కావ‌డంతో క‌నీసం నోరు మెద‌ప‌డం లేదు. క‌టాఫ్ మార్కులు లేకుండా ప్ర‌భుత్వం డీఎస్సీ నిర్వ‌హించింది. రూల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయ‌లేదు. పబ్లిక్ డొమైన్‌లో టెట్ మార్కులు పెట్ట‌లేదు. ఓపెన్‌లో సీటొచ్చిన అభ్య‌ర్థుల‌కు రిజర్వేష‌న్‌లో భ‌ర్తీ చేయ‌డంతో రిజ‌ర్వేష‌న్ కేట‌గిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్య‌ర్థులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. టెట్‌, బీఈడీ లేకుండా 421 పోస్టుల‌ను స్పోర్ట్స్ కేట‌గిరీ కింద భ‌ర్తీ చేయ‌డం ద్వారా భారీ అవినీతికి కూట‌మి ప్ర‌భుత్వం తెర‌దీసింది. 1:1 (వ‌న్ ఈజ్ టూ వ‌న్‌) స‌ర్టిఫికెట్‌ల వెరిఫికేష‌న్‌కి హాజ‌రై ఉద్యోగం వ‌స్తుంద‌న్న భ‌రోసాతో ఇంటికెళ్లిన వారికి పోస్టింగ్ కి సంబంధించి ఎలాంటి మెసేజ్‌లు పంపకుండా వారి ఆశ‌ల‌పై ప్ర‌భుత్వం నీళ్లు చ‌ల్లింది. స్పోర్ట్స్ కేట‌గిరీ పేరుతో అర్హులైన అభ్య‌ర్థుల పొట్ట‌గొట్టారు. అర్హులైన త‌మ‌కు అన్యాయం చేసి పోస్టుల‌ను పెద్ద ఎత్తున అమ్ముకున్నార‌ని దీనిపై సీబీఐ తో విచార‌ణ చేయించాల‌ని అభ్య‌ర్థులు డిమాండ్ చేస్తున్నారు. వారంతా త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ గారిని తాడేప‌ల్లి క్యాంప్ కార్యాల‌యంలో క‌లవ‌డం జ‌రిగింది. వారికి వైయ‌స్సార్సీపీ అండగా ఉంటుంద‌ని వైయ‌స్ జ‌గ‌న్ గారు భ‌రోసా ఇచ్చారు. 

నా పోస్టును స్పోర్ట్స్ కోటా కింద భ‌ర్తీ చేశామ‌న్నారు
- కె.రాణి, కృష్ణా జిల్లా

నేను డీఎస్సీ- 2025 స్కూల్ అసిస్టెంట్, ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ ప‌రీక్ష రాశాను. క్వాలిఫై అయ్యాను. మెరిట్ లిస్టులో నా పేరొచ్చింది. సెల‌క్ష‌న్ లిస్టులో ఉన్నాను. 1:1 రేషియోలో కూడా నా స‌ర్టిఫికెట్‌ల వెరిఫికేష‌న్ చేశారు. రెండురోజుల త‌ర్వాత ప్ర‌క‌టించిన రిజెక్ష‌న్ లిస్టులో కూడా నా పేరు కూడా లేదు. కానీ ఫైన‌ల్ లిస్టులో నా పేరు తీసేశారు. నాది బీసీ-బీ లో మూడో పోస్టు. ఎందుకు తీసేశార‌ని అడిగితే నాది తీసేసి స్పోర్ట్స్‌ కేటగిరీలో ఇచ్చామని చెప్పారు. హారిజాంట‌ల్ రిజ‌ర్వేష‌న్ వ‌ల్ల పోస్టు మిస్స‌య్యింద‌ని చాలా తేలిగ్గా స‌మాధానం చెప్పారు. వెరిఫికేష‌న్ కి వ‌చ్చినంత మాత్రాన జాబ్ ఇస్తామ‌న్న‌ట్టు కాద‌ని చెబుతున్నారు. మాకు న్యాయం చేయాల‌ని కోరుతూ న‌ష్ట‌పోయిన అభ్య‌ర్థుల‌మంతా మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గారిని క‌ల‌వ‌డం జ‌రిగింది. వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక త‌ప్ప‌కుండా న్యాయం చేస్తామ‌ని చెప్పారు. అప్ప‌టివ‌ర‌కు మా ప‌క్షాన వైయ‌స్సార్సీపీ న్యాయ‌స్థానాల్లో పోరాడుతుంద‌ని భ‌రోసా ఇచ్చారు. ఆయ‌న‌కు మా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాము. 

కోర్టు ఆర్డ‌ర్ ప‌ట్టుకుని అడిగినా లెక్క చేయ‌లేదు  
- అనిగి దుర్గయ్య, పోలవరం మండలం, ప.గో జిల్లా

ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌కి ద‌రఖాస్తు చేశాను. నేషనల్‌ గేమ్స్‌లో బంగారు పతక విజేతను. మా జిల్లా నుంచి 6 పోస్టులు ఉంటే, అవన్నీ కూడా రజతం, కాంస్య పతక విజేతలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి, నాకు బంగారు పతకం ఉన్నా, ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారు. గోల్డ్ మెడ‌ల్ కాబ‌ట్టి త‌ప్ప‌కుండా ఉద్యోగం ఇవ్వాల్సిందేన‌ని కోర్టు కూడా చెప్పింది. కోర్టు ఆర్డ‌ర్ ప‌ట్టుకుని అధికారుల చుట్టూ తిరిగినా ఏం ప్ర‌యోజ‌నం క‌నిపించ‌లేదు. స‌ర్టిఫికెట్లు ప‌రిశీలించ‌కుండా నేష‌న‌ల్ గేమ్స్‌లో కేవ‌లం పార్టిసిపేట్ చేసిన వారికి కూడా పోస్టులు ఇచ్చేశారు.  

