వైయ‌స్ఆర్‌ కుటుంబానికి సదా కృతజ్ఞుడునై ఉంటా

సీఎం ఆదేశాల మేర‌కు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం శ్ర‌మిస్తా..

రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేసినందుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌తలు

వైయ‌స్ఆర్ సీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి

అమ‌రావ‌తి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సూచ‌న‌లు, స‌ల‌హాల మేర‌కు, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌టం కోసం నిరంత‌రం శ్ర‌మిస్తామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నామినేషన్ల గడువు ముగియడంతో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులు విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఆర్‌. కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు డిక్లరేషన్ అందించారు. ఈ సందర్భంగా ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ ఆశయాలు, పార్టీ విధి, విధానాల మేరకు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగించేలా ప్రతి కార్యక్రమం ఉంటుందన్నారు. త‌మ‌పై నమ్మకంతో రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేసినందుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. 

రాజ్యసభలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది మంది సభ్యులు ఉన్నారని, వీరిలో 50 శాతానికి పైగా బీసీలు ఉన్నార‌ని గుర్తుచేశారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. లోక్ సభలో 21 మంది సభ్యులతో కలిపి, మొత్తం 30 మంది పార్లమెంటు సభ్యులు రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన ఎజెండాగా పోరాడతామ‌న్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం సమష్టిగా ప‌నిచేస్తామ‌ని చెప్పారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ ఎజెండాను పార్లమెంటులో వినిపిస్తామ‌న్నారు.  రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు తీసుకువెళ్ళేందుకు కృషిచేస్తామ‌ని చెప్పారు. వైయ‌స్ రాజారెడ్డి దగ్గర నుంచి దివంగ‌త మహానేత వైయ‌స్ఆర్, ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ వరకు, గత మూడు తరాలుగా ఆ కుటుంబానికి సేవలు అందిస్తున్న తనకు, రాష్ట్రానికి, ప్రజలకు సేవలందించే భాగ్యం కల్పించిన ఆ కుటుంబానికి సదా కృతజ్ఞుడునై ఉంటానని విజయ‌సాయిరెడ్డి అన్నారు. 

Back to Top