టెట్‌, డీఎస్సీ రాయ‌కుండా పోస్టులెలా ఇచ్చారు? 
- ఇందిర, కృష్ణా జిల్లా.

నేను ఎస్సీ అభ్య‌ర్థిని. నేను పీజీటీ, టీజీటీ రెండు ఉద్యోగాలొచ్చాయి. 1:1 రేషియోలో స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్‌కి కూడా హాజ‌ర‌య్యాను. కానీ తీరా చూస్తే ఇటు సెల‌క్ష‌న్ లిస్టులో, అటు రిజెక్ష‌న్ లిస్టులోనూ నా పేరు లేకుండా చేశారు. దీంతో డీఈఓ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ చేసి, మళ్లీ కుల ధృవీకరణ సర్టిఫికెట్‌ అడిగితే పంపాను. ఆ త‌ర్వాత డీఈవోను అడిగినా స‌రైన స్పంద‌న లేదు. నా పోస్టును స్పోర్ట్స్ కోటాలో భ‌ర్తీ చేశామ‌ని చెప్పారు. టెట్‌, డీఎస్సీ లేకుండా అలా ఎలా భ‌ర్తీ చేస్తార‌ని అడిగితే అదంతే అని డీఈవో దురుసుగా స‌మాధానం చెప్పారు. మెరిట్‌లో ఉన్న మా ఉద్యోగాలు తీసేసి ఏ ప‌రీక్ష రాయ‌ని వారికి స్పోర్ట్స్ కోటా కింద‌ ఉద్యోగం ఇచ్చి మాకు అన్యాయం చేశారు. ఇలాంటి వారికి టీచ‌ర్ ఉద్యోగాలిచ్చి పిల్ల‌ల భ‌విష్య‌త్తుతో ప్ర‌భుత్వం ఆడుకుంటోంది. ఇన్నాళ్లూ  మా కష్టాల‌ను విన్న నాథుడే లేక అల్లాడిపోయాం. ఈరోజు వైయ‌స్ జ‌గ‌న్ గారు మా బాధ‌ల‌ను పూర్తిగా విని న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. జ‌గ‌న‌న్న‌కు మేం రుణ‌ప‌డి ఉంటాం. 

న్యాయం చేస్తామ‌ని జ‌గ‌న్ గారు భ‌రోసా ఇచ్చారు
- బాల‌కృష్ణ‌, కాకినాడ‌, తూర్పుగోదావ‌రి

స్కూల్ అసిస్టెంట్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌లో నేను స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కి కూడా హాజ‌ర‌య్యాను. కానీ సెల‌క్ష‌న్ లిస్టులో మా పేరు లేకుండా చేసి అన్యాయం చేశారు. ఇన్నాళ్లూ ఎంత‌మంది అధికారులు, అధికార పార్టీ నాయ‌కులను క‌లిసి న్యాయం చేయాల‌ని కోరినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మాజీ ముఖ్య‌మంత్రి వైయస్ జ‌గ‌న్ గారిని క‌లిసి మా క‌ష్టాలు చెప్పుకొన్నాం. అండ‌గా ఉంటామ‌ని ఆయ‌న మాకు హామీ ఇచ్చారు. డీఎస్సీ-2025 ద్వారా న‌ష్ట‌పోయిన ప్ర‌తి అభ్య‌ర్థికి వ‌చ్చే వైయ‌స్సార్సీపీప్ర‌భుత్వంలో ఖ‌చ్చితంగా న్యాయం చేస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు. 

రూల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్ అమ‌లు కాలేదు  
- కె.శరత్‌బాబు, కాకినాడ, తూ.గో జిల్లా

నేను జోన్- 2లో పీఈటీ అభ్య‌ర్థిగా ప‌రీక్ష రాసి 1:1 రేషియోలో స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కి కూడా హాజ‌ర‌య్యాను. జోన్ ఆఫ్ కన్సిడ‌రేష‌న్ ప్ర‌కారం ఎవ‌రైతే సెలెక్ట్ అయ్యారో వారికే కాల్ లెట‌ర్స్ పంపించామ‌ని చాలా స్ప‌ష్టంగా చెప్పారు. కానీ రెండు వారాల తర్వాత ఇచ్చిన సెల‌క్ష‌న్ లిస్టులో నా పేరు లేదు. ఉద్యోగం వ‌చ్చిందన్న సంతోషం మాకు కొద్ది రోజులు కూడా నిల‌వ‌లేదు. నా పేరు ఎందుకు లేద‌ని అడిగితే మెరిట్ లిస్టులో వ‌చ్చిన వారికి రిజ‌ర్వేష‌న్ కేట‌గిరీలో ఉద్యోగం ఇవ్వ‌డంతో నాకు రావాల్సిన‌ ఉద్యోగం రాకుండా పోయింది. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉద్యోగాల భ‌ర్తీ చేశార‌ని మా బాధ‌ను ఎవ‌రికి చెప్పుకున్నా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. కోర్టులో కేసులైనా వేసుకోండ‌ని మమ్మ‌ల్ని హెచ్చ‌రించారు. చివ‌రికి వైయ‌స్ జ‌గ‌న్ గారు మా బాధ‌ను ఆల‌కించి  మాకు అన్యాయం జ‌రిగింద‌ని గ్ర‌హించారు. వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక ఖ‌చ్చితంగా న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. అప్ప‌టి వ‌ర‌కు కోర్టుల్లో న్యాయ పోరాటం చేద్దామ‌ని చెప్పారు. ఆయ‌నిచ్చిన భ‌రోసాతో ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది.

Back to Top